Pawan Kalyan : స్మగ్లింగ్‌కు అడ్డాగా కాకినాడ పోర్టు
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:29 AM
కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిపోయిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు
అత్యంత ప్రమాదకర పోర్టుగా కేంద్రానికి లేఖ రాస్తా
రేషన్ బియ్యం మాఫియా నెట్‌వర్క్‌ను కట్టడి చేస్తా
ఇప్పుడు బియ్యం ఎగుమతి.. రేపు పేలుడు, మత్తు
పదార్థాలు దిగుమతి కావని గ్యారెంటీ ఏంటి?
తనిఖీలకు వస్తానంటే 2 నెలలుగా అడ్డుకుంటున్నారు
సముద్రంలో ఓడపైకి వెళ్లడం కుదరదని అబద్ధాలు
డిప్యూటీ సీఎంగా నాకే అధికారులు సహకరించలేదు
నేనొస్తున్నానని తెలిసి జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లారు
కాకినాడ పోర్టులో మీడియాతో పవన్ కల్యాణ్
కాకినాడ పోర్టును ఇలాగే వదిలేస్తే పాకిస్థాన్ వంటి శత్రుదేశాల నుంచి కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ముప్పు పొంచి ఉంది. ఇలా తీరప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే దేశ భద్రతకే పెను ప్రమాదం. అందుకే కాకినాడ పోర్టు అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కాకినాడ పోర్టు, నౌకలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని తనిఖీ చేసిన ఉప ముఖ్యమంత్రి
తుఫాను ముప్పుతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా సాహసించి తొమ్మిది మైళ్లు సముద్రంలో ప్రయాణం
కాకినాడ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిపోయిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఇంత భారీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తీరప్రాంత జిల్లాల్లో ఏ మాత్రం భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇది దేశ భద్రతకే తీవ్ర ముప్పుగా పరిగణిస్తుందన్నారు. పోర్టు నుంచి యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు, మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. కాకినాడ అత్యంత ప్రమాదకరమైన పోర్టు అని ప్రధాని, కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని పేర్కొన్నారు. పోర్టులో తనిఖీలకు వెళ్లాలనుకుంటే రెండునెలలుగా తనను అధికారులు అడ్డుకుంటున్నారని, తానొస్తే పదివేల కుటుంబాల జీవితాలు అతలాకుతులం అయిపోతాయని చెబుతూ తనకు సహకరించడం లేదని మండిపడ్డారు.
తనిఖీల కోసం శుక్రవారం సముద్రం లోపల నౌకపైకి వెళ్తానంటే అక్కడా అధికారులు అడ్డుకున్నారని, ఏంటని నిలదీస్తే వాతావరణం బాగోలేదంటూ డిప్యూటీ సీఎం అయిన తనకే కథలు చెప్పారన్నారు. కాకినాడ పోర్టులో శుక్రవారం ఉపముఖ్యమంత్రి పర్యటించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులోని ఓ బార్జిలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతుంటే ఏం చేస్తున్నారని, మాఫియాకు కొమ్ము కాస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం డీప్‌వాటర్ పోర్టు నుంచి సముద్రం లోపలకు అల్లకల్లోల వాతావరణంలోనే 9 మైళ్లు సాహసంతో కూడిన ప్రయాణం చేశారు. అక్కడ నౌక ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని తనిఖీ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
మాఫియాది పెద్ద నెట్‌వర్క్
‘‘కాకినాడ పోర్టు బియ్యం స్మగ్లింగ్‌కు హబ్‌గా తయారైంది. హోప్ ఐలాండ్‌ను అడ్డంపెట్టుకుని బియ్యం మాపియా రెచ్చిపోతోంది. గతంలో ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై పోరాడితే మమ్మల్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత డ్రోన్ల ద్వారా వీడియోలు తీయించి బియ్యం మాఫియా బండారం బయటపెట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాఫియాను అరికడతామని చెప్పాం. దానికి తగ్గట్టుగా 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నాం. ఇక్కడి నుంచి రోజుకు 1,100 లారీల బియ్యం వెళ్తుంటే తనిఖీ చేయడానికి 