Online Registration : రేపు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
ABN , Publish Date - Dec 17 , 2024 | 04:39 AM
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల...
తిరుమల, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల మార్చి నెల లక్కీడిప్ కోటాను టీటీడీ బుధవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్ ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవీవో.ఇన్’ ద్వారా విడుదల చేయనుంది. ఈసేవా టికెట్ల రిజిస్ర్టేషన్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈటికెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లిస్తే లక్కీడిప్ ద్వారా టికెట్లు మంజురు చేస్తారు. అలాగే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఇక, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌సేవలు కూడా అందుబాటులో ఉంచనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు టోకెన్లను జారీ చేస్తారు. 24వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
30 నుంచి అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 23వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ఈసందర్భంగా స్వామి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను వైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. కాగా, తిరుమల మొదటి, రెండవ ఘాట్‌లో ద్విచక్రవాహనాల అనుమతి సమయాన్ని విజిలెన్స్ అధికారులు పెంచారు. ఉదయం 5నుంచి రాత్రి 9.30 గంటల వరకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.