Share News

YS Jagan: పీఎస్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:22 PM

గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కోవ్వు వాడినట్లు నిర్థారణ కావడంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌, గత టీటీడీ చైర్మన్‌తోపాటు పాలక మండలి సభ్యులపై హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు.

YS Jagan: పీఎస్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కోవ్వు వినియోగించినట్లు నిర్థారణ కావడంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు హైకోర్టు న్యాయవాదీ కె.కరుణ్ సాగర్ వెల్లడించారు. గత టీటీడీ పాలక మండలి చైర్మన్‌తోపాటు సభ్యులపై సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో న్యాయవాదీ కె.కరుణ్ సాగర్ మాట్లాడుతూ.. ఆ దేవదేవుడి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కోవ్వు వినిగియోగించినట్లు నివేదికలు స్పష్టం చేయడంతో తాను తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు.


ఇది ఒక విధంగా హిందువుల మనోభావాల మీద జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇది గత ప్రభుత్వ కుట్రలో ఒక భాగమన్నారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూ దైవత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. పవిత్రతోపాటు నాణ్యతలో తిరుమల లడ్డూ ప్రపంచ ప్రసిద్ధి పొందిందని కరుణ్ సాగర్ గుర్తు చేశారు.


తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని తాను అత్యంత గౌరవిస్తానని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం లేకుండా స్వామి వారి దర్శనం అసంపూర్తిగా ఉంటుందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో న్యాయవాది కరుణ్ సాగర్ పేర్కొన్నారు.


ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కోవ్వు వాడినట్లు ఎన్‌డీడీబీ నిర్ధారించడంతో హిందు సేన సమితి అధ్యక్షుడు సూర్జిత్ సింగ్ యాదవ్ స్పందించారు. ఈ అంశంపై శనివారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే అంశంపై విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు రామ్ సింగ్ సైతం స్పందించారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరిపాలన్నారు. అందులో ఎవరెవరి ప్రమేయం ఉందో వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

For More AndhraPradesh News And Telugu News..

Updated Date - Sep 22 , 2024 | 03:23 PM