వైసీపీ వేధింపులకు టీడీపీ కార్యకర్త బలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 04:22 AM
బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ వేధింపులకు టీడీపీ కార్యకర్త బలయ్యాడు. ఊరి పెద్దల ముసుగులో వైసీపీ నేతలు.... గ్రామం నుంచి వెలివేయడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చీరాలలో వినాయకచవితిరోజు ఘర్షణపడిన వైసీపీ మూక
దీనిపై కేసు పెట్టాడని గ్రామం నుంచి బహిష్కరణ
ఆయన నడిపే చిల్లర కొట్టుకు ఎవరూ పోకుండా కట్టడి
మనస్తాపంతోఉరివేసుకున్న టీడీపీ కార్యకర్త
చీరాలటౌన్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ వేధింపులకు టీడీపీ కార్యకర్త బలయ్యాడు. ఊరి పెద్దల ముసుగులో వైసీపీ నేతలు.... గ్రామం నుంచి వెలివేయడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చీరాల మండలం పరిధిలోని కావూరివారిపాలెంలో టీడీపీ కార్యకర్త కోట వెంకటేశ్వరరెడ్డి (బుజ్జిరెడ్డి)కి చిల్లర కొట్టు ఉంది. వినాయకచవితి వేడుకల సమయంలో వైసీపీ కార్యకర్తలు కుంచాల వెంకటేశ్వరరెడ్డి (పొట్టయ్య), కావూరి శ్రీనివాసరెడ్డి (ఎర్రోడు), మంచాల పండు అంకిరెడ్డి (చిన్నా)కి... వెంకటేశ్వరరెడ్డి (బుజ్జిరెడ్డి)కి మధ్య వివాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో వైసీపీ మూకలు...బుజ్జిరెడ్డిపై దాడి చేసి కొట్టారు. దీనిపై బుజ్జిరెడ్డి ఈపూరుపాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో కొద్దిరోజులు పోలీస్ పికెట్ కూడా నిర్వహించారు. బుజ్జిరెడ్డిపై కక్ష పెంచుకున్న వైసీపీ కార్యకర్తలు.... ఆయన చిల్లర కొట్టుకు ఎవరు వెళ్లినా, ఆ కుటుంబంతో మాట్లాడినా రూ.లక్ష జరిమానా విధిస్తామని ప్రకటించారు. దీంతో బుజ్జిరెడ్డికి గ్రామస్థులందరూ దూరంగా ఉంటూ వచ్చారు. కొట్టు సాగక తీసుకున్న రుణాలకు బ్యాంక్ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో బుజ్జిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈనెల 1న ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌ను కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ బాధలో అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఇంటి ముందు ఉన్న పందిరిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.