Rural Development Dept : వాటర్‌షెడ్ పనులకూ సోషల్ ఆడిట్
ABN , Publish Date - Dec 10 , 2024 | 04:37 AM
ఉపాధి హామీ పథకంలో అవినీతిపై సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టినట్లుగానే వాటర్‌షెడ్ పనులపై కూడా ఈ తనిఖీలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది.
క్వాలిటీ కంట్రోల్ తనిఖీల తర్వాతే చెల్లింపులు
నీటి సంరక్షణ పనుల్లో అక్రమాలకు చెక్
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో అవినీతిపై సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టినట్లుగానే వాటర్‌షెడ్ పనులపై కూడా ఈ తనిఖీలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ ఆదేశాలిచ్చారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీల తర్వాతే నీటి సంరక్షణ పనులకు చెల్లింపులు చేపట్టాలని సూచించారు. పీఎంకేఎ్‌సవై-2.0 కింద కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 2.44 హెక్టార్లలో నీటి సంరక్షణ కోసం 59 కొత్త వాటర్‌షెడ్లను మంజూరుచేసింది. అన్ని స్థాయిల్లో పనులను పర్యవేక్షించాలని ఇప్పటికే మార్గదర్శకాలను సూచించింది. చెక్‌డ్యాంలు, చెక్‌వాల్‌లు, ఫారంపాండ్లు, ఊటచెరువులు, కాంటూర్ కందకాలు, రాతికట్టడాలు తదితర నీటి సంరక్షణ పనులన్నింటినీ తనిఖీ చేపట్టి, అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి అవినీతికి అవకాశం లేకుండా చూడాలని కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.