Amaravati : ప్రభుత్వమేదైనా.. ఆయనది ఇష్టారాజ్యం!
ABN , Publish Date - Jun 29 , 2024 | 05:11 AM
ప్రైవేటు ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా చేరి అలవెన్సులతో కలిపి ప్రతి నెలా రూ.10 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కాబోతున్న...
అవినీతి అధికారికి మళ్లీ అందలం
వైసీపీ చలువతో 10 లక్షల జీతం అందుకున్న వైనం
ఆగస్టులో రిటైర్.. .ఇంకో రెండేళ్లు కొనసాగింపు యత్నాలు ముమ్మరం
మంత్రి నారాయణతో సిఫారసు చేయించుకున్నారని ప్రచారం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రైవేటు ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా చేరి అలవెన్సులతో కలిపి ప్రతి నెలా రూ.10 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కాబోతున్న ఈ ప్రైవేట్ అధికారి మరో రెండేళ్లు కొనసాగేందుకు తన లాబీయింగ్ ముమ్మరం చేశారు. వైసీపీ నేతలకు బంధువైన ఈ అధికారి జగన్ సర్కారులో అందినకాడికి దోచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పక్కకు తప్పిస్తారని భావించినా, అందుకు విరుద్ధంగా మరో రెండేళ్లు కొనసాగించేందుకు ఫైల్ నడుస్తుండటంతో ఆ శాఖ సిబ్బంది అవాక్కయ్యారు.
జగన్ హయాంలో ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్టులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడంలో సదరు అధికారి చాతుర్యానికి ఉన్నతాధికారులు ఫిదా అయ్యారు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడం, వారికి వాటాలివ్వడం, ఇష్టారాజ్యంగా దోపిడీకి తెరలేపడం ఆ ప్రైవేట్ అధికారికి నిత్యకృత్యం. అర్హత, అనుభవం లేకపోయి నా ఉన్నతాధికారుల చలువతో ఉన్నపళంగా ఓ విభాగానికి హెడ్‌గా ఉన్న ఆ అధికారి ఏకంగా ఆ సంస్థకు సీఈవో అయ్యారు. తన జీతాన్ని 400 శాతం పెంచుకున్నారు. సీఎస్, డీజీపీకి కూడా లేని స్థాయిలో గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ వ్యయంతో నివాసం ఉంటున్నారంటే ఆ అధికారి జబర్దస్త్ అర్థం చేసుకోవచ్చు.
ఆ అధికారి అవినీతిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఓ విచారణాధికారిని నియమించి విచారించినా.. నివేదిక వెలుగులోకి రాకుండా ఆయన తన పరపతిని ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ విభాగాలకు డిజైన్లు, ప్రాజెక్టు వర్క్ తదితర సేవలందించే ఏపీ పట్టణ మౌలిక వసతుల, ఆస్తుల నిర్వహణ సంస్థ(ఏపీయూఐఏఎంఎల్)ను సూట్‌కేస్ కంపెనీగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఈయన ఏపీయూఐఏఎంఎల్‌లో ఓ విభాగానికి హెడ్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత ఆయన ఆ సంస్థకే సీఈఓగా ఎదిగారు.
పారదర్శకత లేని నియామకాలు
సీఈఓగా ఈ అధికారి చేపట్టిన నియామకాలూ అడ్డగోలుగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఏపీ పట్టణ మౌలిక వసతుల, ఆస్తుల నిర్వహణ సంస్థకు ప్రైవేట్ ఉద్యోగుల నియామకం చేసుకునే అధికారం లేదు. అయితే పై నుంచి కింది దాకా తన హవా నడుస్తుండటంతో పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఈ సంస్థే నియమిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల కమిషన్‌కు కూడా కొంత మంది ఉద్యోగులను నియమించింది. ఎన్నికల కమిషన్, ఏపీ ఫుడ్ ప్రాసెస్ సొసైటీ, జైళ్ల శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, జీవీఎంసీలో స్మార్ట్‌సిటీ తదితర ప్రాజెక్టులకు ఈ సంస్థ డీపీఆర్‌తో పాటు కన్సల్టెంట్ సేవలను అందిస్తోంది. ప్రభుత్వంలో ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఉన్నా దానితో సంబంధం లేకుండానే ఆయా శాఖలు ఈ సంస్థ ద్వారా నియామకాలు చేపడుతున్నాయంటే దాని వెనుక మతలబు ఇట్టే అర్థమవుతోంది.
ట్రైబల్ స్పోర్టు మీట్ టెండర్ గోల్‌మాల్
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తారు. ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల సంస్థ ఆధ్వర్యంలో జాతీ య క్రీడలను నిర్వహించారు. ఇందుకోసం కేంద్ర ప్రభు త్వం సుమారు రూ.25 కోట్లు కేటాయించింది. క్రీడల నిర్వహణకు ఈ సంస్థ టెండర్లు నిర్వహించింది. అర్హత కలిగిన సంస్థలను టెండర్లలో పాల్గొనకుండా నిబంధనలు మార్చేసి తనకు కావాల్సిన సంస్థకు టెండర్లు కట్టబెట్టారు. దీంతో ఈ క్రీడల్లో సౌకర్యాలు కల్పించలేక రాష్ట్రప్రభుత్వం జాతీయస్థాయిలో అభాసుపాలైంది.