Share News

Pawan Kalyan: అన్నయ్యను ‘పద్మవిభూషణ్’ వరించడం ఎనలేని సంతోషాన్నిచ్చింది..

ABN , Publish Date - Jan 26 , 2024 | 07:05 AM

మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు తెలిపారు.

Pawan Kalyan: అన్నయ్యను  ‘పద్మవిభూషణ్’ వరించడం ఎనలేని సంతోషాన్నిచ్చింది..

అమరావతి: మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు తెలిపారు. భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు.

నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారని.. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారన్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా చిరంజీవి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పవన్ పేర్కొన్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయన్నారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహమన్నారు.

విద్యార్థి నాయకుడి దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగారని పవన్ పేర్కొన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవన్నారు. కేంద్ర మంత్రిగానూ విశేషమైన సేవలందించారన్నారు. రాజకీయ ప్రస్థానంతో పాటు స్వచ్ఛంధ సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. వెంకయ్య నాయుడుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరమని... వారందరికీ పవన్ అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 26 , 2024 | 07:05 AM