ఏమిటిది ఆఫీసర్!
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:44 AM
వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి సర్కారు వచ్చి వంద రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. నాడు జగన్ నోటి మాటనే శాసనంగా భావించి అడ్డగోలు పనులు చేశారు. వారు ఇప్పుడూ వైసీపీ నీడ నుంచి బయటపడటంలేదు.
జగన్ ‘మాయ’ వీడని అధికారులు
ముఖ్యమంత్రి చెప్పినా డోంట్‌కేర్!
నాడు జగన్ మాటే వారికి శాసనం
అడ్డగోలు ఆదేశాలకూ జీహుజూర్
నేడు ఉన్నత స్థాయి ఆదేశాలూ బేఖాతర్
ముఖ్యమైన పనులకూ మోకాలడ్డు
నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం
నిమ్మగడ్డకు ఇంకా జరగని న్యాయం
ఉద్యోగుల నేత వెంకట్రామిరెడ్డిపై ప్రేమ
వివాదాస్పదంగా కొందరు అధికారుల తీరు
నాడు ముఖ్యమంత్రిగా జగన్ మనసులో అనుకున్నా సరే.. ఆ పనులు చేసేశారు. నోటిమాటగా చెప్పారంటే తిరుగే లేదు. నేరుగా ఉత్తర్వులు జారీ చేస్తే... మెరుపు వేగంతో అమలు! నిబంధనలకు విరుద్ధమైనా, అడ్డగోలు ఆదేశాలైనా అమలు చేసి తీరాల్సిందే! ఇప్పుడు... నిబంధనల మేరకు చేయాల్సిన పనులూ చేయడంలేదు. ఫైళ్లు కదలడం లేదు. నేరుగా సీఎం చంద్రబాబు ఆదేశించినా.. స్పందన కనిపించడంలేదు. ఒక ముఖ్య కార్యదర్శితోపాటు మరికొందరు అధికారులు ఇప్పటికీ వైసీపీ ‘మాయ’లోనే మునిగిపోయారు. జగన్ సేవలోనే తరిస్తున్నారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి సర్కారు వచ్చి వంద రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. నాడు జగన్ నోటి మాటనే శాసనంగా భావించి అడ్డగోలు పనులు చేశారు. వారు ఇప్పుడూ వైసీపీ నీడ నుంచి బయటపడటంలేదు. కొందరు ఏకంగా ముఖ్యమంత్రి, సీఎంవో, మంత్రుల ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ఆర్థిక శాఖ మొండికేస్తోంది. మరో కీలక శాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే ఇప్పటికీ వైసీపీ సేవలో తరిస్తున్నారు.
ఇటీవల ఆర్థిక శాఖ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన బిల్లులు చెల్లించేసింది. ప్రాధాన్యాలను పక్కనబెట్టి మరీ జగన్ మనుషులకు చెల్లింపులు చేశారు. దీనిపై టీడీపీ కేడర్ గగ్గోలు పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా తీవ్రంగా స్పందించారు. సీఎం దగ్గర సంబంధిత అధికారులు, ఆ శాఖ మంత్రి కూర్చుని మాట్లాడుకున్నారు. అయినా అధికారుల తీరు మారలేదు. ఆ తర్వాత 20 రోజులకే అదే పులివెందులకు సంబంధించి మిగిలిపోయిన బిల్లులు కూడా చెల్లించారు. సీఎం పిలిచి చెప్పినా, సీఎంవో అధికారులు నిరంతరం హెచ్చరిస్తున్నా బిల్లుల చెల్లింపులు మాత్రం ఆగలేదు.
ఇప్పటికీ వైసీపీ సేవలో..
