Minister Nimmala Ramanaidu : 2 నుంచే డయాఫ్రం వాల్ పనులు
ABN , Publish Date - Dec 10 , 2024 | 06:13 AM
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల రెండో తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
నిర్మాణం 600 మీటర్లకు చేరగానే..ఈసీఆర్‌ఎఫ్ డ్యాం సమాంతర నిర్మాణం
కాంట్రాక్టు సంస్థలకు మంత్రి నిమ్మల ఆదేశం
వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటన
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల రెండో తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని ఆయన నిర్మాణ సంస్థలు మేఘా ఇంజనీరింగ్, బావర్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్‌ఈ నరసింహమూర్తి తదితరులతో సమీక్షించారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలో పర్యటిస్తారని చెప్పారు. ఆ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్‌ను ప్రకటిస్తారన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికల మేరకు.. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల 600 మీటర్లకు చేరుకున్న వెంటనే.. సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం రాష్ట్ర జలవనరుల శాఖతో నిర్వహించే వీడియో, టెలికాన్ఫరెన్సుల సమాచారం ముందస్తుగా తనకు గానీ, ముఖ్యమంత్రికి గానీ ఎందుకు తెలియజేయడం లేదని ఈఎన్‌సీ, సీఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత శుక్రవారం పీపీఏ సీఈవో అతుల్ జైన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు వివరాలను ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి సీఈవో చేసిన కీలక వ్యాఖ్యలను శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో చూశానని.. పత్రికల్లో చూస్తే తప్ప సమాచారం తెలియకపోతే ఎలాగని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తాము రూ.5 వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే.. ముందస్తుగా ఇచ్చిన నిధుల్లో 75 శాతం ఖర్చుపెడితేనే తదుపరి వాయిదా మొత్తం విడుదల చేస్తామని ఆయన చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి అత్యంత సున్నితమైన అంశాలను తనకు చెబితేనే.. సీఎంకు వివరించి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.