Skill University Plans : నైపుణ్య వర్సిటీ ఎక్కడో?
ABN , Publish Date - Dec 10 , 2024 | 04:43 AM
రాష్ట్ర యువతలో నైపుణ్యాలు మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేయదలచిన నైపుణ్య విశ్వవిద్యాలయం ఎక్కడ అనేది ప్రశ్నార్థకంగా మారింది. తిరుపతిలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని, 50 ఎకరాల భూమి కేటాయించారు.
తిరుపతిలో ఏర్పాటుకు గతంలో నిర్ణయం
50 ఎకరాల భూమి కూడా కేటాయింపు
ఇప్పుడు దానిపై ప్రభుత్వం పునరాలోచన
ప్రైవేటు వర్సిటీతో కలసి చేపట్టే అవకాశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర యువతలో నైపుణ్యాలు మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేయదలచిన నైపుణ్య విశ్వవిద్యాలయం ఎక్కడ అనేది ప్రశ్నార్థకంగా మారింది. తిరుపతిలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని, 50 ఎకరాల భూమి కేటాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆ దిశగానే కసరత్తు జరిగింది. కానీ కొంతకాలంగా దీనిపై ఎలాంటి కదలిక లేదు. నైపుణ్యాభివృద్ధి సంస్థ సారథ్యంలో తిరుపతిలో ఏర్పాటు చేయదలచిన స్కిల్ వర్సిటీపై సర్కారు పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ రెండు నెలల కిందట కోరింది. అందులో భాగంగా మూడు ప్రతిపాదనలు చేసింది. పూర్తిగా ప్రభుత్వమే యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, ప్రభుత్వం భూమి కేటాయించి ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం, ఎలాంటి నిధులు, భూములు ఇవ్వకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం. విజయనగరంలోని సెంచూరియన్ ప్రైవేటు యూనివర్సిటీ స్కిల్ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. పూర్తిగా ఆ వర్సిటీ నిధులతోనే నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భాగస్వామ్యం ఉంటుంది.
ఇప్పటికే ఒడిశాలో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిన సెంచూరియన్.. అదే తరహాలో ఇక్కడ కూడా మరొకటి ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో తిరుపతిలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు భూమి కేటాయించినా అడుగు ముందుకు పడలేదు. భూమి, భవనాలు, ల్యాబ్‌లు, సిబ్బంది అన్నీ కలిపి కనీసం రూ.300 కోట్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆ స్థాయిలో నిధులు వెచ్చించడం సర్కారుపై ఆర్థిక భారంగా మారుతుంది. అలాగే ఈ వర్సిటీ ఏర్పాటు చేసినా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు బోధించే సిబ్బంది అవసరం. ప్రస్తుతం ఉన్నత విద్యలోనే కొంతమేర నైపుణ్య శిక్షణ అందిస్తున్నందున వర్సిటీ ప్రారంభించిన తర్వాత దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. మరోవైపు నైపుణ్య గణన చేపట్టినందున స్కిల్ వర్సిటీ అంశాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.,