గతంలో జగన్ సేవలో తరించిన ఓ సీనియర్ అధికారి ఇప్పటికీ వైసీపీ కోసమే పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ ఆయన కీలకమైన శాఖకు ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు వలంటీర్లు లేకపోతే ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేమన్న వైసీపీ లైన్‌ను అత్యద్భుతంగా రక్తి కట్టించారు. వలంటీర్లు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరూ అత్యంత బిజీగా ఉన్నారంటూ కలెక్టర్లందరితో ఒకే రకమైన నివేదిక ఇప్పించారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మండుటెండల్లో వృద్ధులను తిప్పి పదుల సంఖ్యలో చావుకు కారణమయ్యారు. ఈ అధికారికి కూటమి ప్రభుత్వం కీలకశాఖ అప్పజెప్పడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి. సీఎంవోలోని ముఖ్యమైన అధికారికి ఆయన స్నేహితుడు కావడంతో కీలక శాఖ దక్కిందన్న ప్రచారం సచివాలయంలో జరుగుతోంది.
జగన్ పగే తన పగగా..
వైసీపీ సేవలో తరిస్తున్న ఆ కీలక శాఖ ముఖ్యకార్యదర్శి పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారు. జగన్ గత ఐదేళ్లలో ఒకే ఒక్కసారి ప్రెస్‌మీట్ పెట్టి అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కులం పేరు ప్రస్తావించి మరీ దూషించారు. నిమ్మగడ్డ రిటైరయ్యాక జగన్ హయాంలో ఆయనకు రావాల్సిన ప్రయోజనాలను, ఇతర అలవెన్సులను ఇవ్వలేదు. ప్రభుత్వం మారాక ఆయన తనకు రావాల్సిన అలవెన్సులు, ఇతర ప్రయోజనాల కోసం నిబంధనల ప్రకారం ఫైలు పెట్టుకున్నారు. ఆ ఫైలు జూలై 5వ తేదీన ఆ సీనియర్ అధికారి వద్దకు చేరింది. ఈ రోజుకీ అక్కడే ఉంది. ఈ ఫైలును దాదాపు 3 నెలలుగా ఆపడం వెనుక ఆ ముఖ్యకార్యదర్శి ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా...
నిమ్మగడ్డ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్న కీలక శాఖ ముఖ్య కార్యదర్శి... ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిపై ఎనలేని ప్రేమ చూపుతున్నారు. ఎలాగైనా సస్పెన్షన్ వ్యవహారంలో వెంకట్రామిరెడ్డికి క్లీన్‌చిట్ ఇప్పించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. సస్పెన్షన్ ఎత్తేయమని ప్రతిపాదిస్తూ ఫైలు పెట్టాల్సిందిగా తన కిందస్థాయి అధికారికి మౌఖికంగా చెప్పారు. ఆయన మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా ఫైలు వ్యవహారం సీఎంవోకు చేరింది. వెంకట్రామిరెడ్డిపై అభియోగాలు నమోదు చేస్తూ జీవో ఇచ్చారు. 10 రోజుల్లో స్పందించాలని ఆ జీవోలో ఆదేశించారు.
వెంకట్రామిరెడ్డి తన వాదన ప్రభుత్వానికి తెలియజేశారు. ఇది జరిగి నెలరోజులు దాటింది. ఈ రోజుకు కూడా విచారణాధికారి నియామకం విషయాన్ని ఆ ముఖ్యకార్యదర్శి పట్టించుకోవడం లేదు. దీనికి ఓ కారణం ఉంది. వెంకట్రామిరెడ్డి ఏప్రిల్ 18వ తేదీన సస్పెండ్ అయ్యారు. అక్టోబరు 17కి ఆర్నెళ్లు గడుస్తుంది. అంటే ఇక రెండు వారాలే గడువు. ఆర్నెళ్లు పూర్తయితే ఆ శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో శాఖాపరమైన సమీక్ష జరుగుతుంది.
ఆర్నెళ్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు కావున తనపై కేసు కొట్టేసి, సస్పెన్షన్ ఎత్తేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించవచ్చు. ఇదే జరిగితే ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు. అదే విచారణాధికారిని నియమిస్తే వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ కేసులో పురోగతి ఉంటుంది. దాని ప్రకారం ప్రభుత్వం ఏదో ఒక పనిష్మెంట్ చర్య తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి నుంచీ ఆయన్ను తప్పించేందుకే ఆ అధికారి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో త్వరగా నిర్ణయం తీసుకోమని ఆ ముఖ్యకార్యదర్శికి సీఎస్ చెప్పారు. సీఎంవో హెచ్చరించింది. అయినప్పటికీ ఆ అధికారి పట్టించుకోవడం లేదు.
