Sajjala: తెగేవరకు లాగకండి.. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు సజ్జల హుకుం
ABN , Publish Date - Jan 12 , 2024 | 09:53 PM
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి వైసీపీ సర్కార్ కృషి చేస్తోందని, నిరసనల పేరుతో తెగేవరకు లాగకండంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అంగన్వాడీలకు హుకుం జారీ చేశారు.
అమరావతి: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి వైసీపీ సర్కార్ కృషి చేస్తోందని, నిరసనల పేరుతో తెగేవరకు లాగకండంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అంగన్వాడీలకు హుకుం జారీ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "అంగన్ వాడీ కార్యకర్తలు 32 రోజులుగా సమ్మె చేస్తున్నారు. మూడు దఫాలుగా ఇప్పటి వరకు చర్చలు చేశాం.
సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. 11 డిమాండ్‌లలో పదింటికి అంగీకారం తెలిపాం. సమ్మె విరమణకు మావంతు ప్రయత్నం చేశాం. వేతనం పెంపు విషయంలో వాళ్లు పట్టుబట్టారు. వారికి రిటైర్మెంట్ బెన్ ఫిట్ రూ.50 వేలు, రూ.20 వేలు ఉండేవి. అంగన్ వాడీ కి రూ.50 వేల నుంచి రూ.1.20 వేలకు, హెల్పర్ కు రూ.20 వేలనుంచి రూ.50 వేలకు పెంచాం. మట్టి ఖర్చులు ఇరవై వేలకు అంగీకరించాం. గత ప్రభుత్వం ఆరు నెలల ముందే వేతనం పెంచింది.
ఐదేళ్ల తరువాత రివైజ్ చేయడం మా విధానం. వచ్చే ఆర్ధిక సంవత్సరం లో వేతనం పెంచుతామని హామీ ఇచ్చాం. జులై 2024 నుంచి పెంచేలా కమిట్ మెంట్ ఇస్తామని చెప్పాం. 60 నుంచి 62 ఏళ్లకి రిటైర్ పెంచాం. సర్వీస్ పరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాం . మినీ అంగన్ వాడీ లకు జనాభాను బట్టి వేతనం నిర్ణయం చేస్తాం. సమ్మె కొనసాగిస్తే ప్రత్యామ్నాయ చర్యలు ఉంటాయి.
ఎస్మా పరిధిలోకి తెచ్చామని రాజకీయ విమర్శలు చేశారు. పోరాటాన్ని అణచి వేసే చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు. నోటీసులు ఇస్తున్నాం. పది రోజుక నోటీసులు తరువాత స్పందించకుంటే ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తాం. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నారు. ఇకపై మేం ఉపేక్షించలేం.
అంగన్వాడీలపట్ల సీఎం జగన్‌కు సానుభూతి ఉంది. తెగే వరలు లాగకండి... సమ్మె విరమించండి" అని హుకుం జారీ చేశారు. సజ్జల వ్యాఖ్యలపై అంగన్వాడీలు మండిపడుతున్నారు.