Share News

వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:25 AM

ఎస్సీలు ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి పథంలో ఉంటారని, లేదంటే.. తిరిగి అంధకారంలోకి వెళ్లాల్సి వస్తుందని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మునిమనవడు రాజారత్నం అంబేడ్కర్‌ హెచ్చరించారు.

వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి

  • అంబేడ్కర్‌ మునిమనవడు రాజారత్నం అంబేడ్కర్‌

  • వర్గీకరణలో రాజకీయ కుట్రకోణం: హర్షకుమార్‌

నూజివీడు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఎస్సీలు ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి పథంలో ఉంటారని, లేదంటే.. తిరిగి అంధకారంలోకి వెళ్లాల్సి వస్తుందని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మునిమనవడు రాజారత్నం అంబేడ్కర్‌ హెచ్చరించారు. రాష్ట్రంలోని ఎస్సీలంతా వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం రాత్రి జరిగిన మాలల ఆత్మగౌరవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలు ఐక్యంగా ఉండి వర్గీకరణను ఎదుర్కోవాలన్నారు. హిందువులు ఐక్యంగా ముందుకు సాగాలని మహారాష్ట్రలో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. దళితులను విభజించాలని చూడటం మనువాదమే అవుతుందన్నారు. ఈ కుతంత్రాలను తెలుసుకుని ఎస్సీలందరూ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని రాజారత్నం పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై మోదీ, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత తేవాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ సవాల్‌ విసిరారు. ఎస్సీ వర్గీకరణలో రాజకీయ కుట్రకోణం దాగిఉందన్నారు. ‘ఎన్నికలకు ముందు మాదిగల విశ్వరూప మహాసభలో మోదీ వర్గీకరణ చేస్తామని చెప్పారు.


చంద్రబాబు మేనిఫెస్టోలో వర్గీకరణ అంశాన్ని పెట్టారు. సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో వాదనలు విని తీర్పును రిజర్వు చేసి ఆగస్టులో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఎలాఉంటుందో వీరికెలా తెలిసిందో చెప్పాలి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత రావాలంటే 341ఆర్టికల్‌ను పార్లమెంట్‌లో సవరించాలి. ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే కేబినెట్‌ హోదా కలిగిన ముగ్గురితో కమిటీ వేయాలి’ అన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 04:25 AM