PDF Candidate : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపీమూర్తి!
ABN , Publish Date - Dec 10 , 2024 | 06:37 AM
శాసనమండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి ఘన విజయం సాధించారు.
‘ఉభయ గోదావరి’లో ఘన విజయం సాధించిన పీడీఎఫ్ అభ్యర్థి
కలెక్టరేట్/కార్పొరేషన్(కాకినాడ), డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి ఘన విజయం సాధించారు. కాకినాడ జేఎన్‌టీయూలో సోమవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు కె.హర్షవర్ధన్, రిటర్నింగ్ అధికారి, కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్, జేసీ రాహుల్‌మీనా, ఎస్పీ వికాంత్ర్‌పాటిల్ సమక్షంలో నిర్వహించారు. 14 టేబుళ్లపై ఉదయం 8 గంటల నుంచి మఽధ్యాహ్నం ఒంటిగంట వరకు కౌంటింగ్ కొనసాగింది. మొత్తం 15,494 ఓట్లు పోలవగా, వాటిలో 814 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మిగిలిన 14,680 ఓట్లలో యూటీఎఫ్ బలపర్చిన బొర్రా గోపీమూర్తికి 9,165 ఓట్లు లభించాయి. ఇతర అభ్యర్థులైన గంధం నారాయణరావుకు 5,259, దీపక్ పులుగుకు 102, నామన వెంకటలక్ష్మికి 81, డాక్టర్ కవల నాగేశ్వరరావుకు 73 ఓట్లు లభించాయి. చెల్లుబాటు అయిన ఓట్ల ఆధారంగా నిర్ధేశించిన కోటా 7,341 ఓట్లను గోపీమూర్తి తొలిరౌండ్‌లోనే అధిగమించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద గోపీమూర్తితో ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. రిటర్నింగ్ అధికారి షాన్‌మోహన్ ఆయనను విజేతగా ప్రకటించి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోపీమూర్తి విలేకరులతో మాట్లాడుతూ అపారమైన అభిమానంతో తనను గెలిపించిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు గోపీమూర్తికి అభినందనలు తెలిపారు.