Pawan Kalyan : అవినీతి లేకుండా పనిచేయండి
ABN , Publish Date - Nov 10 , 2024 | 04:51 AM
‘పదవులు పొందిన నాయకులు పదిమందినీ కలుపుకొని వెళ్లాలి. సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
ఎన్డీయే భాగస్వాముల్లా మాట్లాడాలి.. ప్రొటోకాల్ మరవద్దు
వ్యక్తిగతంగా కాదు.. పాలసీలపైనే వ్యాఖ్యానించాలి
నైపుణ్య, కుల గణనలు సంపూర్ణంగా జరగాలి
నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలతో పవన్
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘పదవులు పొందిన నాయకులు పదిమందినీ కలుపుకొని వెళ్లాలి. సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో ఆయన శనివారం మధ్యాహ్నం తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అవినీతి లేకుండా పని చేయాలి. పార్టీ మరింతగా ప్రజలకు దగ్గరయ్యేలా పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రొటోకాల్ మర్చిపోవద్దు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు తగిన గౌరవం ఇస్తూ, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. కేవలం జనసేన పార్టీ ప్రతినిధులుగానే కాకుండా ఎన్డీయే ప్రభుత్వంలో భాగంగా మాట్లాడాలి’’ అని పవన్ సూచించారు. ‘కుల గణాంకాలు కావాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. నైపుణ్య గణాంకాలతో పాటు కుల గణాంకాలూ తీసుకోవాలి. దానిలో తప్పు లేదు. ఇది రాష్ట్రంలో సంపూర్ణంగా జరగాలన్నదే నా ఆలోచన. మీడియా వద్ద వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. పాలసీలపైనే చర్చ చేయాలి. ఏదైనా సమస్య ఉంటే నా పేషీ దృష్టికి తీసుకురావాలి’ అని పవన్ కోరారు. నామినేటెడ్ పదవులు పొందిన అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), ఇతర నాయకులకు ఆయన పేరు పేరునా అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు.
పోలీసులూ బాధ్యతగా వ్యవహరించండి...
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. శనివారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ప్రమాద వివరాలు తెలుసుకొని చలించిపోయారు. ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ నుంచి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... ‘రోడ్డు ప్రమాదంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ తీవ్రమైంది. అంతటి కష్టాన్ని దిగమింగుకొని, బ్రెయిన్ డెడ్ అయిన రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం నన్ను కదిలించింది. పోలీసులు ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌పై కేసు పెట్టలేదు. కారులో ప్రయాణిస్తున్న వైద్యుడు కూడా బాధ్యతగా వ్యవహరించకపోవడం దారుణం. పోలీసులు ప్రవర్తించిన తీరుకు నేను క్షమాపణలు చెబుతున్నా’ అని అన్నారు.