Supreme Court: పుణ్య క్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలా?
ABN , Publish Date - Nov 09 , 2024 | 05:28 AM
తిరుమల-తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చాలన్న వినతిని శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశంలోని కేదార్‌నాథ్, పూరీ జగన్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలను కూడా ప్రత్యేక రాష్ట్రాలుగా చేయమంటారా?
కేఏ పాల్‌పై సుప్రీంకోర్టు అసహనం
తిరుపతిని యూటీగా మార్చాలన్న పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల-తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చాలన్న వినతిని శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశంలోని కేదార్‌నాథ్, పూరీ జగన్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలను కూడా ప్రత్యేక రాష్ట్రాలుగా చేయమంటారా? అని పిటిషనర్ కేఏ పాల్‌ను ప్రశ్నించింది. తిరుమల-తిరుపతిని యూటీగా ప్రకటించాలని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని కోరుతూ కేఏ పాల్ అక్టోబర్ 3న పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. 746 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ సిటీ ఉన్నప్పుడు, 30 లక్షల మంది భక్తులు ఉన్న తిరుపతిని ఎందుకు యూటీగా ఏర్పాటు చేయలేమని అన్నారు.
క్రైస్తవులు, ముస్లింలు తమ మత స్థలాలైన చర్చిలు, మసీదులపై స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నారని, అదే హక్కును హిందువులకు నిరాకరించడం సరికాదని చెప్పారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘రాష్ట్రాలు, యూటీలపై నిర్ణయాలు పార్లమెంటులో జరుగుతాయి. అది మా పరిధి కాదు. మీ వాదనలు వింటుంటే భవిష్యత్తులో దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, గురుద్వారాలు, ఇతర మందిరాలను యూటీలుగా మార్చమనేలా ఉన్నారు’’ అంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.