Land Sale : చీకటి జీవోతో బేరం!
ABN , Publish Date - Dec 23 , 2024 | 02:54 AM
సంపద సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అప్పులు తగ్గించి సంపద సృష్టించడం రాష్ట్ర విజన్ అని ఇటీవలే ప్రకటించారు.
ప్రభుత్వ దృష్టికి తేకుండానే భూముల అమ్మకం
జగన్ దారిలో 3 జిల్లాల అధికారుల దూకుడు
జీవో 243 ప్రకారం ముందుకు
విలువైన ప్రభుత్వ స్థలాల జాబితా రెడీ
ఉమ్మడి విశాఖ, గుంటూరు జిల్లాల్లో గుర్తింపు.. పాఠశాలల భూములు కూడా
స్థానిక సంస్థల ద్వారా గుట్టుగా ప్రక్రియ
త్వరలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ..
గత జగన్ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములు అమ్మేందుకు చీకటి జీవో 243 తీసుకొచ్చింది. విశాఖ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని భూములను అమ్మేసింది. మరి కొన్నింటిని తాకట్టు పెట్టింది. నాడు ఈ జీవోపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కూటమి ప్రభుత్వం జీవో 243 రద్దుపై దృష్టిసారించే లోపే కొందరు అధికారులు జగన్ బాటలో నడుస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను బేరం పెట్టారు. ఇందులో పాఠశాలల స్థలాలు కూడా ఉన్నాయి. అమ్మకం ప్రక్రియలో విశాఖ నగర పాలక సంస్థ ముందు వరసలో ఉంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సంపద సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అప్పులు తగ్గించి సంపద సృష్టించడం రాష్ట్ర విజన్ అని ఇటీవలే ప్రకటించారు. కానీ విలువైన సంపదను అమ్మే ప్రయత్నాల్లో కొందరు అధికారులు మునిగిపోయారు. విలువైన ఖాళీ భూములు అమ్మేస్తే ఎంత సొమ్ము వస్తుందో లెక్కలు వేస్తున్నారు. 2021లో నాటి ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన చీకటి జీఓ 243ను వారు ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. నాడు విలువైన భూములను అమ్మేందుకు జగన్ సర్కార్ ప్లాన్ వేయగా... ఇప్పుడు ఆ అధికారులు అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా జిల్లాలలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను తెగనమ్మడానికి సిద్ధమయ్యారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, మార్కెట్ కమిటీలు... ఇలా ఆయా విభాగాల పరిధిలో అమ్మకం ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ, గుంటూరు జిల్లాల పరిధిలో మొదలైంది. త్వరలో కృష్ణా జిల్లా పరిధిలో విజయవాడలోని స్థలాలు అమ్మేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అమ్మకానికి పెడుతున్న జాబితాలో ప్రభుత్వ పాఠశాలల భూములు కూడా ఉన్నాయి.
భూముల జాబితా రెడీ
ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురాకుండా విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి నగర పాలక సంస్థలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ఇందులో విశాఖ నగర పాలక సంస్థ ముందు వరసలో ఉంది. విశాఖ నగర పాలక సంస్థ అమ్మకం కోసం తయారు చేసిన జాబితాలో పాఠశాల భూములున్నాయి. వే పగుంటలో 95 సెంట్లు, చిన్నముసిడివాడలో 76 సెంట్లు, మధురవాడలోని స్కూల్ పరిధిలో 30 సెంట్ల భూములను అమ్మకానికి పెట్టారు. ఇవికాక మధురవాడలోనే మరో ఆరు పాఠశాలలకు చెందిన ఖాళీ స్థలాలను చదరపు గజాల లెక్కన అమ్మకానికి పెట్టారు. ఈ జాబితాలో పాఠశాలలకు చెందిన స్థలాలు 4.50 ఎకరాలు, కమర్షియల్ స్థలాలు 75 సెంట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ భూముల అమ్మకానికి గత నవంబరు 26న వీఎంఆర్‌డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అది అందరికీ చేరలేదు. సెలెక్టివ్‌గా, కొందరికి మాత్రమే సమాచారం వెళ్లేలా విశాఖ జిల్లాకే చెందిన ఓ అధికారి, నగర పాలక సంస్థలోని మరో అధికారి చక్రం తిప్పినట్లు తెలిసింది. అయితే భూములను అమ్మాలన్న తొలిప్రయత్నం పూర్తిగా విజయవంతం కాలేదు. దీంతో తాజాగా మరోసారి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. భూముల అమ్మకాల జాబితాలో అద నంగా మధురవాడలోని వివిధ పాఠశాలలకు చెందిన 3.75 ఎకరాలను చేర్చినట్లు సమాచారం. వేలం లేదా విక్రయం రూపంలో దక్కించుకునేందుకు విశాఖ జిల్లాకే చెందిన ఓ టీడీపీ నేత ఇప్పటికే వీఎంఆర్‌డీఏ అధికారితో బేరసారాలతో కూడిన ఒప్పందాలు పూర్తిచేసినట్లు తెలిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ విలువైన ప్రభుత్వ భూముల జాబితాను ఇలాగే సిద్ధం చేసినట్టు సమాచారం.
