Share News

Somireddy : నాసిరకం బొగ్గుతో అరబిందో దోపిడీ

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:12 AM

ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేసి అరబిందో సంస్థ భారీగా దోచుకుందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు.

Somireddy : నాసిరకం బొగ్గుతో అరబిందో దోపిడీ

  • వైసీపీ హయాంలో నాలుగున్నర లక్షల టన్నుల సరఫరా

  • దాని విలువ రూ. 382 కోట్లు : సోమిరెడ్డి

అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేసి అరబిందో సంస్థ భారీగా దోచుకుందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆ నాసిరకం బొగ్గు వల్ల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గి చివరకు భారీ రేట్లకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనాల్సి వచ్చిందన్నారు. ఈ భారం వినియోగదారులపై పడిందని చెప్పారు. సోమిరెడ్డి సోమవారం ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి బృందం అవినీతి కార్యకలాపాలతో చెలరేగిపోయింది. జేబులు నింపుకోవడానికి నాటి సీఎం జగన్‌ కూడా రాష్ట్రాన్ని ఆ ముఠాకు రాసిచ్చారు. మట్టి కలసిన నాలుగున్నర లక్షల టన్నుల పరమ నాసిరకం బొగ్గును అరబిందో సంస్థకు అనుబంధంగా ఉన్న ట్రైడెంట్‌ నాలెడ్జ్‌ కంపెనీ జెన్‌కోకు సరఫరా చేసింది. దీని విలువ రూ. 382 కోట్లు. ఈ నాసిరకం బొగ్గు వల్ల నెల్లూరు జిల్లాలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి నలభై శాతానికి పడిపోయింది. ఈ బొగ్గు వ్యవహారంపై 2022లోనే జెన్‌కో ఉద్యోగులు, మేము ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేశాం. దీంతో ఆ బొగ్గులో లక్ష టన్నులు డంపింగ్‌ యార్డులో పారబోశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ను రూ. 10 నుంచి రూ. 14 వరకు కొన్నారు. ఈ భారం రూ. 700 కోట్లు తర్వాత వినియోగదారులపై పడింది. దీనికి విజయసాయిరెడ్డి ముఠా కుంభకోణాలే కారణం.


కూటమి ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన బొగ్గు రాకతో విద్యుత్‌ ఉత్పత్తి పెరిగింది. వైసీపీ హయాంలోని కుంభకోణంలో ఉన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. 2019-24 మధ్య కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కోసం జెన్‌కో ఎంత బొగ్గు కొనుగోలు చేసింది? విద్యుత్‌ తక్కువ ఉత్పత్తికి కారణం ఏమిటి? ఏ కారణంతో విదేశీ బొగ్గును తిరస్కరించారు? నాసిరకం బొగ్గును సరఫరా చేసిన కంపెనీకి ఎంత జరిమానా విధించారు? ఆ కంపెనీపై కేసులు ఎందుకు పెట్టలేదు? వీటన్నిటినీ తేల్చడానికి సీఐడీ, విజిలెన్స్‌ విభాగాలు దర్యాప్తు చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 24 , 2024 | 05:12 AM