Andhra Pradesh Politics : హై....హై.... నాయకా !
ABN , Publish Date - May 13 , 2024 | 03:29 AM
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ‘గేమ్ చేంజర్’గా ముద్ర పడిన జనసేన సారథి పవన్ కల్యాణ్... ‘ఒంటరిని’ అంటూ విన్యాసాలు చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి! అభ్యర్థులు ఎవరైనా, పార్టీలు వేర్వేరైనా... ఈ అగ్ర నేతలపైనే అందరి కన్ను....
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ‘గేమ్ చేంజర్’గా ముద్ర పడిన జనసేన సారథి పవన్ కల్యాణ్... ‘ఒంటరిని’ అంటూ విన్యాసాలు చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి! అభ్యర్థులు ఎవరైనా, పార్టీలు వేర్వేరైనా... ఈ అగ్ర నేతలపైనే అందరి కన్ను! సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్య నేతగా ఎదిగిన వ్యక్తి చంద్రబాబు! సినిమా హీరోగా సుఖవంతమైన జీవితం గడిపే అవకాశమున్నా... సామాజిక స్పృహతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్! తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చి... సానుభూతి పవనాలు, వక్ర వ్యూహాలతో ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన జగన్! ఈ ముగ్గురి ప్రస్థానం ఎలా మొదలైంది? ఇప్పుడు ఎలా ఉంది? వారిపై జనానికి ఉన్న అభిప్రాయం ఏమిటి? ముగ్గురు నేతల వ్యక్తిత్వం, విధానాలపై విశ్లేషణ...
ఎదురీదుతూ ముందడుగు
ఎర్రటి ఎండ... చెమటతో తడిసిన చొక్కా! మనిషిలో ఎక్కడా కనిపించని అలసట! ఉరుముతున్న స్వరం! రోజుకు మూడు సభల్లో అలుపూ సొలుపూ లేకుండా ప్రచారం! ఇది... ఏడు పదుల వయసులోనూ చంద్రబాబు స్థైర్యం, ధైర్యం, సహనం, సామర్థ్యం! అధికారంలో ఉంటే సంక్షేమం, అభివృద్ధికోసం ఆరాటం! విపక్షంలో ఉంటే... పోరాటం! రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇదే చంద్రబాబు రాజకీయ జీవితం. రాజకీయ వైకుంఠపాళిలో చాలా త్వరగా నిచ్చెన మెట్లు ఎక్కి ఉన్నత స్ధాయికి చేరిన ఆయన అదే సమయంలో ప్రతి అడుగులో అనేకానేక ప్రతిఘటనలు ఎదుర్కొని పోరాడుతూ ముందడుగు వేయాల్సి వచ్చింది.
తిరుపతికి సమీపంలో ఒక పల్లెటూరులో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకొంటూ ఎదిగారు. వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన ఆ విశ్వవిద్యాలయం ఎన్నికల్లో దిగ్గజాలను ఢీకొని పెద్ద పోరాటంతో తన బృందాన్ని గెలిపించుకొన్నారు. ఆ పోరాటమే ఆయనకు గుర్తింపును తెచ్చి పెట్టి 1978 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించేలా చేసింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరింత ఎదిగే ప్రయత్నంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి తన మనిషిని జడ్పీ చైర్మన్‌గా గెలిపించుకున్నారు.
ఆ పరిణామం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేవరకూ వెళ్లింది. అయినా నిలదొక్కుకొని ఆ తర్వాత కొంత కాలానికే మంత్రి కాగలిగారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదట సారే మంత్రి పదవి దక్కిన అతి కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు. మంత్రిగా సినిమాటోగ్రఫీ వంటి చిన్న శాఖ లభించినా.... దానివల్ల ఆ నాటి ప్రఖ్యాత హీరో ఎన్టీ రామారావుకు అల్లుడు కాగలిగారు. ఎన్టీఆర్ అల్లుడు అయినప్పటికీ ఆయన పార్టీ పెట్టిన సమయంలో చంద్రబాబు అందులో చేరలేదు. కాంగ్రెస్ నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది.