వ్యవస్థలను సరిచేస్తాం: మంత్రి నిమ్మల
ఆర్థిక శాఖ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నారని, వ్యవస్థలన్నింటిని సరి చేసుకుంటూ పాలన చేస్తున్నామని వెల్లడించారు. అత్యవసర పనులకు ప్రాధాన్యం ఇచ్చి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉన్నతాధికారుల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందన్నారు. వ్యవస్థలన్నింటినీ తిరిగి గాడిలో పెడుతున్నామని, సుపరిపాలన అందించే ప్రక్రియ చేపడుతున్నామన్నారు.
నాడు నోటి మాటే శాసనం
జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. సీఎం నోటి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నిబంధనలన్నీ పక్కన పెట్టి మరీ జీవోలు ఇచ్చేవారు. ఆ తర్వాత నింపాదిగా నిబంధనలు అమలు చేసేవారు. జగన్ హయాంలో జంబో టీటీడీ బోర్డు జీవో కూడా అలా వచ్చిందే. జగన్ దగ్గర సమావేశం జరగ్గానే టీటీడీ సభ్యుల పేర్లతో జీవో వచ్చేసింది. ఆ జాబితా తప్పుల తడకగా ఉండటంతో, జీవో విడుదల చేశాక తప్పులు సవరిస్తూ అనుబంధ జీవోలు ఇచ్చారు. వీఆర్‌ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ అయితే ఏకంగా ఏఎ్‌సవో, ఎస్‌వోలతో సంబంధం లేకుండా నేరుగా ఫైలు పెట్టేసి జీవోలు అర్ధరాత్రి ఇచ్చేవారు. కిందిస్థాయి ఉద్యోగులు, ఎంఎల్‌వోల ప్రమేయం లేకుండానే ఉన్నతాధికారులు జీవోలు ఇచ్చేయొచ్చన్న జీవో కూడా ఆయనే ఓ అర్ధరాత్రి జారీ చేశారు. ఇలాంటి చిత్రమైన పనులను అధికారులు ఎన్నో చేశారు.
ఆర్థిక శాఖ అలసత్వం
వరద నివారణ వంటి అత్యవసర పనుల కోసం నిధులు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినా ఆర్థిక శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. నిధుల విడుదలపై చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయకుండా ఫైళ్లను ఆర్థిక శాఖ అధికారులు పక్కన పడేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వానా కాలానికి ముందే ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయాలని, ప్రాజెక్టుల గేట్లకు యాజమాన్య విధానాలను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. జలవనరుల శాఖ పంపిన ప్రతిపాదనల మేరకు 2346 పనులకుగాను రూ.301 కోట్లను విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు.
దీంతో తక్షణమే ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుందని జల వనరుల శాఖ ఆశించింది. జల వనరులశాఖ ఈ ఏడాది జూలైలో ప్రతిపాదనలు పంపింది. ఇందులో బుడమేరు జలాలను నియంత్రించే వెలగలేరు రెగ్యులేటర్ మరమ్మతు, రక్షణ గోడల కోసం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా పులిచింతల పనులకూ నిధులు కేటాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. నిధులు విడుదల చేయాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాజమౌళి కోరారు. అయినా ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. విపత్తుల నిధుల నుంచి ఆ రూ.301 కోట్లను తీసుకోవాలంటూ ఆర్థిక శాఖ సూచించింది. ఫైలు విపత్తుల శాఖకు వెళ్లింది. వరద నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టేందుకు నిధులు కోరితే విపత్తుల నిధులంటూ ఆర్థిక శాఖ తాత్సారం చేయడం ఏమిటని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.