Share News

TirumalaTirupati : గోవిందా..గోవిందా!

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:04 AM

రాష్ట్రంలో జగన్‌ పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఐఏఎస్‌ కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించారు. ఆయన దుందుడుకు నిర్ణయాల తో సాధారణ భక్తులకు వెంకన్న దర్శనం దుర్లభంగా మారింది. ఇదేసమయంలో సంపన్నులకు పెద్దపీట వేశారు.

TirumalaTirupati : గోవిందా..గోవిందా!

  • తిరుమల పవిత్రతపై వైసీపీ దెబ్బ

  • వ్యాపారమయంగా మార్చిన జగన్‌

  • ధర్మారెడ్డి హయాంలో రాజకీయ రచ్చ

  • లెక్కకుమించి సలహాదారుల నియామకం

  • ఇంజనీరింగ్‌ పనుల పేరిట కమీషన్లు

  • భక్తులకు ఇచ్చే గదుల ధరలు రెట్టింపు

  • తిరుమల పాలన ప్రక్షాళన ఎలా?

  • సీఎం చంద్రబాబుపై భక్తులకు కోటి ఆశలు

    తిరుమల పవిత్రతపై వైసీపీ దెబ్బ.. వ్యాపార మయంగా మార్చిన జగన్‌.. ధర్మారెడ్డి

    హయాంలో రాజకీయ రచ్చ

‘ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవుతుంది’ అని ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణం చేసిన వెంటనే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఆ ఒక్క మాటతో తిరుమలలో పెనుమార్పులు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. గత ఐదేళ్లుగా టీటీడీ కేంద్రంగా సాగిన అరాచక నిర్ణయాలు, అవినీతి, అవకతవకలను పునఃసమీక్షిస్తారని, ప్రక్షాళన చేస్తారని శ్రీవారి భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు.

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో జగన్‌ పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఐఏఎస్‌ కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించారు. ఆయన దుందుడుకు నిర్ణయాల తో సాధారణ భక్తులకు వెంకన్న దర్శనం దుర్లభంగా మారింది. ఇదేసమయంలో సంపన్నులకు పెద్దపీట వేశారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన నియంత తరహా పాలనలో మార్పు రాలేదు. జగన్‌ ప్రయోజనాలే పరమావధిగా ధర్మారెడ్డి వ్యవహరించారు. టీటీడీలో ఉద్యోగులకు, అర్చకులకు కనీస గౌరవం లేని వాతావరణాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ మునుపటి రోజులు వస్తాయనే నమ్మకం అందరిలో పెరుగుతోంది. జగన్‌ పాలనలో భ్రష్టుపట్టిన తిరుమల పాలనపై దృష్టిపెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వెంకన్న భక్తులు కోరుతున్నారు.

దర్శనాల వ్యాపారం

జగన్‌ పాలనలో శ్రీవారి దర్శనాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల హవా నడిచింది. గత చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేల నుంచి రోజుకో సిఫారసు లేఖనే అనుమతించేవారు. అప్పుడు కూడా ఆరుగురికే దర్శనం కల్పించేవారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యే లేఖలపై టికెట్లను రోజుకు ఆరు నుంచీ పదికి పెంచేశారు. స్వయంగా వెళితే 20నుంచి 30 టికెట్లు ఇచ్చారు. మంత్రులకైతే అసలు పరిమితి లేదు. మంత్రి స్వయంగా వెళితే 60 నుంచి 70 మందిని అనుమతించారు. ఇక బోర్డు సభ్యులకు రోజుకు 35 టికెట్లు ఇచ్చారు. పాలకమండలి చైర్మన్‌ కార్యాలయం నుంచి రోజుకు 500 నుంచి వెయ్యి టికెట్లు ఇచ్చారు. గతంలో రోజుకి బ్రేక్‌ దర్శన టికెట్లు 2వేలకు మించేవి కాదు. జగన్‌ పాలనలో 6వేలకు పెంచారు.


అడ్డగోలు నియామకాలు!

వైసీపీ హయాంలో టీటీడీలో అడ్డగోలు నియామకాలు జరిగాయి. కావలసినవారికి వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో కొలువులిచ్చారు. కొత్తగా సలహాదారులను నియమించుకునే సంప్రదాయానికీ తెరదీశారు. అకౌంట్స్‌ విభాగంలో నరసింహమూర్తి, ఇంజనీరింగ్‌లో కొండలరావు, రామచంద్రారెడ్డి సలహాదారులుగా ఉన్నారు. బర్డ్‌ ఆస్పత్రికి డాక్టర్‌ గురవారెడ్డిని సలహాదారుగా నియమించారు. విజిలెన్స్‌ విభాగంలోనూ ప్రభాకర్‌ అనే వ్యక్తిని సలహాదారుగా నియమించారు. సైబర్‌ ఎక్స్‌పర్ట్‌గా సందీప్‌ అనే వ్యక్తిని నియమించారు. ఆ తర్వాత ఏకంగా ఐటీ విభాగానికే ఆయనను జనరల్‌ మేనేజర్‌ చేసేశారు. కీలకమైన ఎస్టేట్‌ విభాగంలో రిటైరైన అధికారి మల్లిఖార్జున కొనసాగుతున్నారు. ఎస్వీబీసీలో గాయని మంగ్లీ, విజయ్‌కుమార్‌ సలహాదార్లుగా ఉన్నారు. వీరికి రూ. లక్షకు పైగా వేతనం, వాహనం, గదులు కేటాయించి టీటీడీ ఖజానాను గుల్ల చేశారు.

