Share News

Kodela SivaPrasad: కోడెల విగ్రహంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:33 PM

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు విగ్రహం తొలగింపుపై ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోడెల శివ ప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం సైతం ఈ వ్యవహారంపై మాట్లాడారు. అలాంటి వేళ.. పల్నాడ్ ఇన్‌చార్జ్ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు.

Kodela SivaPrasad: కోడెల విగ్రహంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

అమరావతి, నవంబర్ 04: తెలుగుదేశం పార్టీలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకి ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని పల్నాడు జిల్లా ఇన్‌‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న ఆయనకు గౌరవ మర్యాదల్లో ఎక్కడా భంగం వాటిల్లదని ఆయన పేర్కొన్నారు. ఆయితే కోడెల విగ్రహాన్ని దొంగచాటుగా అర్థరాత్రుళ్లు పెట్టాల్సిన అవసరం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కోడెల విగ్రహాన్ని అన్ని అనుమతులతో త్వరలోనే గౌరవప్రదంగా ప్రతిష్టిద్దామన్నారు. కానీ కొన్ని శక్తులు సమస్యలు సృష్టించేందుకు యత్నం చేస్తే మాత్రం సహించేది లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హెచ్చరించారు.

Also Read: AP Politics: జగన్‌కి జోగి ఝలక్..!


నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రిలో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఇటీవల ఆయను అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ మున్సిపల్ ఉన్నతాధికారులు ఆ విగ్రహాన్ని తొలగించారు. ఈ వ్యవహారంపై కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడల శివరామ్ ఇప్పటికే స్పందించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకు పార్టీలో నిబద్దతతో పని చేశారని కోడెల శివరామ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే పార్టీలో ఎన్నో కీలక పదవులు సైతం నిర్వహించి.. ఎటువంటి మచ్చ లేని మనిషిగా ఆయన ఖ్యాతి పొందారన్నారు. అలాంటి ఆయన విగ్రహాన్ని తొలగించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. కోడెల విగ్రహం తొలగింపులో అధికారుల అత్యుత్సాహం ఉందని ఆయన మండిపడ్డారు.

Also Read: కివి పండుతో ఇన్ని లాభాలున్నాయా..?


నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు విగ్రహం తొలగింపుపై ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతుంది. అలాంటి వేళ.. పల్నాడు జిల్లాలోని కోడెల అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడెల విగ్రహం తొలగింపు సందర్బంగా ఆయన అభిమానులు ఇప్పటికే నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పైవిధంగా స్పందించారు. కోడెల వర్థంత్రి సందర్బంగా ఆయన విగ్రహాన్ని లింగంగుంట్ల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన విషయం విధితమే.


మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతం స్పందించారు. కోడెల శివప్రసాదరావు విగ్రహం తొలగించడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరాసరావుపేటలో ప్రభుత్వాసుపత్రి ఏర్పాటు కోసం గతంలో కోడెల శివప్రసాదరావు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. అమెరికాలో చదువుకుంటున్న తన స్నేహితుల నుంచి తీసుకొచ్చిన చందాలతో పల్నాడు ప్రాంత ప్రజల కోసం కోడెల శివప్రసాద్‌ సకల సౌకర్యాలతో పెద్దాసుపత్రి నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు.


తొలుత వైద్యునిగా కోడెల శివప్రసాదరావు సేవలందించే వారు. అయితే తెలుగుదేశం పార్టీని విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించారు. ఆ క్రమంలో ఆయన పిలుపునందుకుని ఆ పార్టీలో కోడెల శివప్రసాదరావు చేరారు. అనంతరం ఆయన నరసరావుపేట, సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అలాగే కోటప్పకొండ దేవస్థానం చైర్మన్‌గా, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా సైతం కోడెల శివప్రసాద్ పని చేశారు. ఆయన ఎక్కడ.. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చిన ఘనత కోడెల శివప్రసాదరావుదని ఆయన అభిమానులు నేటికి చెప్పుకుంటారు.

For Andhra News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 04:45 PM