-
-
Home » Andhra Pradesh » NTR death anniversary program live updates
-
NTR Death Anniversary Live Updates: దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్.. చంద్రబాబునాయుడు
ABN , First Publish Date - Jan 18 , 2024 | 09:17 AM
దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని, ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా ట్వీట్ చేశారు.
Live News & Update
-
2024-01-18T15:00:52+05:30
గుడివాడలో వైసీపీకి షాక్..
గుడివాడలో వైసీపీ శ్రేణులకు టీడీపీ వర్గీయులు షాక్ ఇచ్చారు. వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరావు వర్గీయులు పై చేయి సాధించారు. టీడీపీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు తరలివచ్చారు. వారిని నిలవరించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. కాగా.. స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కొడాలి నాని వెంటనే ఆ ప్రాంతం వెళ్లిపోయారు.
-
2024-01-18T14:15:37+05:30
పశ్చిమ గోదావరి జిల్లాలో..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
-
2024-01-18T14:00:23+05:30
అది ఎన్టీఆర్ పుణ్యమే..
గృహ పథకం, రేషన్ కు మారు పేరు ఎన్టీఆర్ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆస్తిలో స్త్రీపురుషులకు సమాన హక్కు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. పేద వారికి రేషన్ చేరుతుందంటే అది ఎన్టీఆర్ పుణ్యమేనని అన్నారు. పింఛన్, ఉచిత కరెంటుకు కేరాఫ్ గా ఎన్టీఆర్ నిలిచారన్నారు. ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కోటంరెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం మరింత ముందుకు వెళ్లగలుగుతుందని స్పష్టం చేశారు.
-
2024-01-18T13:45:05+05:30
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లెపాడులో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమంలో మాజీమంత్రి సోమిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్దిలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
-
2024-01-18T13:00:18+05:30
నివాళులర్పించిన దేవినేని ఉమా..
ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి వన్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శివనాథ్ (చిన్ని), పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కారణజన్ముడు, యుగపురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం రెండు రూపాయల పధకం తీసుకువచ్చారని ఈ సందర్భంగా దేవినేని ఉమా కొనియాడారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్‌దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు.
-
2024-01-18T12:30:30+05:30
నివాళులర్పించిన రేణుకా చౌదరి..
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎన్టీ రామారావు విగ్రహానికి మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు రేణుకా చౌదరికి టీడీపీ నేతలు శాలువా కప్పి సన్మానించారు. నందమూరి తారక రామారావు ఎక్కడకు పోలేదని.. ఆయన మన మధ్యలోనే ఉన్నారని అన్నారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఆయనేనని చెప్పారు. నేడు చంద్రబాబు నాయుడు పార్టీని నడుపుతున్నారంటే దానికి ఎన్టీఆరే కారణమన్నారు. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల వ్యవధిలో గెలిచి ముఖ్యమంత్రి అవడం సాధారణ విషయం కాదని కొనియాడారు.
-
2024-01-18T12:15:01+05:30
షరతులతో అనుమతి..
వెనిగండ్ల రాముకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు షరతులతో కూడిన అనుమతి ఇస్తామని పోలీసులు వెల్లడించారు. పోలీసుల తీరుపై ఆయన అనుచరులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలోని టీడీపీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు భారీగా వస్తుండటంతో పలు రహదారులకు పోలీసులు బారికేడ్స్ ను అడ్డంగా పెట్టారు.
-
2024-01-18T12:00:29+05:30
గుడివాడ పోలీసుల అతి...
గుడివాడ తెలుగుదేశం కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి తెలుగుదేశం జనసేన శ్రేణుల్ని అడ్డుకుంటున్నారు. పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు తెలుగుదేశం జనసేన నేతలు వెళ్లరాదంటూ బారికేడ్లు అడ్డంపెట్టారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఆయన విగ్రహానికి దండ వేయనీయకుండా అడ్డంకులేంటని పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. కాగా.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొడాలి నాని కార్యక్రమానికి అనుమతులివ్వడం గమనార్హం.
-
2024-01-18T12:00:00+05:30
కర్నూలు జిల్లాలో...
పత్తికొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కేఈ శ్యాంబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ లో ఎన్టీఆర్ చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ వద్ద టీడీపీ ఇన్ ఛార్జ్ తిక్కారెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
2024-01-18T11:45:05+05:30
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు..
పెందుర్తిలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలు, పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. 1989లో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దించి విపి సింగ్ ను ప్రధానమంత్రిని చేయడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ మరణంతో టీడీపీ అంతం అయిపోతుందని అందరూ అనుకున్న సమయంలో చంద్రబాబునాయుడు పార్టీకి పెద్దగా మారారని చెప్పారు. అనకాపల్లి పరవాడలో ఎన్టీఆర్ 28 వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
-
2024-01-18T11:30:06+05:30
అనంతపురం జిల్లా..
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వాట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా పాల్గొన్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్య వ్యక్తి అయిన ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం తథ్యమని వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలిపారు.
-
2024-01-18T11:15:00+05:30
పల్నాడు, గుంటూరు జిల్లాలు....
పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం గ్రామం లో ఎన్టీఆర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొన్నూరు మండలం చింతలపూడి లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర నివాళులు అర్పించారు. సత్తెనపల్లిలో కన్నా కార్యాలయంలో ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు.
-
2024-01-18T11:00:38+05:30
ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందుకు..
ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతోపాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండటం తన అదృష్టమని గద్దె రామ్మోహన్ అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కూడు, గూడు, గుడ్డ అనే మూడే మూడు విధానాలతో ముందుకు సాగారన్నారు. తాను ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నానని చెప్పారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తండ్రి పేరును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టి లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.
-
2024-01-18T10:45:40+05:30
కారణ జన్ముడికి జోహార్లు..
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులు అర్పించారు. "తెలుగుజాతి ఖ్యాతి మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు" అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
-
2024-01-18T10:30:00+05:30
'రా... కదలిరా!' ..
దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని, ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా ట్వీట్ చేశారు. "ఒకే ఒక జీవితం... రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది... తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి.
ఎన్టీఆర్ స్ఫూర్తిగా..
బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ... తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలి. అందుకే 'తెలుగుదేశం పిలుస్తోంది. రా... కదలిరా!' అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా... నేను 'రా... కదలిరా!' అని పిలుపునిచ్చాను. తెలుగు ప్రజలరా! రండి... ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్ కు అసలైన నివాళి అర్పించుదాం. అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
-
2024-01-18T10:00:00+05:30
సంక్షేమానికి మారుపేరుగా ఎన్టీఆర్ నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కళామతల్లి ఆశీర్వాదం పొందని ఆయన తెలుగువాళ్లు ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేశారని చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారన్నారు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
-
2024-01-18T09:45:00+05:30
తెలుగువారి దమ్ము, ధైర్యం ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు మరణం లేదన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేసుకున్నారు. పేదవారి ఆకలి తీర్చిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆర్.. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఅర్ నడిచిన మార్గం ఎందరికో స్పూర్తి దాయకమని.. నటుడిగా ప్రయోగాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని స్మరించుకున్నారు.
-
2024-01-18T09:15:00+05:30
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు. ఉదయాన్నే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. వారితో పాటు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.