నాడు జగన్ అరాచకం
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘బటన్’ నొక్కుడు పేరిట ఆర్థిక అరాచకానికి పాల్పడ్డారు. అడ్డగోలుగా అప్పులు చేశారు. నిధులు దారి మళ్లించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టారు. చాలదన్నట్టు ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్మారు. అందుకోసం 2012లో తీసుకొచ్చిన చరిత్రాత్మక ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ పాలసీని మార్చారు. ప్రభుత్వ భూములను అమ్మకూడదన్న సెక్షన్ 3(ఏ)ను తొలగించి చీకటి జీవో 243ను జారీ చేశారు. దీని ఆధారంగా జగన్ సర్కారు విశాఖ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను అమ్మేసింది. మరి కొన్నింటిని అమ్మాలని చూసింది. సాధ్యం కాకపోవడంతో బ్యాంకుల్లో తాకట్టు పెట్టింది. ఈ పరిణామాలపై నాటి ప్రతిపక్షం తెలుగుదేశం తీవ్ర నిరసనలు వ్యక్తం చేసింది. జగన్ నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలంటూ జిల్లాల వారీగా పోరాటాలు చేసింది. ప్రభుత్వ భూములను అమ్మేసి సంపద సృష్టిస్తారా? అని విమర్శలు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జీఓ 243ను రద్దు చేస్తార ని భావించారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించక ముందే కొందరు అధికారులు జగన్ సర్కారు చూపిన బాటలోనే అడుగులేస్తున్నారు.
పాఠశాల భూములే దొరికాయా?
ప్రభుత్వం వద్ద ఉండే భూములు ఎంతో విలువైనవి. భవిష్యత్ అవసరాల కోసం గత ప్రభుత్వాలు అదనంగా కేటాయించాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఎకరాల కొద్దీ భూములు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, మార్కెట్ యార్డుల స్థలాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత. వాటిని భవిష్యత్ అవసరాలు, రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం కాపాడాలి. వాటిని కాపాడుకునేందుకు ప్రభుత్వం భూకబ్జా నిరోధక చట్టం కూడా తీసుకొచ్చింది. అలాంటిది పాఠశాలల భూములను కూడా వదలకుండా అధికారులు అమ్మకానికి పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం అయితే అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడింది. అలాంటి తప్పులు చేయబోమని ముఖ్యమంత్రి సహా కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను అధికారులు తెగనమ్మాలనుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భూములు అమ్మకుండానే ఆదాయాన్ని తెచ్చి పెట్టే అనేక మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
భూముల రక్షణకు తూట్లు
ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో చరిత్రాత్మక భూ విధానం(ల్యాండ్ పాలసీ) తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన జీఓ 571ని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ భూముల రక్షణ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కేటాయింపులు ఉంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వనరుల సమీకరణ పేరిట ప్రభుత్వ భూములను అమ్మకూడదన్నది ఆ పాలసీ లక్ష్యం. సెక్షన్ 3(ఏ) అదే చెబుతోంది. ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వం నుంచి భూమిని తీసుకొని రహస్యంగా అమ్ముకున్నా లేదా ప్రభుత్వ అనుమతి లేకుండా తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకున్నా భూ కేటాయింపును రద్దు చేయాలని ఈ పాలసీ చెబుతోంది. ఇలాంటి ఉన్నతమైన ఉద్దేశాలున్న పాలసీని జగన్ కరోనా కాలంలో 2021 సెప్టెంబరులో మార్చారు.