Share News

సోషల్‌ మీడియా అబ్యూజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లు తీసుకురావాలి

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:11 AM

సోషల్‌ మీడియా వెళ్తున్న అపసవ్య ధోరణిని సరిచేయడం ఈ సభ నుంచే ప్రారంభం కావాలని, సోషల్‌ మీడియా అబ్యూజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లును సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

సోషల్‌ మీడియా అబ్యూజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లు తీసుకురావాలి

గత ఐదేళ్లూ చట్టసభలు హుందాతనం కోల్పోవడంతో సోషల్‌ సైకో మూకలు బరితెగించాయి: డిప్యూటీ సీఎం

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకు పవన్‌, మంత్రులు శుభాకాంక్షలు

అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా వెళ్తున్న అపసవ్య ధోరణిని సరిచేయడం ఈ సభ నుంచే ప్రారంభం కావాలని, సోషల్‌ మీడియా అబ్యూజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లును సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మార్పు తెస్తామని ప్రజలు మనపై అపార నమ్మకం ఉంచారని, దాన్ని మనం నిలబెట్టుకోవాలన్నారు. గత ఐదేళ్లపాటూ చట్టసభలు హుందాతనం కోల్పోవడం వల్లనే సోషల్‌ మీడియాలో సైకో మూకలు బరితెగించాయన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శాసనసభలో పవన్‌ మాట్లాడుతూ... రఘురామ మాటల్లో పదునుతో పాటు హాస్యం సైతం ఉంటుందని అన్నారు. తాము సినిమాల్లో దెబ్బలు తిన్నట్టు నటిస్తామని, కానీ రఘురామరాజు నిజంగా దెబ్బలు భరించి నిలబడి గెలిచారన్నారు. నేరపూరిత ఆలోచనలు ఉన్న వ్యక్తి చేతికి అధికారం దక్కితే ఎవ్వరినైనా బలి చేస్తారని వ్యాఖ్యానించారు. జడ్జీలను, పార్టీ కార్యకర్తలను, సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామరాజును కూడా వదల్లేదన్నారు. ఆయన్ను శారీరకంగానే కాదు, మానసికంగానూ హింసించారని అన్నారు. రఘురామరాజుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తమకు భయాన్ని కలిగించిందన్నారు. అందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న సంకల్పంతో ముందుడుగేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు తోటిసభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. కర్మ ఎవరినీ వదలదని, రఘురామను తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వని వారు ఇప్పుడు కనీసం సభకు రాలేకపోతున్నారంటూ జగన్‌ను పవన్‌ విమర్శించారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌.. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మిమ్మల్ని నోరారా అధ్యక్షా అని పిలిచే అదృష్టాన్ని జగన్‌ కోల్పోయారు’ అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, మంత్రి కందుల దుర్గేశ్‌ డిప్యూటీ స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

జగన్‌ ఒక్కసారైనా రావాలి: అచ్చెన్న

ఐదేళ్లలో జగన్‌ ఒక్కసారైనా అసెంబ్లీకి వస్తే చూడాలన్న కోరిక ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ ఒక్కరోజు తనకు ఓ గంటపాటు మైక్‌ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. డిప్యూటీ స్పీకర్‌గా క్రమశిక్షణ కోల్పోకుండా హాస్యం, ఛలోక్తులతో సభను ఆహ్లాదకరంగా నడిపించాలని రఘురామకు సూచించారు.

రఘురామ భోళాశంకరుడు: లోకేశ్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రియల్‌ రెస్పాన్సిబుల్‌ రెబలిస్ట్‌ అని మంత్రి నారా లోకేశ్‌ అభివర్ణించారు. రఘురామభోళాశంకరుడన్నారు. ఉండి నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేస్తున్న తీరు తన లాంటి యువనాయకులకు ఆదర్శనీయమన్నారు. తనను బంధించి కస్టడీలో తీవ్రంగా హింసించినప్పటికీ ఎక్కడా తాను భయపడలేదని చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పుడు ఢిల్లీలో తనకు అండగా నిలబడి న్యాయ సలహాలు ఇచ్చిన సంగతిని ఆయన గుర్తుచేసుకున్నారు. ఏపీలో చట్టసభలను పూర్తిగా డిజిటలైౖజేషన్‌ చేయాలని, పేపర్లు కనపడకుండా చేసేలా నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు.

భావవ్యక్తీకరణ పేరుతో దిగజారుడు భాష: రఘురామ

వైసీపీ నేతలు గత ఐదేళ్లలో చట్టసభల్లో జుగుప్సాకరమైన భాషను తీసుకొచ్చారని, భావవ్యక్తీకరణ పేరుతో దిగజారుడు భాషను విచ్చలవిడిగా వాడారని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు ఆ నాయకులను అత్యంత దారుణంగా ఓడించారని అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన తనకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు చెప్పడం ఆహ్వానించదగిన పరిణామమని పేర్కొన్నారు. చిన్నపిల్లలు చందమామ కోసం మారాం చేసినట్టు జగన్‌ ప్రతిపక్ష హోదా కోసం మారాం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. అసెంబ్లీకి వస్తేనే కదా మైక్‌ ఇస్తారో లేదో తెలుస్తుందని, రాకుండానే ఇవ్వట్లేదనడంలో అర్థం లేదన్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన సభ్యులంతా ప్రతి రోజు అసెంబ్లీకి రావాలని, కౌల్‌ అండ్‌ షట్జర్‌ పుస్తకం చదువుకోవాలని, సభలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలని రఘురామ సూచించారు. గత ప్రభుత్వం తనను అరెస్ట్‌ చేసి చిత్రహింసలకు గురిచేసిన సందర్భంలో తన కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా నిలవడమే కాకుండా తనకు డిప్యూటీ స్పీకర్‌ హోదా కల్పించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 15 , 2024 | 03:11 AM