టీడీపీలో అనేక ఎత్తుపల్లాలు చూసి వాటిని అధిగమిస్తూ అక్కడ ముఖ్య నేత కాగలిగారు. లక్ష్మీ పార్వతి ప్రమేయంపై పార్టీలో, ఎన్టీఆర్ కుటుంబంలో తలెత్తిన తిరుగుబాటు పెద్ద సంక్షోభంగా మారి చివరకు ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ ప్రత్యర్థులు నిరంతరం దాడి చేసినా తన శ్రమ, మేధో శక్తితో నిలదొక్కుకొని పార్టీకి తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన హయాంలో టీడీపీ కొన్నిసార్లు గెలిచింది... కొన్నిసార్లు ఓటమిపాలైంది. అధికారంలో ఉన్నప్పుడు విశ్రాంతి లేకుండా పనిచేసిన ఆయన ప్రతిపక్షంలోకి వెళ్లినప్పుడు కూడా ఆ మరుసటి రోజు నుంచే పోరాటానికి నడుం బిగించి పార్టీ శ్రేణులను కదిలించారు. రాష్ట్ర విభజనకు ముందు రెండు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు.
దీంతో రెండు రాష్ట్రాల్లో పార్టీ పని అయిపోయినట్లేనని అనేక మంది అనుకొన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబుపై ఉన్న అభివృద్ధి ముద్ర మళ్లీ ఆ పార్టీని ఒక రాష్ట్రంలో అధికారంలోకి తేగలిగింది. తన రాజకీయ జీవితంలో ఎందరో రాజకీయ దిగ్గజాలను ఎదుర్కొన్న చంద్రబాబుకు జగన్ ముఖ్యమంత్రి కాగానే అనూహ్య అనుభవాలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష నేతగా ఏనాడూ చవిచూడని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్ సర్కారు అణచివేత, అరాచక విధానాల కారణంగా... అనేక మంది నాయకులు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యారు. తన రాజకీయ జీవితంలో అరెస్టు కావాల్సి వస్తుందని ఆయన ఏనాడూ ఊహించలేదు. జగన్ ప్రభుత్వం ఆయనపై పలు కేసులు మోపడానికి ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతున్నా.... అరెస్టు వరకూ రాదని ధైర్యంగా ఉన్నారు.
నంద్యాలలో ఆయన బస్సును పోలీసులు చుట్టుముట్టిన సమయంలో కూడా నోటీసు ఇచ్చి వెళ్లిపోతారన్న అభిప్రాయంలోనే ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. కానీ, ఆ అంచనాలకు భిన్నంగా అరెస్టు కావడమే కాకుండా చంద్రబాబు 53 రోజులపాటు జైలువాసం గడపాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి సమయంలో... అరెస్టయిన వ్యక్తిపై ఉన్న కేసులు, ఆరోపణలు, అభియోగాలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. కానీ.. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సాధించిన ఫలితాలను అంతా గుర్తు చేసుకున్నారు. ఆయన విడుదల కోసం పార్టీ శ్రేణులు నిరంతరం ఏవో కార్యక్రమాలు నడిపాయి.
ఆయన అరెస్టును నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా చంద్రబాబు జంకకుండా పోరాట స్ఫూర్తితో పార్టీని నడిపించారు. గతంలో మాదిరిగా టీడీపీ పోరాడగలుగుతుందా... జగన్‌ను తట్టుకోవడం సాధ్యపడుతుందా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పార్టీని సర్వసన్నద్ధంగా ఎన్నికల యుద్ధ రంగంలోకి నడిపించారు. విజయం తథ్యమనే విశ్వాసంతో ఉన్నారు.
