Share News

Kadapa : జేసీ వర్సెస్‌ ఆది

ABN , Publish Date - Nov 27 , 2024 | 04:20 AM

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

Kadapa : జేసీ వర్సెస్‌ ఆది

ఫ్లైయాష్‌ రవాణాపై పంతం

కడప నుంచి తాడిపత్రిలోని సిమెంటు ఫ్యాక్టరీకి తరలింపు

తామే రవాణా చేస్తామన్న జేసీ

అడ్డుకుంటామన్న ఎమ్మెల్యే వర్గం

ఆర్టీపీపీ వద్ద రోజంతా ఉద్రిక్తత

భారీగా మోహరించిన పోలీసులు

కడప, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గవద్ద ఉన్న ఎల్‌అండ్‌టీ సిమెంట్‌ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్‌ రవాణా చేసే విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో ఆర్టీపీపీ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జమ్మలమడుగు డీఎస్పీ వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆర్టీపీపీ ఉద్యోగులు, కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా, ఫ్లైయాష్‌ రవాణా విషయంలో జీసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య సమస్యలున్నాయని జమ్మలమడుగు డీఎస్పీ వేంకటేశ్వర్లు తెలిపారు.

  • అసలు ఏం జరిగింది?

ఆర్‌టీపీపీ నుంచి వెలువడే బూడిదను సిమెంటు పరిశ్రమలో ఉపయోగిస్తారు. దీన్ని సమీపంలోని తాడిపత్రికి తీసుకెళుతుంటారు. జగన్‌ హయంలో ఈ వ్యవహారాన్ని వైసీపీ నేతలే చూసుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జేసీ ప్రభాకర్‌రెడ్డి వాహనాలు ఫ్లైయాష్‌ రవాణా చేస్తున్నాయి. అయితే, ఈసారి ఆదినారాయణరెడ్డి కుటుంబం ఆర్టీపీపీ నుంచి తాడిపత్రికి తమ వాహనాల్లోనే ఫ్లైయా్‌షను తరలించాలని పట్టుబడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేశ్‌రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. కానీ, ఈ ప్రతిపాదనకు జేసీ అంగీకరించడం లేదు. దీనిపై ఇరు వర్గాల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. అటు జేసీ, ఇటు ఆది వర్గాలు ఎక్కడా తగ్గలేదు. ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం జేసీ అనుచరులు, టిప్పర్లు, ప్రొక్లైనర్లతో ఆర్టీపీపీ వద్దకు వస్తారని సమాచారం రావడంతో.. వారిని అడ్డుకునేందుకు ఆది వర్గీయులు కూడా సిద్ధం కావడం వివాదానికి దారితీసింది.


  • మేం సైలెంట్‌ కాదు!

  • కడప ఎస్పీకి జేసీ లేఖ

ఫ్లైయాష్‌ రవాణా వ్యవహారంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి కడప ఎస్పీకి మంగళవారం లేఖ రాశారు. ‘‘అక్టోబరు 15 నుంచి ఆర్టీపీపీ వద్ద చెరువు నుంచి బూడిదను లోడ్‌ చేయనివ్వకుండా మా వాహనాలను ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేశ్‌రెడ్డి నిషేధించారు. ఈ విషయమై కడప ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఈ నెల 23న కడప నుంచి వస్తున్న అన్ని సిమెంటు, ఇసుక లారీలు నిలిపివేశాం. ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించాం. మా వాహనాలను మంగళవారం నుంచి లోడింగ్‌కు అనుమతిస్తామని తాడిపత్రి పోలీసులు హామీ ఇచ్చారు. కానీ, ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మా వాహనాలు ఆర్టీపీపీలో లోడింగ్‌ అవుతాయి. ఈసారి మా వాహనాలు ఆపితే తేలిగ్గా తీసుకోం. వారు దౌర్జన్యం చేస్తే సైలెంట్‌గా ఉండే రక్తం మాది కాదు. నా ప్రతిష్టకు భంగం కలిగిస్తే దేనికైనా సిద్ధమే’’ అని అందులో పర్కొన్నారు. ఈ విషయమై కడప ఇన్‌చార్జి ఎస్పీ విద్యాసాగర్‌నాయుడిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, జేసీ రాసిన లేఖ అందిందని, అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

Updated Date - Nov 27 , 2024 | 04:21 AM