Share News

TDP : వైసీపీ అరాచకాల చిట్టా!

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:28 AM

జగన్‌ జమానాలో చోటు చేసుకొన్న అధికార అరాచకాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టింది. గత ఐదేళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు పెట్టిన తీరు, ప్రతిపక్ష పార్టీల వారితో పాటు బడుగు బలహీన వర్గాలను....

TDP : వైసీపీ అరాచకాల చిట్టా!

  • రాష్ట్రవ్యాప్తంగా సమాచార సేకరణ

  • తప్పుడు కేసులు, వేధింపులపై నివేదికలు

  • పైనుంచి కింది స్థాయి వరకూ వైసీపీ నేతల అవినీతి, దోపిడీపై ఆరా

  • పోలీసుల వ్యవహారశైలిపైనా సమాచారం

  • చట్టప్రకారం చర్యలకు ప్రభుత్వం యోచన

అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జగన్‌ జమానాలో చోటు చేసుకొన్న అధికార అరాచకాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టింది. గత ఐదేళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు పెట్టిన తీరు, ప్రతిపక్ష పార్టీల వారితో పాటు బడుగు బలహీన వర్గాలను అణచివేసిన వ్యవహారాలపై జిల్లాల వారీగా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోందని తెలుస్తోంది. అవినీతి వ్యవహారాలపై కూడా సమాచార సేకరణ జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాటి ముఖ్యమంత్రి జగన్‌ను వ్యతిరేకించిన సొంత పార్టీ ఎంపీని కూడా పోలీస్‌ కస్టడీలో చితకబాదారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను ఇదే మాదిరిగా పోలీస్‌ స్టేషన్లలో హింసించారని, వేల సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై కూడా దాడికి ప్రయత్నం జరిగింది.

నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌, కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రమణ్యం, నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం, రేపల్లెలో పదో తరగతి చదువుతున్న బాలుడు అమర్‌నాథ్‌ గౌడ్‌, పలమనేరులో ముస్లిం మైనారిటీ బాలిక మిస్బా, కావలి కరుణాకర్‌ వంటి వారి మరణాలపై కూడా ప్రభుత్వం నివేదికలు తెప్పించుకొంటోంది. అధికార పార్టీ నేతలతో అంటకాగి సామాన్యులను వేధించిన పోలీసు అధికారుల తీరుపైనా సమాచారం సేకరిస్తున్నారు. మాచర్ల వంటి చోట్ల పోలీస్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్న ఆరోపణలు కూడా ప్రభుత్వం వద్దకు చేరాయి. గత ఐదేళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తల వివరాలతోపాటు ఆయా సంఘటనల్లో పోలీసు విచారణ ఏ పద్ధతుల్లో జరిగిందనే దానిపై కూడా సమాచారం పంపాలని ఆదేశాలు ఇచ్చారు.


నేరపూరిత చర్యలతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి సంఘటనపైనా విచారణ జరపాలని నిర్ణయించారు. అధికారం అండతో ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకొన్న సంఘటనల జాబితా కూడా సిద్ధమవుతోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉన్నత స్థాయిలో జరిగిన దోపిడీతో పాటు జిల్లాలు, నియోజకవర్గాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు చేసిన అక్రమాలు, సాగించిన దోపిడీ వ్యవహారాలపై కూడా నివేదికల తయారీకి ఆదేశాలు ఇచ్చారు. ఒక్కొక్కటిగా అన్ని అక్రమాలు ప్రజలు ముందు పెట్టి చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Jun 29 , 2024 | 03:28 AM