కమిషన్ల కోసం నిర్మాణాలకు నిధులు

టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగం చేపట్టే పనుల నాణ్యత మీద గతంలో ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాయకులకు 15శాతం కమీషన్‌ తప్పనిసరిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో నిర్మాణ పనులూ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. 2019 దాకా బడ్జెట్‌లో ఈ విభాగం వాటా రూ. 150కోట్లకు మించేది కాదు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏకంగా రూ.3వేల కోట్లకు పైగా నిధులను ఇంజనీరింగ్‌ పనులకు కేటాయించారు. తిరుపతిలో ఇటీవలే మరమ్మతులు చేసిన గోవిందరాజస్వామి సత్రాలను కూల్చేసి కొత్త భవనం నిర్మించాలంటూ ఆగమేఘాల మీద బోర్డులో తీర్మానం చేసి, రూ.600 కోట్లు కేటాయించారు. అదేవిధంగా స్విమ్స్‌ భవనాలు పటిష్ఠంగా ఉన్నప్పటికీ వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించేందుకు రూ.300 కోట్లు కేటాయించారు. శ్రీవారి ప్రసాదం లడ్డూ మొదలు, కాటేజీల దాకా అన్నింటి ధరలనూ పెంచేశారు. అలిపిరి టోల్‌గేటులో కారుకు రూ.15 ఉండగా రూ.50కి, మినీ లారీ, మినీబస్సులకు రూ.50 నుంచి రూ.వందకు పెంచారు. పాంచజన్యం, కౌస్తుభం సముదాయాల్లోని గదుల అద్దె రూ.500 ఉండగా వైసీపీ ప్రభుత్వం రూ.1000కి పెంచింది. స్పెషల్‌ టైప్‌ కాటేజీల అద్దెను రూ.750 నుంచి రూ.2200కు, కొన్ని కార్నర్‌ సూట్లు రూ.1500 నుంచి రూ.2800కు పెంచేశారు. టీటీడీ బోర్డు సమావేశంలోనే గదుల అద్దెలు పెంచిన వీడియో అప్పట్లో వైరల్‌ అయ్యింది.


పీఆర్వోల దుకాణాలు

కొందరు మంత్రులు, పాలకమండలి సభ్యులు దర్శనాల పేరిట కొండపై ఏకంగా దుకాణాలే తెరిచేశారు. టికెట్లను భారీ ఎత్తున అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దర్శనాలను వ్యాపారంగా మార్చుకున్నారు. తిరుమలలో ప్రైవేటు పీఆర్వోలు ఇబ్బడి ముబ్బడిగా అవతరించారు. ఎమ్మెల్యేలు, ఎం పీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, బోర్డు సభ్యులందరికీ పీఆర్వోలు ఉండి, దర్శన ఏర్పాట్లు చూసేవారు. దాతలు నిర్మించిన అతిథి గృహాలు ప్రైవేటు పీఆర్వోలకు, దళారీలకు కేంద్రాలుగా మారాయి.

లడ్డూల్లో కోత!

శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తీసుకునే లడ్డూ ప్రసాదంలోనూ వైసీపీ సర్కారు కోత పెట్టింది. ధర రెట్టింపు చేసింది. టీడీపీ పాలనలో బ్రేక్‌ దర్శన టికెట్‌పై 2 లడ్డూలు, ఏ ఆర్జిత సేవకు వెళ్లినా, రూ.300 టికెట్‌ తీసుకున్నా 2లడ్డూలు ఇచ్చేవారు. నడక భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందేది. సర్వదర్శన భక్తులకు రూ.10కి 2 లడ్డూలు, రూ.25 ధరతో రెండు లడ్డూలు ఇచ్చేవారు. వైసీపీ హయాంలో శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికీ ఒక ఉచిత లడ్డూ ఇస్తూ, అదనపు లడ్డూ ధరను రూ.25నుంచీ రూ.50కు పెంచారు. రూ.300, రూ.500 బ్రేక్‌ దర్శన టికెట్‌లతో సహా సుప్రభాతం, అర్చన, తోమాల, ఆర్జిత సేవల టికెట్లపై గతం లో ఇస్తున్న రెండు లడ్డూలలో ఒక లడ్డూ కోత విధించారు. రుచికి, శుచికి పేరొందిన శ్రీవారి అన్న ప్రాసాదం నాణ్యత కరువైందన్న ఫిర్యాదులు కూడా ఎక్కువగా వినిపించాయి.

Updated Date - Jun 16 , 2024 | 04:06 AM