YSRCP vs TDP: జగన్ అడ్డాలో టీడీపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడే..
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:08 PM
రాబోయే 2025 నూతన సంవత్సరానికల్లా ప్రొద్దుటూరు మున్నిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. కచ్చితంగా కౌన్సిల్లో మెజారిటీ సాధించి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేయగలమనే నమ్మకంలో టీడీపీ నేతలు ఉన్నారు. కానీ..
రాబోయే 2025 నూతన సంవత్సరానికల్లా ప్రొద్దుటూరు మున్నిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. కచ్చితంగా కౌన్సిల్లో మెజారిటీ సాధించి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేయగలమనే నమ్మకంలో టీడీపీ నేతలు ఉన్నారు. కానీ వైసీపీ చైర్‌పర్సన్, ఇద్దరు వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టి దించాలా.. లేక మెజారిటీ సభ్యులతో కౌన్సిల్లో తామనుకున్న అంశాలు ఆమోదం పొందితే చాలా అనే విషయంపై టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. చైర్మన్ పదవి దక్కాలంటే 2/3వ కౌన్సిలర్లు ఉండాలి. కానీ కౌన్సిల్లో పలు అంశాలు ఆమోదం పొందాలంటే సగానికి కన్నా ఒక్కరు ఎక్కువ ఉన్నా చాలు. ఈ మేరకు మెజారిటీ సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదని టీడీపీ భావిస్తోంది.
ప్రొద్దుటూరు, డిసెంబరు 17: ఏపీలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం గడిచిపోయింది. అయినా రాష్ట్రంలో స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, పంచాయతీలు అధిక భాగం ఇంకా వైసీపీ చేతిలోనే ఉన్నాయి. అధికారం మారడంతో సహజంగా కొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ కావడం తప్ప ప్రత్యేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్లు, మున్సిపల్ పాలక మండళ్లను దక్కించుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. ఇందుకు కారణం వైసీపీ నుంచి టీడీపీలోకి ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే కౌన్సిలర్ల కోసం పెద్దఎత్తున ఖర్చు పెట్టుకోవాల్సి రావడం ముఖ్యమైంది. అంతేకాకుండా మున్సిపల్ కౌన్సిళ్లు ముగియడానికి ఇక కేవలం ఒకటిన్నర సంవత్సరం సూత్రమే ఉంది. పైగా నాలుగేళ్లు పూర్తికానిదే మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వీలులేదు. అయితే త్వరలో రెండున్నర సంవత్సరాలకే ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మా నం పెట్టే ఆర్డినెన్సును కూటమి ప్రభుత్వం తీసుకురానుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, నా యకులపై అసమ్మతి, అధికార పార్టీలోకి వెళితే స్వంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడంతో పాటు వార్డులో అభివృద్ధికి నిధులు సాధించవచ్చనే ఉద్దేశంతో పలువురు వైసిపిని వీడేందుకు సుఖంగా ఉన్నారు. ఇలాంటి వారిని పార్టీలోకి లాక్కుని పైసా ఖర్చులేకుండా పాలకమండలిని కైవసం చేసుకోవాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. అయితే మరికొందరు కౌన్సిలర్లు అఖరుదాకా ఉంటే మెజారిటీ కోసమైనా నాలుగు రూకలు రాలుతాయనే ఆశతో వైసీపీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే నంద్యాల సరదరాజులరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మ్యాజిక్ ఫిగరకు చేరువలో..