పరిణతి చెందిన పవన్
‘పవన్ కల్యాణ్ రియల్ హీరో’.. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పదేపదే చెప్పిన మాట ఇది! అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం... ‘యువరాజ్యం’ సారథిగా పవన్ వ్యవహరించారు. ప్రసంగాల్లో ఆవేశం, ఆక్రోశం, కోపం, ఆవేదనతో తీవ్రస్థాయిలో విరుచుకుపడే వారు. ఆయన ప్రసంగాలు ప్రజల్ని, ముఖ్యంగా యువతను ఆకట్టుకున్నాయి. కానీ... బూత్‌ల్లో ఓట్లుగా మారలేదు.
ఆయన ప్రమేయం లేకుండానే 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రె్‌సలో విలీనమైంది. అప్పటి నుంచి పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తగిన సమయం కోసం వేచి చూసి... రాష్ట్ర విభజన అనంతరం 2014 మార్చి నెలలో జనసేన పార్టీని స్థాపించారు. ‘కాంగ్రెస్ హటావో... దేశ్‌కో బచావో’ అని ఆయన ఇచ్చిన నినాదం అప్పట్లో సంచలనం సృష్టించింది. కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో... తెలుగుదేశం, బీజేపీకి ఆయన మద్దతు పలికారు.
ప్రత్యేక హోదా అంశంపై పోరాడుతూ... 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసినప్పటికీ, ఆయనకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. రెండుచోట్ల పోటీ చేసినా ఆయనే గెలవలేకపోయారు. జగన్ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్‌పై జరిగిన వ్యక్తిగత దాడి అంతా ఇంతా కాదు! గ్రామ స్థాయి వైసీపీ నాయకుడి దగ్గర నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకూ వ్యక్తిగత దూషణలు చేశారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. ఎక్కడా వణకలేదు... బెణకలేదు.
మరోవైపు... రాష్ట్రంలో అరాచకం, దౌర్జన్యాలు, అభివృద్ధి లేమి పవన్‌ను కదిలించాయి. జనసేన సొంతంగా పోటీ చేయడంవల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మరోసారి లబ్ధి చేకూరకూడదని నిర్ణయించుకున్నారు. పూర్తిస్థాయి రాజకీయ పరిణతితో ఆలోచించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో తెలుగుదేశంతో పొత్తు గురించి ప్రకటించారు. బీజేపీనీ కూటమిలోకి కలిసి వచ్చేలా చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా... సీట్ల పంపిణీలో ఆచరణాత్మకంగా వ్యవహరించారు. ‘వైసీపీ ఓటు చీలనివ్వను’ అనే మాట కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గారు.
ఇందుకు పార్టీ శ్రేణులను మొదటి నుంచే మానసికంగా సిద్ధం చేశారు. నేతలకు నచ్చజెప్పారు. పూర్తిస్థాయిలో ఓట్ల బదిలీ జరిగేలా అడుగులు వేశారు. పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురంలో అభ్యర్థిగా నిలబడ్డారు. తన ప్రసంగాల్లో ఆవేశం పాలును తగ్గించి... జనాన్ని ఆలోచింపచేసేలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ ప్రసంగాలను యువతతోపాటు పెద్దలూ సాలోచనగా వింటున్నారు. ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అన్న ప్రకటన నుంచి కూటమి ఏర్పాటు వరకూ పవన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికీ జగనే కారణమని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో పవన్ ‘గేమ్ చేంజర్’గా మారారు.
అహం.. విశ్వరూపం!
చిన్న వయసులోనే వచ్చిన అధికారం! నిజానికి... అది అతి కొద్దిమందికి మాత్రమే లభించే అద్భుతమైన అవకాశం! కానీ... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘అహం’తో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. తన పాలనను అరాచకం, అవినీతి, అభివృద్ధి లేమికి ప్రతీకగా మిగిల్చి ప్రజలకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయారు. వైఎస్ కుమారుడిగా తెరపైకి వచ్చి, తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పీఠంకోసం ఆరాటపడి... అది దక్కకపోవడంతో కాంగ్రె్‌సను వీడి సొంత పార్టీ పెట్టుకున్నారు.
