రెవెన్యూ సదస్సులకు పోటెత్తిన భూ బాధితులు
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:32 AM
ప్రజల ఆస్తుల రక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెవెన్యూ సదస్సులకు భూ బాధితులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సులకు జగన్ జమానాలో భూములు, విలువైన ఆస్తులు కోల్పోయిన బాధితులు, రైతులు, ప్రజలు వెల్లువలా తరలివచ్చారు.
536 మండలాల్లో సదస్సులు ప్రారంభం
పాల్గొన్న రెవెన్యూ మంత్రి, స్పెషల్ సీఎస్, సీసీఎల్‌ఏ
తొలిరోజే ప్రభుత్వానికి 11,857 వినతులు
ఎన్నికల కోడ్‌తో ఆరు జిల్లాలు దూరం
ప్రతి అర్జీకి ఓ నంబర్ కేటాయింపు
ఆర్టీజీఎస్ ద్వారా సీఎం పరిశీలించే అవకాశం
ప్రభుత్వం దృష్టికి పలు రీసర్వే సమస్యలు
అన్ని సమస్యలూ పరిష్కరిస్తామన్న ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆస్తుల రక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెవెన్యూ సదస్సులకు భూ బాధితులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సులకు జగన్ జమానాలో భూములు, విలువైన ఆస్తులు కోల్పోయిన బాధితులు, రైతులు, ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. రెవెన్యూ యంత్రాంగం ఊహించిన దాని కంటే రెట్టింపు స్పందన వచ్చింది. రెవెన్యూ సదస్సుకు ఆ గ్రామానికి సమీపంలోని గ్రామాల ప్రజలు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. సదస్సు తీరును పరిశీలించారు. అనేక గ్రామాల్లో సదస్సుల కోసం చేసిన ఏర్పాట్లు కూడా సరిపోలేదు. దీంతో శనివారం జరిగే సదస్సుల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌లను ఆదేశించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆరు జిల్లాల పరిధిలో సదస్సులు జరగలేదు. మిగిలిన 20 జిల్లాల పరిధిలో 536 మండలాల్లోని 645 గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో అధికారిక లెక్కల ప్రకారం తొలి రోజే ప్రజల నుంచి 11,857 వినతులు, ఫిర్యాదులు వచ్చాయు. ఇందులో 152 భూ సమస్యలను అధికార యంత్రాంగం అక్కడికక్కడే పరిష్కరించింది. మిగిలిన వినతులను షెడ్యూల్ ప్రకారం త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ పేర్కొంది. చిత్తూరు జిల్లాలో 31 గ్రామాల్లో 1,087, తిరుపతి జిల్లాలో 45 గ్రామాల్లో 1,184, అన్నమయ్య జిల్లాలో 33 గ్రామాల్లో 1,331, పార్వతీపురం మన్యంలో 43 గ్రామాల్లో 7,094, ప్రకాశం జిల్లాలో 45 గ్రామాల్లో 797 వినతులు ప్రభుత్వానికి అందాయి.
రేపల్లె మండలంలో రెవెన్యూ మంత్రి
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ రేపల్లె మండలం పేటేరు గ్రామంలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ గ్రామంలోనే వైసీపీ హయాంలో భూముల రీసర్వేను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అప్పట్లో తలెత్తిన సమస్యలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు రైతులు, బాధితులు భారీగా తరలివచ్చి స్పెషల్ సీఎ్‌సకు అర్జీలు అందించారు. ఈ గ్రామంలో ఓ సర్వే నంబర్ మొత్తాన్ని తీసుకెళ్లి దేవదాయశాఖ భూముల్లో కలిపారు. ఆ భూములను నిషేధ భూముల జాబితాలో చేర్చారు. ఈ సమస్యపై బాధితులు సిసోడియాకు వినతి పత్రం ఇచ్చి.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ‘‘ఆ సర్వే నంబర్‌లోని భూములను తిరిగి రీసర్వే అయినా చేయాలి. లేదంటే రెవెన్యూ రికార్డులను సవరించాలి.
ఇది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఆ సమస్యను పరిష్కరిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో జరిగిన సదస్సులో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామంలో అదనపు సీసీఎల్‌ఏ, సర్వే ఇన్‌చార్జి కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, రెవెన్యూ సద స్సుల్లో ప్రజలు అందిస్తోన్న ఫిర్యాదులను మండలాల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌లో భాగంగా వాటిని అప్‌లోడ్ చేస్తున్నారు.
ఈ డేటాను ఆర్టీజీఎ్‌సకు అనుసంధానించనున్నారు. ప్రజల వినతులను ఆర్‌టీజీఎస్ ద్వారా నేరుగా సీఎం పరిశీలించే వీలుంది. సభలు ముగిసిన తర్వాత 45 రోజుల వ్యవధిలో సమస్యలను పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ చెబుతోంది. కాగా, రెవెన్యూ సదస్సులకు ఊహించని స్పందన వచ్చిందని మంత్రి అనగాని‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘‘వైసీపీ హయాంలో రీసర్వే అనంతరం భూవివాదాలు తీవ్రంగా తలెత్తాయి. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నవారిని ఐదేళ్లపాటు భూముల్లోకి వెళ్లనివ్వకుండా, జీవనోపాధిని దెబ్బతీసిన ఉదంతాలు మా దృష్టికి వచ్చాయి. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం.’’ అని తెలిపారు.