Share News

కాలి నడకన కొండకు పవన్‌

ABN , Publish Date - Oct 02 , 2024 | 04:49 AM

తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తిరుమల చేరుకున్నారు.

కాలి నడకన కొండకు పవన్‌
Pawan Kalyan

మోకాళ్ల పర్వతం వరకు వడివడిగా

అక్కడి నుంచి పవన్‌లో అలసట

వాహనంలో వెళ్లేందుకు ఏర్పాట్లు

అయినా, మధ్య మధ్య విశ్రాంతితో

నడుస్తూనే తిరుమలకు జనసేనాని

నేడు ప్రాయశ్చిత్త దీక్ష విరమణ


తిరుపతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం తిరుమల చేరుకున్నారు. బుధవారం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నడకమార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలనుకున్న ఆయన.. ఎయిర్‌పోర్టు నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. భద్రతా సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో అలిపిరి నుంచి తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. మెట్ల మార్గంలో వెళ్లి దీక్ష విరమించనున్నట్టు ఇదివరకే ప్రకటించడంతో.....సాయంత్రం 4.50 ప్రాంతంలో అలిపిరి చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ఠ భద్రత మధ్య పవన్‌ కల్యాణ్‌ నడక మొదలుపెట్టారు. రెండు మోకీళ్లకు బెల్ట్‌లు (నీ క్యాప్‌) ధరించారు. అయినప్పటికీ మెట్లు ఎక్కేక్రమంలో పవన్‌లో అలసట కనిపించింది.


విశ్రాంతి తీసుకుంటూ..

మధ్యమధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మోకాళ్ల పర్వతం వరకు వేగంగా నడిచారు. అక్కడ కాళ్ల నొప్పి తీవ్రం కావడంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఒకదశలో మోకాళ్ల పర్వతం నుంచి వాహనంలో తిరుమలకు వెళతారన్న ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగా సిబ్బందీ అప్రమత్తం అయ్యారు. అయితే, ఏడో మైలు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి 9.20 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ఆర్టీసీ బస్టాండు వరకు నడిచారు. అప్పటికే అభిమానులు పెద్దఎత్తున చేరుకోవడంతో ఆర్టీసీ బస్టాండు నుంచి వాహనంలో గాయత్రి సదన్‌కు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు.


pawan7.jpg


శ్రీవారి దర్శనం

బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి గెస్ట్‌హౌ్‌సకు చేరుకుంటారు. గురువారం సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నివేదికలు వచ్చిన పేపథ్యంలో పవన్‌ ప్రాయశ్ఛిత్త దీక్ష చేపట్టారు. సెప్టెంబరు 22 నుంచి 11 రోజుల పాటు ఆయన దీక్షలో ఉన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 02 , 2024 | 12:03 PM