Public Demands : పోలవరం ప్రాజెక్టును చూడనివ్వండి..!
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:38 AM
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం చాలామంది ప్రత్యేక వాహనాల్లో వస్తున్నప్పటికీ..
సందర్శకులను అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది
సమీపంలోని ఆలయాలకు వెళ్లాలన్నా ఆటంకాలు
అనుమతించాలని కోరుతున్న పర్యాటకులు, భక్తులు
పోలవరం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం చాలామంది ప్రత్యేక వాహనాల్లో వస్తున్నప్పటికీ.. భద్రతా బలగాలు వారిని అనుమతించడం లేదు. దీంతో వచ్చినవాళ్లు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తీరును ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో గతంలో టీడీపీ ప్రభుత్వం బస్సు యాత్ర నిర్వహించింది. ప్రతి గ్రామం నుంచి బస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాజెక్టును చూపించి, ఇంజనీరింగ్ అధికారులతో నిర్మాణ వివరాలు తెలిపి, భోజనాలు పెట్టించి మరీ పంపేవారు. ఈ బస్సు యాత్ర ద్వారా 2018 డిసెంబరు 31 నాటికి 4,36,933 మంది ప్రాజెక్టుని సందర్శించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు సందర్శనను అటకెక్కించింది. భద్రతపేరిట సందర్శకులను కట్టడి చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాంతానికి మంత్రులు, వీఐపీలు వచ్చిన సందర్భాలలో మినహా మీడియాని కూడా రానివ్వడం లేదు. ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యామ్‌కు ఎగువన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోశమ్మ ఆలయానికి, దిగువ కాపర్ డ్యామ్‌కు దిగువన ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయానికి, పోలవరం గ్రామ సమీపంలోని పాండురంగడి ఆలయానికి నిత్యం అనేక మంది భక్తులు వస్తుంటారు. అయితే భద్రతా సిబ్బంది అభ్యంతరం తెలుపుతుండడంతో అసహనం వ్యక్తంచేస్తున్నారు. పాపికొండల సందర్శన కోసం గండి పోశమ్మ ఆలయ సమీపంలో ఉన్న టూరిజం బోటు పాయింట్ వద్దకు చేరుకోవడానికి వచ్చేవారికి కూడా ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి పోలవరం ప్రాజెక్టు, పాపికొండల సందర్శనకు, గండి పోశమ్మ, మహానందీశ్వరస్వామి ఆలయానికి ప్రాజెక్టు మీదుగా వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
భద్రతా కారణాల రీత్యానే..!
ప్రాజెక్టుకి ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు పరిశీలనకు సీఎం తరచూ వచ్చే ప్రాంతం కావడంతో భద్రతా కారణాల రీత్యా సందర్శకులను నిలువరిస్తున్నామని ప్రత్యేక భద్రతా అధికారులు చెబుతున్నారు.