Share News

Tirupati Lok Sabha: తిరుపతి లోక్ సభా ఉప ఎన్నికల్లో అవకతవకలు.. కొనసాగుతున్న చర్యలు

ABN , Publish Date - Jan 19 , 2024 | 01:08 PM

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఎపిక్ కార్డుల అంశంపై ఎన్నికల సంఘం చర్యలు కొనసాగుతున్నాయి. తిరుపతి తహసీల్దార్‌గా పనిచేసిన జయరాములును విధుల నుంచి తప్పించారు. డిప్యూటీ తహశీల్దార్‌ విజయ భాస్కర్‌ను సస్పెండ్ చేశారు. కొందరు పోలీసుల అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Tirupati Lok Sabha: తిరుపతి లోక్ సభా ఉప ఎన్నికల్లో అవకతవకలు.. కొనసాగుతున్న చర్యలు

అమరావతి: తిరుపతి (Tirupati) లోక్ సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఎపిక్ కార్డుల అంశంపై ఎన్నికల సంఘం చర్యలు కొనసాగుతున్నాయి. తిరుపతి బై పోల్ సమయంలో నకిలీ ఎపిక్ కార్డులను తయారు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. తిరుపతి తహసీల్దార్‌గా పనిచేసిన జయరాములును (Jaya Ramulu) విధుల నుంచి తప్పించారు. డిప్యూటీ తహశీల్దార్‌ విజయ భాస్కర్‌ను సస్పెండ్ చేశారు. కొందరు పోలీసుల అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరికొందరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తామని చెబుతున్నారు. అవక తవకలకు పాల్పడిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వెంటనే వారిని సస్పెండ్ చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో విధుల నుంచి తప్పిస్తున్నారు.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చనిపోవడంతో 2021 ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరఫున పనబాక లక్ష్మీ, బీజేపీ-జనసేన నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్, సీపీఎం నుంచి నెల్లూరు యాదగిరి పోటీలో ఉన్నారు.

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేశారని టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ ఓట్లు వేయడానికి మనుషులను తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. నకిలీ ఓటరు కార్డులను ముద్రించారని తెలిపారు. ఇదే అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసీ అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 19 , 2024 | 01:08 PM