Share News

Polavaram project : పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:19 AM

పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం

Polavaram project : పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

పోలవరం ఏళ్లలో పూర్తి!

బాబు సంకల్పం.. ప్రత్యేక కేబినెట్‌ భేటీ

కట్టకపోగా జగన్‌ నాశనం చేశారు

దీంతో రూ.30 వేల కోట్ల నష్టం

తప్పుడు ప్రచారంలో వైసీపీ ఆరితేరింది

36 హత్యలు జరిగాయంటూ ఢిల్లీలో యాగీ

వారి పేర్లు ఇవ్వాలని జాతీయ మీడియా

అడిగితే జగన్‌ వెళ్లిపోయాడు

ఇలాంటివి మనం కూడా అందుకోవాలి

తప్పుడు విమర్శలపై తక్షణం స్పందించాలి

ప్రతీకార దాడులు, కక్ష సాధింపులూ వద్దు

చట్టప్రకారం శిక్ష పడేలా చూద్దాం: సీఎం

అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయకపోగా.. నాశనం చేసిందని.. దరిమిలా రూ.30 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే నిమిత్తం గురువారం సాయంత్రం అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. పోలవరం పూర్తిచేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే 960 మెగావాట్ల జల విద్యుత్కేంద్రం ఉత్పత్తిలోకి వచ్చేది. అది అందుబాటులోకి రాకపోవడం వల్ల చాలా ఎక్కువ ధరకు బయట నుంచి కరెంటు కొనాల్సి వస్తోంది. పంటలకు కూడా ప్రాజెక్టు నీరు అందుబాటులోకి రాలేదు. ఇవన్నీ లెక్కవేస్తే నష్టం రూ.30 వేల కోట్ల వరకు తేలుతోంది’ అని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరు.. మలిదశలో 45.72 మీటర్ల కాంటూరులో నిర్మాణాలంటూ సందేహాలకు తావివ్వకుండా.. గరిష్ఠ నీటి నిల్వ 196.40 టీఎంసీ మేర ప్రాజెక్టు నిర్మాణం సాగాలని.. ఆ మేరకు కేంద్రం సహకరించి నిధులివ్వాల్సిందిగా కోరదామని చెప్పారు. ‘కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని కేంద్ర జల సంఘం చైర్మన్‌ కుశ్వీందర్‌ వోహ్రా తీసుకున్న నిర్ణయం మేరకు.. కేంద్రం స్పందించి.. సకాలంలో ఆదేశాలు జారీ చేయాలి. కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే.. ఈ ఏడాది నవంబరు నుంచే పనులు ప్రారంభించే వీలుంటుంది’ అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

వెంటనే తిప్పికొట్టాలి..: తప్పుడు ప్రచారం చేయడంలో వైసీపీ ఆరితేరిందని, ఉపేక్షించకుండా అవసరమైన సందర్భాల్లో మంత్రులు తక్షణం వాటిని తిప్పికొట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. ’2019 ఎన్నికల ముందు జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడిని మనం పెద్ద సీరియ్‌సగా తీసుకోలేదు. అలాగే బాబాయి హత్యను వాళ్ళు చేసి మనపై తోసివేసినా మనం అంత బలంగా స్పందించలేదు. వాటి ప్రభావం ఉండదనుకున్నాం. కానీ అవి ప్రభావం చూపాయి. ఈసారి ఎన్నికల ముందు జగన్‌పై గులకరాయి దాడి జరిగిన వెంటనే మనం స్పందించి అది డ్రామా అని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాం. పెద్దఎత్తున ప్రచారం చేశాం. అప్పటికే జగన్‌ వ్యవహారాలు వారికి అర్థమై గులకరాయి దాడిని నమ్మలేదు. కొద్ది రోజుల క్రితం వినుకొండలో ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి అందులో ఒకరు హత్యకు గురైతే.. జగన్‌ దానిని మన పార్టీకి పూయాలని చూశారు. రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఢిల్లీ వెళ్లి యాగీ చేయాలని చూశారు. చనిపోయిన వారి పేర్లు ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే సమాధానం చెప్పలేక జగన్‌ వెళ్లిపోయారు. ఇటువంటివి మనం కూడా అందుకోవాలి. ప్రతి దుష్ప్రచారాన్నీ తిప్పికొట్టాలి’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు ప్రతీకార దాడులకు, కక్ష సాధింపు చర్యలకు దిగవద్దని తాను పదేపదే ఉద్దేశపూర్వకంగానే చెబుతున్నానని అన్నారు. ’జగన్‌ మనపై ఎన్నో దాడులు చేశాడు. చేయాల్సినంత అరాచకం చేశాడు. కానీ మళ్లీ గెలవగలిగాడా? వాళ్లు చేసిన అరాచకానికి చట్టప్రకారం శిక్ష పడేలా చూద్దాం. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం ఎందుకు? చట్టం తన పని తాను చేసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా... గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని కేబినెట్‌ ధ్రువీకరించింది.

పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం శుభపరిణామం. రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు.

జగన్‌ వచ్చాక ఎగువ కాఫర్‌ డ్యాం పనులు చేయకుండా గ్యాప్‌లను అలాగే వదిలేయడంతో 2020 వరదలకు భారీ గుంతలు ఏర్పడి డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. పీపీఏ సూచించినా పూర్తి నిర్లక్ష్యం చేశారు. రెండేళ్లపాటు పనులే చేపట్టలేదు.


ప్రతి మంత్రికి ఎంబీఏ ఎగ్జిక్యూటివ్‌

ప్రతి పేషీలో 8 మంది ఉద్యోగులు

కేబినెట్‌లోని ప్రతి మంత్రికీ ఎంబీఏ చదివిన ఒక ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ను పాలనా వ్యవహారాల్లో సహాయకారిగా నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రుల పేషీల్లో ఉండాల్సిన సిబ్బందికి సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్‌ సమావేశంలో ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉండడంతో గురువారంనాటి సమావేశంలో సంబంధిత తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. దీని ప్రకారం ప్రతి పేషీకి 8 మంది చొప్పున సిబ్బందిని మంజూరు చేశారు. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ పోస్టు కూడా ఉంది. గతంలో ఈ పదవి లేదు. దీనిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఈ పోస్టును కొత్తగా సృష్టించారు. మంచివారిని చూసి పేషీల్లో సిబ్బందిగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రుల కార్యాలయాల్లో ఆరోగ్యకర వాతావరణం ఉండాలని, శాఖాపరమైన అంశాలపై వెంటనే ప్రతిస్పందించే వారిని చూసి పెట్టుకుంటే ఫలితాలు బాగా ఉంటాయని తెలిపారు.

30 లక్షల ఎకరాలకు సాగునీరు..

పోలవరం ప్రాజెక్టును 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించాం. దీనివల్ల 23.5 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడమే గాక కొత్తగా 7.2 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు. తాగునీటి అవసరాలకు 4.9 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 18.5 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది. జలవిద్యుత్కేంద్రం ద్వారా 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. పోలవరం నిర్మాణ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని బడ్జెట్‌లో ప్రతిపాదించినందుకు కేంద్ర పభుత్వానికి ధన్యవాదాలు. 45.72 మీటర్ల కాంటూరు మేరకు 194.60 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిర్మించాలన్న నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు కేంద్రం పూర్తిగా సహకరించి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలి.

Updated Date - Jul 26 , 2024 | 06:47 AM