Share News

Minister Parthasarathi : మీ మనోభావాలు దెబ్బతీశాను..మన్నించండి

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:28 AM

టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడికి వెళ్లిన కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి వేదిక పంచుకున్నందుకు గృహనిర్మాణ..

Minister Parthasarathi : మీ మనోభావాలు దెబ్బతీశాను..మన్నించండి

  • మళ్లీ జరక్కుండా జాగ్రత్తగా ఉంటాను

  • టీడీపీ కార్యకర్తలకు మళ్లీ క్షమాపణ చెప్పిన మంత్రి పార్థసారథి

  • చంద్రబాబు, లోకేశ్‌తో భేటీ.. ‘జోగి’ ఘటనపై వివరణ

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడికి వెళ్లిన కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి వేదిక పంచుకున్నందుకు గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ శ్రేణులను మరోసారి క్షమాపణ కోరారు. మంగళవారం ఉదయం ఆయన మంత్రి లోకేశ్‌ను కలిసి ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీలో చంద్రబాబు, లోకేశ్‌ నాకు చాలా పెద్ద గౌరవం ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా నన్నెంతో ఆదరించారు. వారి మనోభావాలు దెబ్బ తీసినందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నాను’ అని ఆయన అన్నారు. నూజివీడులో కార్యక్రమం ఖరారు మొదలుకొని అతిథులను ఆహ్వానించడం వరకూ మొత్తం పూర్తిగా స్థానికంగా ఉన్న గౌడ సంఘం నేతలే చూసుకున్నారని, అందులో టీడీపీ నేతలెవరికీ ఏ పాత్రా లేదని స్పష్టం చేశారు. ‘స్థానిక ఎమ్మెల్యేగా.. వాళ్లు నాకు ఆహ్వాన పత్రిక పంపినప్పుడు పని ఒత్తిడిలో ఉండి పూర్తిగా చదవలేదు.


ఎవరెవరు వస్తున్నారో గమనించలేదు. కార్యక్రమానికి వెళ్లిన తర్వాత అక్కడ జోగి రమేశ్‌ను చూసి షాక్‌కు గురయ్యాను. ఆహ్వానితుల విషయంలో గౌడ సంఘం నేతలకు నేను ముందుగానే మార్గదర్శకత్వం చేసి ఉండాల్సింది. అలా చేయకపోవడం నా పొరపాటు. విగ్రహావిష్కరణకు వచ్చిన వారిలో అత్యధికులు టీడీపీకి చెందినవారే. జోగి విషయంలో నేను ఏదైనా మాట్లాడితే వారంతా ఇబ్బంది పడతారేమోనని మౌనంగా ఉండిపోయాను. చంద్రబాబు, లోకేశ్‌ నన్ను నమ్మి నాకు గౌరవప్రదమైన హోదా ఇచ్చారు. నేను వారికి గానీ, పార్టీకి గానీ అప్రతిష్ఠ తెచ్చే పనులు ఎప్పుడూ చేయను. టీడీపీని మరింత బలోపేతం చేయాలన్నదే నా ప్రయత్నం. నూజివీడు కార్యక్రమాన్ని నేనే మొత్తం నిర్వహించాననే ప్రచారం నమ్మవద్దు. వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఇటువంటి ప్రచారం చేస్తోంది. భవిష్యత్‌లో ఇటువంటివి జరక్కుండా జాగ్రత్త తీసుకుంటాను’ అని తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబును కూడా పార్థసారథి కలిశారు. జోగి రమేశ్‌ వ్యవహారంపై వివరణ ఇచ్చారు.

Updated Date - Dec 18 , 2024 | 05:28 AM