Share News

Premium Liquor Stores : త్వరలో లిక్కర్‌ ప్రీమియం స్టోర్లు

ABN , Publish Date - Dec 11 , 2024 | 03:49 AM

రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్‌ బ్రాండ్లు విక్రయించేందుకు ‘ప్రీమియం స్టోర్లు’ అందుబాటులోకి రానున్నాయి.

Premium Liquor Stores : త్వరలో లిక్కర్‌ ప్రీమియం స్టోర్లు

  • లైసెన్స్‌ ఫీజు ఏడాదికి రూ.కోటి.. ఏటా 10%పెంపు

  • 12 స్టోర్ల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్‌

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్‌ బ్రాండ్లు విక్రయించేందుకు ‘ప్రీమియం స్టోర్లు’ అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఒకట్రెండు రోజుల్లో ఎక్సైజ్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 12 ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ కార్పొరేషన్లు, ప్రధాన నగరాల్లో మాత్రమే ఉండే వీటికి దరఖాస్తు రుసుము రూ.15 లక్షలుగా ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. దరఖాస్తులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. లైసెన్స్‌ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. దానిపై ఏటా 10శాతం చొప్పున ఫీజు పెరుగుతుంది.

అయితే ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేస్తారు. కనీసం 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం చూపించినవారే దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తులు పరిశీలించి లైసెన్సీలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తుంది. సాధారణ మద్యం షాపుల తరహాలోనే ఈ స్టోర్ల పనివేళలు ఉంటాయి. ప్రీమియం స్టోర్లలో లిక్కర్‌, బీరు, వైన్‌తో పాటు లిక్కర్‌ చాక్లెట్లు, సిగార్స్‌, సిగరెట్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ కూడా విక్రయించవచ్చు.

Updated Date - Dec 11 , 2024 | 03:52 AM