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 41 వార్డులు ఉన్నాయి. కేవలం ఒకే ఒక వార్డులో టీడీపీ కౌన్సిలర్ గెలుపొందారు. తక్కిన వార్డులను వైసీపీ దక్కించుకుంది. అందులో 11వ వార్డు నుంచి ఎన్నికైన రమేశ్ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన రాజీనామా చేశారు. అంటే 40 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే టీడీపీ నుంచి గెలిచిన 33వ వార్డు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి సాధారణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసిపిలో చేరారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై అసమ్మతితో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు పంగనూరు మురళీధర్ రెడ్డి, మునీర్, వైఎస్ మహ్మద్ గౌస్, చింతకుంట సరిత, జంబాపురం వెంకలక్ష్మి టీడీపీ గూటికి వచ్చారు. మరో కౌన్సిలర్ ఇర్ఫాన్ కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో వైసీపీ నుంచి టీడీపీకి వలసల పర్వం మొదలైంది. పలు విడతలుగా వైసీపీ నుంచి మోపూరి రేవతి, కొవ్వూరు స్వాతి, రాగుల శాంతి, షేక్ కమాల్ బాషా, అలవలపాటి అరుణాదేవి, పల్లా రమాదేవి, చింపిరి అనిల్ కుమార్ రావు, కోళ్ల అరుణ, గాజుల శివజ్యోతి, మీగడ దీప్తి.. మొత్తం ఇప్పటి వరకు 18 మంది టీడీపీలో చేరారు. అయితే కౌన్సిల్లో పైచేయి సాధించాలంటే 40 మందికి గాను 21 మంది ఉండాలి. అంటే మరో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరితే కౌన్సిల్లో మెజారిటీ వస్తుంది. కౌన్సిల్లో అజెండాలోని అంశాలను ఆమోదించుకోవచ్చు.
అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే...
మున్సిపల్ చైర్‌పర్సన్ లేదా వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టి పదవుల నుంచి దించాలంటే సభలో మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీ ఉండాలి. అంటే 40 మంది సభ్యుల్లో కనీసం 28 మంది సభ్యులు ఉండాలి. ఇప్పటికే 18 మంది సభ్యులున్నా మరో పది మంది కౌన్సిలర్లు టీడీపీకి అవసరం. వైసీపీలో మరో ముగ్గురు కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీతో టచ్ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఓటు హక్కు ఉంటుంది. ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి కావడంతో ఒక ఓటు టీడీపీకి కలిసి వచ్చినా వైసీపీకి ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ఓట్లు దక్కుతాయి.
ఏడాది కాలానికి ఎవరిని చైర్మన్ చేయాలి...
అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీ చైర్‌పర్సన్‌ను పదవి నుంచి దించాక ఎవరిని మున్సిపల్ చైర్మన్ చేయాల అనే సందిగ్ధం కూడా టీడీపీలో నెలకొంది. ఇప్పటికే టీడీపీలో మూడు నాలుగు వర్గాలు ఉన్నాయి. ఒకరికి అనుకూలంగా చైర్మన్‌ను చేస్తే మరో వర్గంలో అసమ్మతి ఏర్పడక తప్పదు. ఈ పరిస్థితిలో వైసీపీ చైర్‌పర్సన్ అవిశ్వాసం పెట్టకుండా కేవలం కౌన్సిల్లో మెజారిటీకి పరిమితం అవుతారని ఎమ్మెల్యే వర్గం భావిస్తోంది.
మున్సిపల్ పీఠం కాపాడుకునే యత్నంలో వైసీపీ..
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పీఠం టీడీపీకి దక్కకుండా కాపాడుకునే యత్నాలు వైసీపీ చేపట్టింది. అందులో భాగంగా చైర్‌పర్సన్ భీమునిపల్లె లక్ష్మీదేవి, ఆమె భర్త నాగరాజు టీడీపీలో చేరకుండా వారికున్న ఆర్ధిక సమస్యలను పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి పలు యత్నాలు చేపట్టారు. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధిపొందిన కొందరు కౌన్సిలర్లను పార్టీ వీడకుండా కట్టడి చేస్తున్నారు. కొందరు కౌన్సిలర్లకు తాము ఎన్నికల్లో పెట్టిన డబ్బులు చెల్లించాకే పార్టీ మారాలని షరతు పెట్టారు. దీంతో మరికొందరు కౌన్సెలర్లు డబ్బులు చెల్లించే పరిస్థితి లేక విధిలేని పరిస్థితిలో వైసీపీతో ఉంటున్నట్లు బహిరంగంగా వెల్లడిస్తున్నారు. టీడీపీలోకి వచ్చేవారికి ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో అటు వెళ్లినా లాభమేముంటుందని. మరికొందరు వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఏది ఏమైనా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వైసీపీ చేతుల్లో ఉంటుందా ఊడుతుందా అనేది జనవరి నాటికి తేలనుంది.