Share News

Visakhapatnam : వరదలతో విలవిల

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:17 AM

పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఇటువంటి విపత్తులు ఏటా రాష్ట్రంలో సంభవిస్తున్నాయి.

Visakhapatnam : వరదలతో విలవిల

  • 25 ఏళ్లుగా రాష్ట్రం అతలాకుతలం

  • దేశంలో తుఫాన్లు, రుతుపవన ద్రోణులతో ఎక్కువ దెబ్బతిన్న ప్రాంతం ఏపీనే

  • ఎన్‌ఆర్‌ఎస్‌సీ అధ్యయనంలో వెల్లడి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఇటువంటి విపత్తులు ఏటా రాష్ట్రంలో సంభవిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్లు, వాయుగుండాల ప్రభావంతో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం అవుతున్నారు. తుఫాన్లు/వాయుగుండాలతో దేశంలో ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రాల్లో ఏపీ నిలిచింది. వరదల విపత్తులతో నీట మునక, పంటనష్టం, ఇతరత్రా అతలాకుతలమైన రాష్ట్రాల్లో ఏపీ ఆరో స్థానంలో ఉంది.

దేశంలో విపత్తులపై 1996 నుంచి 2022 వరకు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) చేపట్టిన అధ్యయనం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏపీలో 7.92 లక్షల హెక్టార్లు నీట మునిగింది. రాష్ట్రంలో భూ విస్తీర్ణం 1.6 లక్షల హెక్టార్లు కాగా దాంట్లో 4.92 శాతం వరదల్లో చిక్కుకుంది. రాష్ట్రంలో వరదలకు ఎక్కువగా ప్రభావితమైనది నెల్లూరు జిల్లా కాగా ఆ తరువాత బాపట్ల. నెల్లూరులో 1,44,317 హెక్టార్లు, బాపట్లలో 1,11,637, తిరుపతి 83,151, ప్రకాశం 60,207, గుంటూరు 48,973, శ్రీకాకుళం 39,114, నంద్యాల 33,035, ఏలూరు 29,809, కృష్ణా29,582, పశ్చిమ గోదావరిలో 27,397, తూర్పు గోదావరిలో 21,322, కాకినాడ 18,983, అనకాపల్లి 17,631, అల్లూరి జిల్లా 16,661, పల్నాడు 12,630, ఎన్టీఆర్‌ జిల్లా 11,021 హెక్టార్లు వరదల్లో చిక్కుకున్నాయి. మిగిలిన జిల్లాలో 10వేల హెక్టార్ల కంటే తక్కువగా నీట మునిగింది. దేశంలో ఏటా వచ్చే వరదల్లో 30శాతం గోదావరి, కృష్ణా నదుల నుంచే వస్తున్నాయి.


  • తుఫాన్లతో ఉక్కిరిబిక్కిరి

రాష్ట్రంలో ప్రధానంగా తుఫాన్ల ప్రభావంతో ఎక్కువగా వరదలు సంభవిస్తున్నాయి. ఈ ప్రభావంతో 44శాతం భూభాగం దుర్భల పరిస్థితులను ఎదుర్కొంటోంది. తుఫాన్‌ వల్ల భారీగా దెబ్బతిన్న ప్రాంతంగా దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. 2010లో లైలా, 2012లో నీలం, 2014లో హుద్‌హుద్‌, 2018లో తితిలీ తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అంతకుముందు 1996లో తుఫాన్‌ కోనసీమను తీవ్రంగా దెబ్బతీసింది. తాజాగా ఆగస్టు 29న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో విజయవాడ నగరాన్ని వరద చుట్టుముట్టింది. ఈ విపత్తు నుంచి కోలుకోకుండానే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాలకు వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఏటా నదుల నుంచి వరదలు లేదా తుఫాన్‌ల ప్రభావంతో ఏపీ అతలాకుతలమవుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విపత్తులను ఎదుర్కొనేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించడం, నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేయడం, తీర ప్రాంతాల్లో మడ అడవులు, తాటి తోపులు, సరుగుడు వనాలు పెంపు వంటివి చేపట్టాలని సూచిస్తున్నారు.

Updated Date - Sep 13 , 2024 | 04:17 AM