Vijayawada : సాయం... ముమ్మరం!
ABN , Publish Date - Sep 06 , 2024 | 05:14 AM
ముంపులో మునిగి, బురద పేరుకుపోయి కష్టాల కడలిలా మారిన వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సర్కారు ముమ్మర చర్యలు తీసుకుంటోంది. సహాయ చర్యల్లో వేగం పుంజుకొంది.
సాధారణ పరిస్థితులు నెలకొల్పే చర్యలు
బాధితులకు పాలు, నీరు, ఆహార సరఫరా
104 అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలు
పారిశుధ్య యజ్ఞంలో పదివేల మంది కార్మికులు
బాధితులకోసం 179 ఉచిత బస్సులు
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
ముంపులో మునిగి, బురద పేరుకుపోయి కష్టాల కడలిలా మారిన వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సర్కారు ముమ్మర చర్యలు తీసుకుంటోంది. సహాయ చర్యల్లో వేగం పుంజుకొంది. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు... పెద్ద ఎత్తున దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహారం, పాలు, నీరు అందించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఆహార పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆహారం, తాగునీరు తీసుకొచ్చి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారికి మందులు అందించేందుకు ఇరవై ‘104’ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. మార్కెటింగ్ శాఖ మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కిలో రూ.2, 5, 10 కే వివిధ రకాల కూరగాయలను అందిస్తున్నారు.
పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 వేల మంది కార్మికులు పారిశుధ్య యజ్ఞంలో నిమగ్నమయ్యారు. మరోవైపు 25 డ్రోన్లతో బ్లీచింగ్ లిక్విడ్స్‌ను స్ర్పే చేయిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాుకు వివిధ మునిసిపాలిటీల నుంచి సుమారు వెయ్యి ట్యాంకర్లను తెప్పించారు. వీటి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో విజయవాడ నగర పాలక సంస్థ నీటి సరఫరాను పునరుద్ధరిస్తోంది. అయితే, ఆ నీటిని తాగవద్దని, ఇతరత్రా అవసరాలకు వాడుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలకు సూచించారు. బాధితుల నివాసాలు, రహదారులపై పేరుకుపోయిన బురద మేటను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేస్తున్నారు. సింగ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లే బాధితుల కోసం 179 ఆర్టీసీ బస్సులను ఉచితంగా తిప్పేలా ఏర్పాట్లు చేశారు.
ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ..
మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఆహారం, పాలు, తాగునీరు సరిగా అందుతుందో లేదో పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బాధితుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు అక్కడికక్కడే అధికారులకు సూచనలు చేస్తున్నారు. మునిసిపల్ మంత్రి నారాయణ గురువారం వరద నీటిలో సుమారు 2 కిలోమీటర్లు నడుస్తూ పరిస్థితిని సమీక్షించారు. మంత్రి సవిత... రాజరాజేశ్వరి పేటలో పర్యటించారు. విజయవాడ నార్త్ ఏసీపీ డి.రాజారాం, సత్యనారాయణపురం సీఐ బాబ్జీతో కలిసి లోతట్టు ప్రాంతాల్లోని బాధితులను తీసుకొచ్చేందుకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా... మంత్రి కూడా వారితో ట్రాక్టర్ ఎక్కారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వద్దకు తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు. మంత్రి పార్థసారథి కృష్ణలంకలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.
బెజవాడకు మళ్లీ వర్షం టెన్షన్
అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అల్ప పీడనం ప్రభావంతో మళ్లీ వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణుల నుంచి వస్తున్న హెచ్చరికలు విజయవాడను భయపెడుతున్నాయి. విజయవాడ నగరంలో వరద నీరు వేగంగా తగ్గిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూడు, నాలుగు అడుగుల ఎత్తున నిలబడి ఉంది. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఈ ప్రాంతాల్లో నీటి నిల్వ ఒక అడుగు పెరిగినట్లు గుర్తించారు. ఎగువన ఖమ్మం జిల్లాలో కూడా ఈ వర్షం భారీగా ఉంది. దీంతో మళ్లీ వరద వచ్చి విజయవాడను ఇబ్బంది పెడుతుందేమోనన్న ఆందోళన అధికార యంత్రాంగంలో కనిపిస్తోంది. అదే జరిగితే నిలువరించడానికి వీలుగా అప్రమత్తమై పనిచేస్తోంది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రాత్రి విజయవాడ చుట్టుపక్కల కుంభవృష్టి కురిసింది. ఖమ్మం జిల్లాలో వర్షం భారీగా ఉండటంతో బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం మొదలైంది.
కొంత దిగువన.. కొంత నదిలోకి..!
బుడమేరులోకి వచ్చిన వరద మళ్లీ విజయవాడ నగరంపై పడకుండా ఏం చేయాలన్నదానిపై అధికారులు దృష్టి సారించారు. కొంత నీటిని దిగువకు పంపిస్తూ మరికొంత నీటిని కృష్ణా నదిలోకి పంపాలన్నది ప్రభుత్వ వ్యూహం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌తో గురువారం కొందరు సీనియర్ అధికారులు సమావేశమై చర్చించారు. బుడమేరు వాగుకు గండ్లు పడినందునే వరద విజయవాడలోకి వచ్చి కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. ఇప్పుడు బుడమేరుకు మళ్లీ వరద వస్తే ఈ గండ్ల నుంచి తిరిగి నీరు విజయవాడలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. మొత్తం మూడు గండ్లలో రెండు పూడ్చివేశారు. మూడోది శుక్రవారం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈలోపే మళ్లీ ఎగువ నుంచి బుడమేరుకు వరద వస్తే ఎలా అన్నది అధికారులను కలవరపెడుతోంది.