11 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. ఈ ముసుగులో రేషన్ బియ్యం వెళ్లిపోతున్నా ఆపేవారు లేరు. అడ్డుకోవాలని మేం ప్రయత్నిస్తుంటే అధికారులు సహకరించడం లేదు. బియ్యం మాఫియా చాలా పెద్ద నెట్‌వర్క్ నడుపుతోంది. పోర్టు ఉన్నది ఎగుమతుల కోసం.. అంతేకానీ స్మగ్లింగ్ కోసం కాదు. దీనిపై పదివేల మంది కార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ తనిఖీల కోసం వస్తానని నేను అధికారులకు సమాచారం ఇస్తే రావద్దని రెండు నెలలుగా అడ్డుకుంటున్నారు. డిప్యూటీ సీఎం అయిన నాకే అధికారుల నుంచి అసలు సహకారం లేదు. శుక్రవారం తనిఖీల కోసం సముద్రంలో నౌక వద్దకు వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక షిప్‌లో తనిఖీలకు వాతావరణం అనుకూలంగా లేదన్నారు. నన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినా బలవంతంగా వెళ్లి భారీ నౌకలో తనిఖీ చేశా. నౌకలో తనిఖీలను అధికారులు ఏదో ఒక సాకు చెప్పి తప్పించాలని చూడడం ఆశ్చర్యం కలిగించింది. దీన్నిబట్టి బియ్యం మాఫియా ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. నేను తనిఖీలకు వస్తే కేఎ్‌సపీఎల్ తరఫున అరబిందో సంస్థ సీఈవో కనీసం రాలేదు. దీన్నిబట్టి ఇక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. పీడీఎస్ బియ్యం ఉన్న భారీనౌకను సీజ్ చేయడంతోపాటు పోర్టు సీఈవోకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించాను’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
మారీటైం పోలీసింగ్ బలహీనం
కాకినాడ పోర్టు నుంచి తనిఖీలు లేకుండా రేషన్ బియ్యం ఎలా ఎగుమతి అవుతోందని చెక్‌పోస్టులో సెక్యూరిటీ, డీఎ్‌సవోను ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని డిప్యూటీ సీఎం చెప్పారు. ‘‘బియ్యం మాఫియాలో 16 కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. దీనిలో కింగ్‌ఫిన్ కంపెనీల పాత్ర కీలకంగా ఉంది. మానస ట్రేడింగ్ కంపెనీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సోదరుడిదిగా చెబుతున్నారు. పెద్ద నెట్‌వర్క్‌గా మారిన బియ్యం మాఫియాపై అసలు ఎవరిపై వేటు వేయాలనేది కూడా అర్థం కావడం లేదు. అంతలా ఈ మాఫియా వేళ్లూనుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని కిలో రూ.43.50 కొనుగోలు చేసి పేదలకు ఇస్తుంటే మాఫియా ఈ బియ్యాన్ని ఆఫ్రికా దేశాల్లో కిలో రూ.70 చొప్పున విక్రయిస్తోంది. బియ్యం సముద్రం దాటి వెళ్లిపోవడానికి తీరప్రాంతంలో మారీటైం పోలీసింగ్ చాలా బలహీనంగా ఉండడమే కారణంగా కనిపిస్తోంది. కాకినాడ తీర ప్రాంతంలో కేజీ బేసిన్ ఉంది. ఓఎన్‌జీసీ వంటి కంపెనీలు ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. మారీటైం సెక్యూరిటీ బలహీనంగా ఉండడంవల్ల ఈరోజు రేషన్ బియ్యం యథేచ్ఛగా ఎగుమతవుతోంది. రేపు ఆర్‌డీఎక్స్, ఆయుధాలు, డ్రగ్స్ దిగుమతి అయ్యే అవకాశం కూడా ఉంది. అసలే రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా ఉంది. కాకినాడ పోర్టు నుంచి కూడా ఎంత గ్రడ్స్ ఎగుమతి, దిగుమతి అయిందో తెలియదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
పీడీ యాక్ట్!
రేషన్ బియ్యం మాఫియాపై పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించిన అనంతరం గవర్నర్, రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంటుందని, దీనిపై సమీక్షిస్తామని తెలిపారు. ‘‘సీఎం చంద్రబాబు దృష్టికి ఈ వ్యవహారం తీసుకువెళ్లా. బియ్యం మాఫియాపై సీఐడీ, సీబీఐ విచారణ చేసే విషయమై మంత్రివర్గంలో ఆలోచిస్తాం. కాకినాడపోర్టు ప్రమాదకరంగా ఉందని, భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి చెప్పాను. కలెక్టర్ స్పందించారు. కానీ, జిల్లా ఎస్పీ నుంచి అసలు స్పందనే లేదు. నేను జిల్లాకు ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఎస్పీ సెలవులో ఉండడం చిత్రంగా ఉంది’’ అని అన్నారు.