Share News

Tirupati : వృద్ధురాలి గొంతుకోసి దారుణ హత్య

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:25 AM

గంజాయికి బానిసైన ఓ జులాయి.. వృద్ధ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆమె ఇద్దరు మనవరాళ్లపైనా ఇనుప రాడ్‌తో దాడి చేశాడు.

Tirupati : వృద్ధురాలి గొంతుకోసి దారుణ హత్య

  • ఇద్దరు మనవరాళ్లపై ఇనుప రాడ్‌తో దాడి

  • తిరుపతిలో గంజాయి బానిస ఘాతుకం

తిరుపతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గంజాయికి బానిసైన ఓ జులాయి.. వృద్ధ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆమె ఇద్దరు మనవరాళ్లపైనా ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో 14 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి నగరంలో గురువారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితుల ఎదురింట్లో ఉండే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు మూడేళ్లుగా మృతురాలి పెద్ద మనవరాలి వెంటపడి వేధిస్తున్నాడని, ఆమె అతని ప్రేమను తిరస్కరించింది.

వృద్ధురాలు కూడా పలుసార్లు మందలించింది. దీంతో ఆ యువకుడు కక్ష పెంచుకుని దారుణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తిరుపతికి చెందిన జయలక్ష్మి (67) కుటుంబానికి శానిటరీ మార్ట్‌ దుకాణం ఉంది. భర్త మూడేళ్ల కిందట మరణించగా కొడుకు శ్రీనివాస్‌, కోడలు రక్ష, మనవరాళ్లు ప్రేరణ (18), నియత (14)తో కలసి రాయల్‌నగర్‌లో నివాసముంటున్నారు. గురువారం సాయం త్రం కొడుకు శ్రీనివాస్‌ దుకాణంలో ఉండగా కోడలు రక్ష, పెద్ద మనవరాలు ప్రేరణ డ్రైవింగ్‌ క్లాసుకు వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు తొలుత సెకండ్‌ ఫ్లోర్‌లో జయలక్ష్మిని గొంతు కోసి హతమార్చాడు.

ఆ తర్వాత నియత తలపై ఇనుప రాడ్‌తో మోదాడు. అనంతరం కిందకి దిగుతుండగా జయలక్ష్మి కోడలు రక్ష, పెద్ద మనవరాలు ప్రేరణ ఎదురుపడ్డారు. దీంతో ప్రేరణపై కూడా ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. అనంతరం వారినుంచి స్కూటీ తాళాలు లాక్కుని దానిపైనే పరారయ్యాడు. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన నియత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అధికారులు, డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లు కూడా చేరుకుని దుండగుడి ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి.


ప్రేమను తిరస్కరించిందన్న కక్షతో..

పోలీసుల ప్రాథమిక విచారణలో దుండగుడిని గుర్తించినట్టు తెలిసింది. 30-35 ఏళ్ల వయసు ఉంటుందని, తలకు టోపీ, ముఖానికి మాస్కు ధరించాడని పారిపోతుండగా చూసిన స్థానికులు చెబుతున్నారు. బాధితుల ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉండే శ్రీనివాస్‌ గంజాయికి అలవాటుపడి జులాయిగా తిరుగుతుంటాడని, మూడేళ్లుగా జయలక్ష్మి పెద్ద మనవరాలు ప్రేరణ వెంటబడి వేధిస్తున్నాడని తెలిసింది.

నాయనమ్మ జయలక్ష్మి కూడా పలు సందర్భాల్లో ఆ యువకుడిని మందలించినట్టు సమాచారం. అయినా వేధింపులు ఆగకపోవడంతో ప్రేరణను ఢిల్లీలో ఉంచి చదివిస్తున్నారని తెలిసింది. ఇటీవలే బాలిక ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలను కూడా ఆ యువకుడు ధ్వంసం చేశాడు. హంతకుడి వివరాలు తెలియడంతో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Updated Date - Jul 19 , 2024 | 05:25 AM