రోడ్ల నిర్వహణ ప్రైవేటుకు
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:10 AM
రాష్ట్రంలో రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడకుండా, నిరంతర ప్రక్రియగా కొనసాగాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన.
కాంట్రాక్టు కాలపరిమితిపై త్వరలో నిర్ణయం
రహదారులపై టోల్‌గేట్ల ఏర్పాటు ఉత్తదే
కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
ఆర్‌అండ్‌బీ మంత్రి జనార్దన్‌రెడ్డి ఆగ్రహం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడకుండా, నిరంతర ప్రక్రియగా కొనసాగాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. 2016-19 మధ్యకాలంలోనే ఈ విధానాన్ని పాక్షికంగా అమలు చేశారు. అయితే, జగన్ అధికారంలోకి వచ్చాక దీన్ని రద్దు చేయడంతో పాటు రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగని రోజే లేదు. రోడ్ల ఫొటోలను మీమ్స్‌గా వాడినా జగన్ సర్కారు ఏమాత్రం స్పందించలేదు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చేందుకు రూ.600 కోట్లపైనే నిధులు విడుదల చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలన్నా ఏపీలో రోడ్లు బాగోలేవు కదా... అనే ప్రశ్న ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రైవేటు నిర్వహణ (మెయింటెనెన్స్) కాంట్రాక్టును తిరిగి అమలు చేయాలని నిర్ణయించారు. టెండర్ల ద్వారా ఒక ఏజెన్సీని ఎంపిక చేసి, గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ఎక్కడ రహదారి దెబ్బతిన్నా, గుంతలు పడినా ఆ ఏజెన్సీనే మరమ్మతు చేసేలా విధివిధానాలు ఉంటాయి.
రహదారుల నిర్వహణ కాంట్రాక్టు రెండున్నరేళ్లకా లేక ఐదు సంవత్సరాల చొప్పున ఇవ్వాలా అన్నది సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. కాలపరిమితిపై స్పష్టత వచ్చాక నిర్వహణ వ్యయం ఎంత అన్నది నిర్ణయిస్తారు. దీనిపై అధ్యయనం చేయాలని ఆర్‌అండ్‌బీని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు తెలిసింది. ప్రైవేటు నిర్వహణకు ఇచ్చే రహదారులపై టోల్‌గేట్లు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలాఉండగా, రాష్ట్ర, జిల్లా రహదారుల విస్తరణ, అభివృద్ధిని పబ్లిక్, ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై కన్సల్టెంట్లతో అధ్యయనం చేయించాలని ఆర్‌అండ్‌బీని ఆదేశించింది. ఇప్పటికే కన్సల్టెంట్ల ఎంపిక కోసం టెండర్లు కూడా పిలిచారు. ఈ ప్రాజెక్టులకు టెండర్లు ముగిసి పనులు ప్రారంభించే నాటికి మరి కొంతకాలం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.