Vijayawada Police Commissioner: వారికి విజయవాడ నగర సీపీ వార్నింగ్
ABN , Publish Date - Dec 29 , 2024 | 02:49 PM
నూతన సంవత్సర వేడుకల వేళ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర వాసులకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. నగరంలో అర్థరాత్రి వేళ.. యువత బైకులపై ఎలాంటి విన్యాసాలు చేయవద్దని ప్రజలకు సూచించారు.
విజయవాడ, డిసెంబర్ 29: ఈ ఏడాది ముగియనుంది. కొత్త ఏడాది ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని విజయవాడ వాసులను నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. ఆదివారం విజయవాడలో సీపీ రాజశేఖర్ బాబు విలేకర్లతో మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలు ఆమోదయోగ్యం, ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా హాని రహితంగా ఉండాలన్నారు. డిసెంబర్ 31వ తేది రాత్రి నిర్వహించుకొనే వేడుకల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించామన్నారు. ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
కొత్త సంవత్సరం సందర్భంగా అర్థరాత్రి వేళ.. రహదారులపై వేడుకలకు అనుమతి లేదని పేర్కొన్నారు. రాత్రి 11. 00 గంటల అనంతరం వాహనాలు జాత్రగ్తగా నడపాలని వాహనాదారులకు ఆయన సూచించారు. అతి వేగంగా, అజాగ్రత్తగా, మద్యం సేవించి వాహనాలు నడప వద్దని హితవు పలికారు.
అలాగే ట్రిపుల్ రైడింగ్ ఏట్టి పరిస్థితుల్లో చేయవద్దన్నారు. అదే విధంగా నగరంలోని ప్రధాన రహదారులు... బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బి.ఆర్.టి. ఎస్. రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు (కొత్త, పాత), కనక దుర్గా ఫ్లైఓవర్‌లపై ట్రాఫిక్ అనుమతించ బడదన్నారు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్లపై కేసులు కోసి అల్లర్లు చేయవద్దని ముఖ్యంగా యువతకు ఆయన సూచించారు.
అదే విధంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళల్లో రహదారిపై బిగ్గరగా కేకలు వేస్తూ.. వాహనాలపై తిరగ వద్దన్నారు. ఏడాది చివరి రోజు.. రాత్రి వేళ.. నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందన్నారు. మద్యం సేవించి.. అల్లర్లకు పాల్పడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనములు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోంటామని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసి భారీ శబ్దాలతో హోరేత్తించడం, అతి వేగంతో రోడ్లపై తిరగటం, వాహనములు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, బాణాసంచా పేల్చడం వంటి చర్యల వలన నగర ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందన్నారు. ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు , రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సూచనలు పాటించి నూతన సంవత్సర వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో జాగ్రత్తగా జరుపుకోవాలని.. అలాగే రోడ్డు ప్రమాదములకు లోను కాకుండా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజ్ఞప్తి చేశారు.
For AndhraPradesh News And Telugu News