Supreme Court : ఇసుక అక్రమాలు నిజమే
ABN , Publish Date - May 13 , 2024 | 04:50 AM
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తక్షణం ఇసుక అక్రమాలను నిలిపివేయించాలని, ఈ వ్యవహారంపై ఈ నెల 16లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జగన్ సర్కారును ఆదేశించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఫొటోల్లో ఉన్న అక్రమ ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలన చేయించాలని సూచించింది.
ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి తవ్వకాలు
తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలి
ప్రత్యేక బృందాలతో పరిశీలన చేయించాలి
ఈ నెల 16లోగా నివేదిక ఇవ్వండి
జగన్ సర్కారును ఆదేశించిన సుప్రీం ధర్మాసనం
నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి
కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశం
తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన
ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ సంస్థలపై చర్యలుంటాయా?
అస్మదీయ కంపెనీలని వెనకేసుకొస్తారా అని సందేహాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తక్షణం ఇసుక అక్రమాలను నిలిపివేయించాలని, ఈ వ్యవహారంపై ఈ నెల 16లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జగన్ సర్కారును ఆదేశించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఫొటోల్లో ఉన్న అక్రమ ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలన చేయించాలని సూచించింది. ఇదే అంశంలో ఇంతకుముందు ఇచ్చిన ఆదేశంపై నాలుగు వారాల్లోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని, ఏపీకి ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని పంపించి అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేశారా, లేదా పరిశీలిచాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ధర్మాసనం ఆదేశించింది. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి, అన్ని నిబంధనలు ఉల్లంఘించి ఇసుక అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న కారణంతో రాష్ట్రంలో 160కి పైగా బీ2 రీచ్‌ల పర్యావరణ, మైనింగ్ లైసెన్స్‌లను ఏడాదిన్నర క్రితమే ఎన్జీటీ రద్దుచేసింది. అయినా భారీ యంత్రాలను ఉపయోగించి, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని తాజాగా సుప్రీంకోర్టు పరిశీలనలోనూ తేలింది.
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై 2022-23లోనే ఎన్జీటీ నిగ్గుతేల్చింది. అప్పట్లోనే ఇసుక రీచ్‌ల లైసెన్సులు రద్దు చేసింది. అక్రమ తవ్వకాలకు పాల్పడినందుకు జేపీ వెంచర్స్‌కు భారీ జరిమానా విధించింది. దీనిపై జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్జీటీ విధించిన పెనాల్టీపై స్టే ఇచ్చింది. శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ కేసు మరోసారి విచారణకొచ్చింది. గతంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టు చేసిన జేపీ వెంచర్స్‌తో పాటు తాజాగా కాంట్రాక్టు నిర్వహిస్తున్న ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ సంస్థలు కూడా అక్రమ తవ్వకాలు చేస్తున్నాయంటూ ఫొటోలు, వీడియోలతో సహా పిటిషనర్లు నాగేంద్రకుమార్, ఇతరులు కీలక ఆధారాలు సమర్పించారు. బీ2 రీచ్‌లకు కొత్తగా పర్యావరణ, మైనింగ్ అనుమతులు లేకుండానే ఎనిమిది జిల్లాల పరిధిలో జీసీకేసీ, మరో 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలు ఇసుక తవ్వకాలు చేపడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిశీలించిన జస్టిస్ అభయ్ ఎస్.
ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం... ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి ఏపీలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో పర్యావరణ విభాగం, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రభావ అంచనా విభాగాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్లు, మైనిం గ్ అధికారులు ఇసుక తవ్వకాలపై ఇప్పటికే ఎన్జీటీకి, హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. అయి నా కేంద్రం నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి, పరిశీలన చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఒకరకంగా జగన్ సర్కారుకు చెంపపెట్టులాంటి తీర్పు అని నిపుణులు చెబుతున్నారు.
‘మా దృష్టికి వచ్చిన ఫొటోలను పరిశీలిస్తే... ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీలోని అనేక ప్రాంతాల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ప్రాథమికంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు తీసిన సమయం, తేదీ స్పష్టంగా ఉన్నాయి. ఇంకా అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను తెలిపే అక్షాంశ, రేఖాంశాలు కూడా అందులో ఉన్నాయి.’
- సుప్రీంకోర్టు
జగన్ సర్కారుకు విషమ పరీక్ష
ఇసుక తవ్వకాల్లో అక్రమాలు లేవంటూ కలెక్టర్లు, గనుల శాఖ అధికారులు గతంలో నివేదికలు ఇచ్చారు. వాటిపై అనుమానంతో ఎన్జీటీ... కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్తలు, నిపుణులను రాష్ట్రానికి పంపి ప్రత్యేకంగా అధ్యయనం చేయించింది. పర్యావరణాన్ని ఉల్లంఘిస్తూ 2టన్నుల బకెట్ ఉన్న జేసీలతో నదీగర్భాల్లో నుంచి ఇసుకను తోడేస్తున్నారని, 24 గంటలపాటు తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చింది. ఇదే నివేదిక హైకోర్టు పరిశీలనకు కూడా వెళ్లింది. ఇటీవల హైకోర్టు కూడా అధికారుల నివేదికలు కోరింది.
ఏ తప్పూ జరగడం లేదని అటు కలెక్టర్లు, ఇటు గనులశాఖ అధికారులు నివేదికలు పంపారు. కానీ, ఇప్పుడు అక్రమ తవ్వకాల పరిశీలనకు ప్రత్యేక అధికారుల బృందాలను పంపించడంతో పాటు 16లోగా నివేదిక పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇసుక తవ్వకాలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారుల బృందాలు వేర్వేరుగా నివేదికలు ఇవ్వనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలుమార్లు అధ్యయనాలు చేసిన కేంద్ర బృందం కచ్చితంగా వాస్తవాలతో కూడిన నివేదికను ఇవ్వనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం నివేదిక ఇవ్వనుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అంతా సానుకూలమేనని నివేదిక ఇస్తే అధికార పెద్దలు అడ్డంగా దొరికిపోవడం, కోర్టు ఆగ్రహానికి గురికావడం ఖాయం. కాబట్టి, సుప్రీంకోర్టు ఆదేశం రాష్ట్ర ప్రభుత్వానికి విషమ పరీక్షేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైకోర్టుకు తప్పుడు నివేదికలు
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టులోనూ విచారణ జరుగుతోంది. అక్రమ తవ్వకాలు, పర్యావరణ ఉల్లంఘనలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా గనులశాఖ అధికారులను నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నివేదికలు గనులశాఖ ద్వారా హైకోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఇసుక తవ్వకాల్లో ఎలాంటి అక్రమాలు లేవని నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో వారు కూడా సానుకూల నివేదికలు పంపారు.
కొమ్ముకాస్తారా... చర్యలుంటాయా?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్న ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ సంస్థలపై జగన్ సర్కారు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ రెండు కంపెనీలపై చర్యలు తీసుకుంటారా లేక అస్మదీయ కంపెనీలని వెనకేసుకొస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడిన జేపీ వెంచర్స్‌పై చర్యలు తీసుకోవాలన్నప్పుడు జగన్ సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో దర్జాగా నదీ గర్భాలను తోడేశారు. ఇప్పుడు ఈ రెండు సంస్థల విషయంలో జగన్ సర్కారు వైఖరి ఏమిటో త్వరలోనే తేలనుంది.