Share News

Rain Alert: ఏపీలో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు..

ABN , Publish Date - Oct 15 , 2024 | 07:49 AM

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Rain Alert: ఏపీలో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు..

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) కొనసాగుతోందని, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ (Ronanki Kurmanath) తెలిపారు. తదుపరి రెండు రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుందని, దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని, పలుచోట్ల అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు.


మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశముందన్నారు. మిగత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవవచ్చని చెప్పారు. తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ అన్నారు.


కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారానికి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అల్పపీడనం బుధవారానికి తుఫాన్‌గా మారుతుందని... 17వ తేదీకల్లా మరింత బలపడి చెన్నైకు దక్షిణం వైపున తీరం దాటుతుందని, అనంతరం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ప్రవేశించాక బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే క్రమంలో ఈనెల 23న ఒమన్‌లో తీరం దాటుతుందని విశ్లేషించారు. మరో మోడల్‌ ప్రకారం... అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుంది. నంతరం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి 17న దక్షిణ కోస్తాలో తీరం దాటుతుంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఈనెల 16కల్లా వాయుగుండంగా బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి 17 దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని, ఆ సమయంలో గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. దీనికితోడు దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు రావడంతో ఆదివారం రాత్రి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, కోస్తాలో మిగిలినచోట్ల వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం వరకు కొడవలూరులో 110.25, ఇసకపల్లిలో 108.0, కావలిలో 104.25, బుచ్చిరెడ్డిపాలెంలో 97.25, దగదర్తిలో 92.75 మి.మీ. వర్షపాతం నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో లిక్కర్ సిండికేట్ బరితెగింపు..

రేపటికల్లా తుఫాన్‌..

లోన్‌ ఇప్పించి మరీ రూ.20 లక్షల సైబర్‌ దోపిడీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 15 , 2024 | 07:49 AM