Chandrababu Naidu: కక్ష సాధింపులొద్దు
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:22 AM
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గాలపై అవిశ్వాస తీర్మానం పెట్టే సమయాన్ని కుదించరాదని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. వాటి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి, నవంబరుల్లో పూర్తవుతున్నందున ప్రత్యేకంగా పనిగట్టుకుని ఎందుకు దించేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల సమయం కుదించం: సీఎం
79 ‘మున్సిపాలిటీల’ పదవీకాలం వచ్చే మార్చికి పూర్తి
మిగతావాటికి నవంబరు దాకా గడువు
ఇంత తక్కువ సమయం ఉంటే పనిగట్టుకుని దించడం ఎందుకు?
విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం.. సీఎం స్పష్టీకరణ
పులివెందుల మంచినీటి పథకం కొనసాగింపు
సంక్రాంతి తర్వాత కొనసాగనున్న రెవెన్యూ సదస్సులు
దరఖాస్తుల లెక్క కాదు.. ఎన్ని పరిష్కరించారన్నదే ప్రధానం
మంత్రుల పనితీరుపై ఐవీఆర్‌ఎస్ సర్వే: చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గాలపై అవిశ్వాస తీర్మానం పెట్టే సమయాన్ని కుదించరాదని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. వాటి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి, నవంబరుల్లో పూర్తవుతున్నందున ప్రత్యేకంగా పనిగట్టుకుని ఎందుకు దించేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కక్ష సాధింపులు అవసరం లేదని.. విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామని ఆయన స్పష్టం చేశారు. గురువారమిక్కడ వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా స్థానిక సంస్థల పాలక వర్గాలపై అవిశ్వాసం పెట్టే విషయమై చర్చ జరిగింది. గతంలో అవిశ్వాసం పెట్టడానికి ఏడాది సమయం ఉండేది. దానిని గత వైసీపీ ప్రభుత్వం మార్చి.. పదవీకాలం నాలుగేళ్లు పూర్తయ్యేవరకు అవిశ్వాసం పెట్టరాదని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్‌పర్సన్లుగా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమయాన్ని కుదించడంపై కసరత్తు జరిగింది. అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి వీలు కల్పిస్తే వారందరినీ దించివేయడానికి అనేకచోట్ల టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలకవర్గాల పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తికాగానే అవిశ్వాసం పెట్టడానికి వీలుకల్పిస్తూ పురపాలక శాఖ ఒక ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచింది. పాలనపై దృష్టి పెడదామని, ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఉన్నవారిని దించే వ్యవహారాలు పెట్టుకోకపోవడం మంచిదని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఇప్పుడున్న పాలక వర్గాలకు ఇంకా ఎంత గడువుందని మంత్రి పొంగూరు నారాయణను సీఎం అడిగారు. 79 మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుందని, మిగిలిన వాటికి నవంబరులో పూర్తవుతుందని ఆయన బదులిచ్చారు. ఇంత కొద్ది సమయం ఉన్నవాటిని దించాల్సిన అవసరం లేదని సీఎం తేల్చిచెప్పారు. చైౖర్మన్ వేరే పార్టీ అయినప్పుడు జడ్పీ సమావేశాల్లో తీర్మానాలు చేయడానికి ఒక్కోసారి ఇబ్బంది ఎదురవుతోందని ఒక మంత్రి అనగా.. ముందుగానే అందరితో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని, దానికోసం చైర్మన్లను దించాల్సిన పని లేదని సీఎం సూచించారు. దీంతో ఆ ప్రతిపాదనను మంత్రివర్గం తిరస్కరించింది.
మూడు భారీ నీటి ప్రాజెక్టుల కొనసాగింపు..
జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టిన మూడు భారీ నీటి ప్రాజెక్టులను యథాతథంగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. పులివెందుల, డోన్, ఉద్ధానంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం నడుస్తోంది. పులివెందులకు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి అక్కడి ప్రజలకు ఉపయోగపడుతున్నందువల్ల ప్రాజెక్టును కొనసాగించి పూర్తి చేద్దామని, ఆయనలా కక్ష సాధింపులు మనకు అవసరం లేదని సీఎం అన్నారు.
సమస్యలను సవ్యంగా పరిష్కరించాలి..
గ్రామాల్లో రైతులు ప్రస్తుతం వ్యవసాయ పనుల ఒత్తిడిలో ఉన్నారని, అందువల్ల రెవెన్యూ సదస్సులను సంక్రాంతి తర్వాత కూడా నిర్వహించాలని నాదెండ్ల కోరారు. తమకు దరఖాస్తులు బాగానే వస్తున్నాయని, ఇప్పటికే 3.5లక్షలు వచ్చాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సదస్సుల సమయం పొడిగింపునకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
ఒక్కదానికీ యూసీలివ్వలేదు..
