SIT Officials : నెయ్యి ల్యాబ్‌లో ‘సిట్’
ABN , Publish Date - Oct 01 , 2024 | 03:57 AM
శ్రీవారి లడ్డూల నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు తమ విచారణను విస్తృతంగా చేపడుతున్నారు. తిరుమలలో ప్రసాదాలకు వినియోగించే నెయ్యి, ఇతర ముడిసరుకుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌కు సోమవారం ఉదయం 11 గంటలకు చేరుకున్నారు.
నాలుగున్నర గంటలపాటు పరిశీలన
తిరుమలకు నెయ్యి ట్యాంకర్లపై ఆరా
నేడు ముడిసరుకుల స్టోరేజీల తనిఖీ
తిరుమల, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూల నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు తమ విచారణను విస్తృతంగా చేపడుతున్నారు. తిరుమలలో ప్రసాదాలకు వినియోగించే నెయ్యి, ఇతర ముడిసరుకుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌కు సోమవారం ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, అదనపు ఎస్పీ వెంకట్రావు, ఇతర సభ్యులతో కలిసి సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ల్యాబ్ మొత్తాన్ని పరిశీలించారు. నెయ్యి ట్యాంకర్లు ఎలా వస్తాయి, శాంపిల్స్ ఎలా సేకరిస్తారు, ఎలాంటి ప్రమాణాలు ఉంటే నెయ్యిని వినియోగానికి తీసుకుంటారు, నెయ్యి పరీక్ష చేసే సిబ్బందికి పూర్తిస్థాయిలో పరిజ్ఞానం ఉందా, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిస్తే గుర్తించగలిగే సామర్థ్యం ఇక్కడి ల్యాబ్‌లో ఉందా అనే అంశాలపై దర్యాప్తు చేశారు. గత ఐదేళ్లలో ఎన్ని ట్యాంకర్లు తిరస్కరించారు, తిరస్కరించిన సంస్థలకు ఏవైనా నోటీసులు ఇచ్చారా, తిరిగి అదే సంస్థల నుంచి ఎప్పుడైనా ట్యాంకర్లు వచ్చాయా అనే అంశాలపైనా ఆరా తీశారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ల్యాబ్‌లోనే ఉండి దర్యాప్తు చేశారు. అదే సమయంలో టెస్టింగ్ కోసం వచ్చిన ట్యాంకర్‌లోని నెయ్యి శాంపిల్స్ తీసుకుని పరీక్షించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. మంగళవారం ఉదయం సిట్ సభ్యులు మరోసారి ల్యాబ్, నెయ్యి నిల్వ కేంద్రం, లడ్డూ తయారీ పోటును తనిఖీ చేయనున్నారు.