Share News

విశాఖ ఉక్కుకు సాయం మరింత జాప్యం!

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:49 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. జీతాలు సైతం సగమే చెల్లిస్తు న్నారు. రోజుకు 21 వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాల్సిన ప్లాంటులో ఇప్పుడు 4వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదు.

విశాఖ ఉక్కుకు సాయం మరింత జాప్యం!

కేంద్రం ‘రివైవల్‌’ డిసెంబరులోనే

రూ.7,500 కోట్ల అప్పులను నిరర్థక ఆస్తులుగా ప్రకటించే అవకాశం

సెయిల్‌లో విలీనానికి సంఘాల పట్టు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. జీతాలు సైతం సగమే చెల్లిస్తు న్నారు. రోజుకు 21 వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాల్సిన ప్లాంటులో ఇప్పుడు 4వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదు. దీనివల్ల స్థిరవ్యయాలు భారంగా మారి ప్లాంటు నెత్తిన అప్పుల భారం పెరిగిపోతోంది. నిర్వహణ మూలధనం సమకూర్చాలని, ముడి పదార్థాలైన ఇరన్‌ ఓర్‌, కోకింగ్‌ కోల్‌ అందించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు చాలాకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నాయి.

లేదంటే సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విలీన ప్రక్రియను అమలు చేస్తే రెండు వారాల్లో రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌(బీఎఫ్‌) అందుబాటులోకి వచ్చి ఉత్పత్తి 14వేల టన్నులకు చేరుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకో నెల రోజుల్లో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు మరమ్మతులు పూర్తి చేసి దాన్నికూడా అందుబాటులోకి తీసుకురావచ్చునని అంటున్నారు. అలాచేస్తే డిసెంబరు నెలాఖరుకు రోజు వారీ ఉత్పత్తి 21వేల టన్నులకు చేరుతుందని, నెలవారీ అమ్మకాలు రూ.2,500 కోట్లు దాటుతాయంటున్నారు.


  • ఇవీ సానుకూలతలు

విశాఖ స్టీల్‌ప్లాంటును ఆనుకుని ఉన్న అదానీ గంగవరం పోర్టు ద్వారా సెయిల్‌ కోకింగ్‌ కోల్‌ను విదేశాల నుంచి తెప్పించుకుంటోంది. స్టీల్‌ప్లాంటు విలీనానికి ఆమోదం తెలిపితే కోకింగ్‌ కోల్‌ సమస్య తీరిపోతుంది. పక్క పోర్టులో ఉన్న సరుకును ఉపయో గించుకోవచ్చు. అలాగే ఎన్‌ఎండీసీ ద్వారానే సెయిల్‌ కూడా ఐరన్‌ ఓర్‌ తీసుకుంటోంది. అది కూడా విశాఖపట్నం మీదగానే వెళ్తున్నందున స్టీల్‌ప్లాంటుకు ఆ విషయంలోను సానుకూలత ఉంది. కాగా, కేంద్ర ఉక్కుశాఖ చేస్తున్న ప్రతిపాదనలు పరిశీలిస్తే.. సెయిల్‌లో విలీనం చేసే ఆలోచన లేదని అర్థమవ ుతోంది. స్టీల్‌ప్లాంటు తక్షణం ఊపిరి పీల్చుకునే విధంగా ఇప్పటికే రూ.500 కోట్లు గ్రాంటుగా సమకూర్చింది.

వీటిని చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని ఆదేశించింది. తర్వాత మరో 1,140 కోట్లు సమకూర్చింది. వీటిని ముడిసరకు సరఫరా దారులకు, తక్షణ చెల్లింపులకు వినియోగించాలని సూచించింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు 35వేల కోట్ల అప్పులు ఉన్నట్టు తేల్చింది. బ్యాంకులకు రూ.18వేల కోట్లు బకాయి ఉందని, దీనిలో ఎస్‌బీఐకే రూ.10,500కోట్లు ఇవ్వాల్సి ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో స్టీల్‌ప్లాంటు నిలదొక్కుకోవడానికి ఉక్కుశాఖ పునరుద్ధరణ ప్రణాళిక రూపొందించింది. దానిని డిసెంబరులో అమలు చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా అప్పుల్లో రూ.7,500 కోట్లను నిరర్థక ఆస్తులుగా పేర్కొని రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. ప్లాంటు నడపడానికి ముడిపదార్థాలు ఎలా సమకూరుస్తారనేది ప్రశ్నగా మారింది.

Updated Date - Oct 11 , 2024 | 05:49 AM