వైఎ్‌సకు ఉన్న క్రేజ్ వల్ల కావొచ్చు... తొలుత జగన్ ప్రజల్లో విపరీతమైన ఆదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో వెల్లువెత్తిన సానుభూతి జగన్‌కు పెట్టని కోటలా నిలిచింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో... 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ‘వక్ర వ్యూహాల’ను ఎంచుకున్నారు. ‘యుద్ధంలో గెలవాలంతే!
దానికోసం ఎంత అధర్మానికి పాల్పడినా ఫర్వాలేదు’ అనే సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి వర్గాన్ని నమ్మించేలా హామీలు ఇచ్చారు. అటు చంద్రబాబు ప్రభుత్వంపై ఐదేళ్లూ అబద్ధాలు, అర్ధసత్యాలతో దాడి చేశారు.
దీని ఫలితమే... గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లలో వైసీపీ విజయం. పార్టీ లోపలా... బయటా తిరుగేలేని రీతిలో వచ్చిన సీట్లు, ఓట్లు జగన్మోహన్ రెడ్డి తీరును పూర్తిగా మార్చేశాయి. ఆయనలో అహం విశ్వరూప ప్రదర్శన స్ధాయికి ఎదిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినా ఆయన అనుమతిస్తే తప్ప దరిదాపుల్లోకి వెళ్లగలిగే పరిస్ధితులు లేకుండా పోయాయి. సాధారణ ప్రజలకు ముఖ్యమంత్రి దర్శనమే దుర్లభం అయింది.
ఆయన సచివాలయానికి రారు. అధికారిక నివాసంలోకి ఎవరికీ ప్రవేశం లేదు. ఆయన పిలిపించిన వారికి మాత్రమే రాజకోటలోకి ప్రవేశం. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరదాలు, బ్యారికేడ్ల మధ్య ప్రయాణం చేసే ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకెక్కారు. ఆయన క్యాబినెట్ సమావేశానికి సచివాలయానికి వెళ్లాల్సి వస్తే... రాజధాని గ్రామాల్లో ఇంటికో పోలీసును నిలబెట్టారు. గతంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా పాలనపై తనదైన ముద్ర వేయాలని తాపత్రయపడేవారు.
కానీ, జగన్ దానికి పూర్తి భిన్నమైన వ్యవహారం నడిపారు. బటన్ నొక్కడం పేరుతో సంక్షేమ పథకాల కోసం నిధులు విడుదల చేయడం మినహా ఈ ఐదేళ్లలో ఆయన మరేం చేశారంటే సమాధానం దొరకని పరిస్థితి తెచ్చారు. టీడీపీ హయాంలో ఒప్పందాలు జరిగి, స్థలాలు కేటాయింపు జరిగిన పరిశ్రమలనూ బెదరగొట్టారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు.
టీడీపీ మొదలుపెట్టిన, ఒక కొలిక్కి తెచ్చిన పనులను, ప్రాజెక్టులను జగన్ కొనసాగించి ఉంటే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆయన రాజకీయ ప్రతీకారేచ్ఛకు రాష్ట్రం బలైపోయింది. అంబానీలకు ఒక రాజ్యసభ పదవి, అదానీలకు రాష్ట్రంలో పోర్టులు సమర్పించడం మినహా రాష్ట్రానికి వారి నుంచి ఒక్క కొత్త పెట్టుబడి సాధించలేకపోయారు.
పెద్ద పరిశ్రమలతో ఉద్యోగాలు రావని, ఫిష్ మార్ట్ వంటి వాటితో స్వయం ఉపాధిని చూపించాలని తాజాగా చేసిన సూత్రీకరణ జగన్ ఆలోచనా ధోరణికి అద్దం పట్టింది. పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని ప్రత్యర్థులను అణిచివేసే ప్రక్రియ... చివరికి ప్రజలనూ బాధితులను చేసింది. డాక్టర్ సుధాకర్, పదో తరగతి బాలిక మిస్బా వంటి వారి మరణాలు, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, దళిత డ్రైవర్ మృతదేహం డోర్ డెలివరీ... ఇలాంటి ఎన్ని ఘోరాలు జరిగినా జగన్‌లో ఏ స్పందనా కనిపించలేదు.