కేంద్ర పథకాలు మొత్తం 93 ఉంటే వైసీపీ హయాంలో ఒక్కదానికి కూడా యూసీలు సమర్పించకపోవడంతో అన్నీ నిలిచిపోయాయని మంత్రి కేశవ్ చెప్పారు. ఈ ఆరు నెలల్లో అందులో 70 పథకాలు పునరుద్ధరించగలిగామన్నారు. ప్రభుత్వ విజన్ ప్రణాళిక, 20పాలసీలను మంత్రులు అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి ప్రతి మంత్రి తన శాఖ పరిధిలో పనిచేయాలని సీఎం సూచించారు.
అసెంబ్లీ డిజైన్లపై స్పీకర్ అధ్యక్షతన కమిటీ
రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ భవనం లోపల డిజైన్లు ఎలా ఉండాలో నిర్ణయించడానికి స్పీకర్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. భవనం భౌతిక డిజైన్ ఇప్పటికే పూర్తయినందున అందులో మార్పులు ఉండవని.. లోపల ఎలా ఉండాలో.. ఏయే అవసరాలకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలో కమిటీలో చర్చించి సూచనలు ఇవ్వాలని సీఎం చెప్పారు. అసెంబ్లీ భవనం పైన ఉండే టవర్ విజయవాడ, గుంటూరు నుంచి కూడా కనిపిస్తుందని, ఇంత పెద్ద టవర్ దేశంలో మరే అసెంబ్లీకి లేదని తెలిపారు. 47 అంతస్థులతో నిర్మించబోయే సచివాలయ టవర్‌లో ప్రతి శాఖ మంత్రి, కార్యదర్శి, శాఖాధిపతి ఒకేచోట ఉండేలా చూడాలని ఆదేశించారు. శాఖాధిపతులకు సందర్శకుల తాకిడి ఉంటుందని, వాటిని వేరేచోట పెడితే బాగుంటుందని మంత్రి లోకేశ్ అన్నారు. ఇందుకు సీఎం అంగీకరించలేదు. గిరిజన వర్సిటీ కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన స్థలాన్ని గత జగన్ సర్కారు మార్చిందని.. అక్కడే నిర్మాణం కొనసాగిద్దామని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో రుణంతో చేపట్టే పనులు సంక్రాంతి తర్వాత మొదలవుతాయని, ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టే పనులు ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. ఈ రెండు మార్గాల నుంచి అందే నిధులు రూ.31వేల కోట్లు ఉంటాయని, చాలా పనులు వీటితోనే పూర్తవుతాయన్నారు.
పనితీరు నివేదికలు ఇచ్చింది ముగ్గురే
మంత్రులు ఆరు నెలల పనితీరుపై స్వయం మదింపు నివేదికలు ఇవ్వాలని అడిగితే.. నిమ్మల రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే ఇచ్చారని, మిగిలిన వారు ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. ప్రతి శాఖపై తానే ఆరు నెలల నివేదికలు తయారు చేయిస్తున్నానని ఆయన చెప్పినప్పుడు.. వాటిని మంత్రులకు ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. ఒక్కో మంత్రితో విడివిడిగా మాట్లాడతానని, అప్పుడు ఇస్తానని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రుల పనితీరు మెరుగుకు ఆయన పలు సూచనలు చేశారు. ‘వారు క్షేత్ర స్థాయి పర్యటనలు పెంచాలి. రాష్ట్ర సచివాలయానికి క్రమం తప్పకుండా వస్తూ ఉండండి. మీ శాఖలకు సంబంధించి కేంద్ర నిధులు ఎంత వరకూ రాబట్టాలో ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా పనిచేయండి. మీ పనితీరుపై సమాచారం తెప్పించుకుంటున్నాను. ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాను. మీ నియోజకవర్గంలో ప్రభుత్వ ఇమేజ్ ఎలా ఉందో కూడా సర్వే చేయిస్తున్నాను’ అని ఆయన వారికి చెప్పారు.
మనకు కక్ష సాధింపులు అవసరం లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం. ఉన్న సమయాన్ని మంచి పాలన అందివ్వడానికి వాడుకుందాం.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల లెక్క నాకు ముఖ్యం కాదు. వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయన్నది ప్రధానం. పక్క టేబుల్ మీదకు తోసేయడంలో కొందరు అధికారులు నిపుణులు. అలా కాకుండా వాటిని సవ్యంగా పరిష్కరించే విధానాలపై దృష్టి పెట్టండి.
మంత్రులు ఫైళ్లను త్వరగా పరిష్కరించాలి. మీ వద్దకు వచ్చేవే గాక మీ శాఖకు వస్తున్నవి కూడా త్వరగా పరిష్కారయ్యేలా బాధ్యత తీసుకోవాలి.
- ముఖ్యమంత్రి చంద్రబాబు