Pawan Kalyan : రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం
ABN , Publish Date - Aug 16 , 2024 | 05:56 AM
గత వైసీపీ పాలనలో అన్నివిధాలా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పారు. మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు.
ఆ దిశగా అడుగులు వేస్తున్నాం
ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై
చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్
కాకినాడ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో అన్నివిధాలా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పారు. మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 78వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా పవన్ గురువారం కాకినాడలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, ప్రసంగించారు. గత ప్రభుత్వంలో గాడితప్పిన వ్యవస్థలకు పునర్వైభవం తీసుకురావడంతోపాటు ఆర్థికంగా అతలాకుతలమైన రాష్ట్రానికి జీవం పోస్తామన్నారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా విధించుకుని పని చేస్తామని తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడే వారిపై నిఘా..
‘గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. సోషల్ మీడియాలో మహిళలపై తప్పుగా మాట్లాడేవారిపై నిఘా పెడతాం. మహిళలు, ఆడబిడ్డలను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడే వారిని ఊపేక్షించం. సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి మెసేజ్‌ల వరకు ఆడబిడ్డలపై వేధింపులకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తి లేదు’ అని పవన్ హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన విషయాలపై గత ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించలేదన్నారు.
పవన్‌కు బొకే ఇచ్చి.. సెల్యూట్ చేసిన డాగ్
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీసు డాగ్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ షోలో పవన్‌కల్యాణ్‌కు డాగ్ బొకే ఇచ్చి సెల్యూట్ చేసింది. ఆ బొకే అందుకున్న పవన్.. ప్రతిగా ఆ డాగ్‌కి సెల్యూట్ చేశారు.