తనను చూసి అందరూ భయపడాలన్న ఆయన ఆలోచనా ధోరణికి ఇది అద్దం పడుతోందన్న వ్యాఖ్యలు వచ్చినా జగన్ పట్టించుకోలేదు. అవినీతి విషయంలో కూడా ఆయన లెక్కలేనితనాన్ని ప్రదర్శించారు. ఇసుక, మద్యం వంటి వాటి విషయాల్లో అవినీతిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన నుంచి... లేదా ఆయన బృందం నుంచి ఏ ప్రతిస్పందనా ఉండేది కాదు. పాలన మొత్తం తానొక భీకర నియంత అన్న అభిప్రాయం కలిగించడానికే ప్రయత్నించిన జగన్... ఎన్నికల వేళ వచ్చేసరికి భీరువులా మాట్లాడుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేయడం విశేషం!
- అమరావతి, ఆంధ్రజ్యోతి
ఓటు వేయకుంటే..!
ఆ.. నా ఒక్క ఓటు వేయకపోతే ఏంటిలే.. అని బద్ధకించి ఇంటి నుంచి కదలని ఓటర్లపై ఆగ్రహంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది.
‘ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటేయండి.
లేదా రాష్ట్రం వదిలిపోండి.
అదీ కుదరకుంటే చచ్చిపోండి’
అంటూ తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.
పోలింగ్ సైన్యం కదిలింది
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం. ఓట్లు వేసే జనమే కాదు.. వారితో ఓట్లు వేయించే సిబ్బందీ ఈ యజ్ఞంలో కీలకమే. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని తీసుకుని.. పోలింగ్ కేంద్రాలకు బయలుదేరిన ఎన్నికల సైన్యమిది.
ఓటు కోసం పోదాం.. పద!
విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఏపీ జనమంతా ఓటు వేసేందుకు స్వగ్రామాలకు బయలుదేరారు. ఓట్ల జాతరకు వీరంతా ఒక్కసారిగా బయలుదేరడంతో రైళ్లు, బస్సులు ఏమీ ఖాళీలేవు. విజయవాడ స్టేషన్‌లో.. అనంతపురం బస్టాండులో కిక్కిరిసిన జనంతో ఇలా రైలు.. బస్సు!
నడి సంద్రంలో ఓట్ల వేట!
కాకినాడకు 12 కిలోమీటర్ల దూరంలో.. సముద్రంలో ఉండే హోప్ ఐలాండ్‌కు ఆదివారం ఎన్నికల సిబ్బంది బోటులో బయలుదేరి వెళ్లారు. 1823 మంది ఓటర్లు ఉన్న ఈ దీవికి బోటులో వెళ్లేందుకు సుమారు రెండు గంటలు పడుతుంది.
ఓటేద్దాం పదండి..
‘వినదగు నెవ్వరు జెప్పిన’ అంటూ ఎవరేం చెప్పినా వింటూనే ఉన్నాం! మైకం కమ్మేలా మైకుల్లో హోరెత్తిస్తే తలలూపాం! మేనిఫెస్టోల హామీల వర్షంలో తడిసి ముద్దయ్యాం. విభజన తర్వాత తొలి ఐదేళ్ల టీడీపీ పాలన చూశాం. ఆ తర్వాత ‘ఒక్క చాన్స్’ అంటూ వచ్చిన వారి పరిపాలననూ చూశాం! అన్నీ బేరీజు వేసుకుని... మన తీర్పు చెప్పే రోజు వచ్చేసింది. మన రాష్ట్ర గతినీ, మన తలరాతనూ, మన పిల్లల భవిష్యత్తునూ నిర్ణయించే ఓటుకు వేళయింది! ఇంటి నుంచి కదలండి! ఓటుకు పోటెత్తండి!