Share News

Honey Trap Case: జాయ్ జమీమా దారుణాలపై నోరు విప్పిన బాధితులు

ABN , Publish Date - Oct 16 , 2024 | 10:24 AM

జాయ్ జమీమా తనతోపాటు నగ్నంగా ఉన్న ఫోటోలను చూపించి అతని నుంచి రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. తనకు విముక్తి కల్పించాలని బాధితుడు బ్రతిమలాడగా... రూ. మూడు కోట్లు డిమాండ్ చేసింది. బాధితుడు హైదరాబాద్ వెళ్ళిపోతాడనే అనుమానంతో ఏడు రోజులు గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది.

Honey Trap Case:  జాయ్ జమీమా దారుణాలపై నోరు విప్పిన బాధితులు

విశాఖ: హనీ ట్రాప్ కేసు (Honey Trap Case) కీలక సూత్రధారి జాయ్ జమీమా (joy jemima)పై ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు (Another Case) నమోదు అయింది. బాధితులు (Victims) ఫిర్యాదులు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు భీమిలి, కంచరపాలెంలో ఆమెపై కేసులు నమోదవగా.. ఇప్పుడు తాజాగా విశాఖ ఎయిర్ పోర్టు పీఎస్‌లో కేసుతో బాధితుల సంఖ్య మూడుకు చేరింది. జాయ్ జమీమా దారుణాలపై బాధితులు ఒక్కోక్కరుగా నోరు విప్పుతున్నారు. తన నుంచి సుమారు కోటి రూపాయలు వరకు దోచుకుందని ఓ బాధితుడు ఫిర్యాదులో వెల్లడించాడు.


విశాఖ మురళీనగర్‌లో ఓ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్‌గా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి (బాధితుడు) చేరాడు. కంపెనీ యజమాని రతన్ రాజు తన బంధువు అంటూ జాయ్ జమీమా అతనికి పరిచయం అయింది. ఆఫీసు టైమింగ్స్‌ను పగటి సమయం నుంచి రాత్రివేళలకు మార్చింపింది. అతనికి స్ప్రే, జ్యూస్‌లు ఇచ్చి నెమ్మదిగా తన ముగ్గులోకి దించింది. తనతోపాటు నగ్నంగా ఉన్న ఫోటోలను చూపించి అతని నుంచి రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. తనకు విముక్తి కల్పించాలని బ్రతిమలాడగా... రూ. మూడు కోట్లు డిమాండ్ చేసింది. బాధితుడి హైదరాబాద్ వెళ్ళిపోతాడనే అనుమానంతో ఏడు రోజులు గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది. బాధితుడి ఒంటిపై గాయాల ఫోటోలను అతని కుటుంబ సభ్యులకు పంపించి బ్లాక్ మెయిల్‌కు దిగింది. భీమిలిలో జాయ్ జమీమాపై కేసు నమోదు కావడంతో బాధితుడు బయటికు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాయ్ జమీమా అక్రమాలపై సహకరించిన వారందరిపై గట్టి నిఘా పెట్టారు.


కాగా హనీ ట్రాప్‌ వ్యవహారంలో బాధితుల జాబితా ఎక్కువగానే కనిపిస్తోంది. మాయలాడి జాయ్ జమీమా పెళ్లికాని యువకులతో పాటు వివాహితులను సయితం తన వలలో వేసుకుందని పోలీసుల విచారణలో బయటపడింది. ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుతో అరెస్టయి జైలుకు వెళ్లిన జమామీని భీమిలి పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. గురువారం ఆమెను విచారించారు. అయితే ఆమె ఎటువంటి సమాచారం చెప్పకపోగా తానే బాధితురాలినని, తననే అంతా మోసం చేశారని చెప్పింది. ఎంత ప్రశ్నించినా ఆమె అవే మాటలు తప్ప కొత్త సమాచారం చెప్పకపోవడంతో దసరా పండుగ ముగిసిన తరువాత మరోసారి ఆమెను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

ఇక్కడ అమ్మాయే...

ఈ మాయలేడి పేరు జాయ్‌ జమామీ (26). ఆ పేరు చూసి వేరే రాష్ట్రం నుంచో విశాఖపట్నం వచ్చిందని అంతా అనుకుంటారు. కానీ ఆమె ఇక్కడ మురళీనగర్‌లోనే ఉంటోంది. తెలుగు అమ్మాయే. తల్లిదండ్రులు లేరు. రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ఛాటింగ్స్‌ ద్వారా కుర్రాళ్లను ఆకర్షించేది. ఈ క్రమంలో కొందరు ఆమెతో జత కలిశారు. ధనవంతులను టార్గెట్‌ చేసి మోసం చేస్తే బాగా డబ్బులు వస్తాయని ప్లాన్‌ చేసుకొని దానిని అమలు చేసింది. ఆ క్రమంలో ఎన్‌ఆర్‌ఐకి ఈ ఏడాది ఆగస్టులో జమామీ ఇన్‌స్టాలో పరిచయం అయింది. సెప్టెంబరులో ఆయన్ను విశాఖపట్నం రప్పించి, విమానాశ్రయం నుంచే తన ఇంటికి తీసుకువెళ్లి మత్తు మందు ఇచ్చింది. నిద్ర పోతున్నప్పుడు తన పక్కన పడుకొని ఫొటోలు తీసుకుంది. వాటిని చూపించి అతడిని పెళ్లి చేసుకోవాలని బెదిరించింది. ఆ తరువాత తనను వదిలించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించింది. మోసం చేస్తున్నారని గ్రహించిన ఎన్‌ఆర్‌ఐ భీమిలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారిస్తున్నపుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో లోతుగా విచారణ చేశారు. మాయలాడి ఇంతకు ముందు ఇలాంటివి చాలా చేసిందని తేలింది. తాజాగా కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఆమెపై కేసు నమోదైంది. ఇంకో వ్యక్తి నేరుగా పోలీస్‌ కమిషనర్‌కే ఫోన్‌ చేసి తన పేరు బయటపెట్టనంటే ఆమె చేసిన మోసం చెబుతానన్నారు. ఇలా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.


ముఠా అంతా కలిసే...

జమామీ వెనుక ఒక ముఠా ఉన్నట్టు చెబుతున్నారు. ఆమె అందాన్ని ఎర వేసి డబ్బున్న వారిని ఉచ్చులోకి లాగారు. ఆ తరువాత వారికి డ్రగ్స్‌ ఇస్తున్నారు. వాటిని వాడటం వల్ల కొందరికి శరీరంపై పొక్కులు వచ్చి అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. దీనిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠా మనీ లాండరింగ్‌ వ్యవహారాలు కూడా నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జమామీ నుంచి కారు, లాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. లాప్‌టాప్‌లో ఫోన్‌ డేటా మొత్తం ఉంది. అందులో వివరాల ద్వారా బాధితులు, ఆమెతో సంబంధం ఉన్నవారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అలాగే ఆమె ఫోన్‌ పే ద్వారా జరిగిన లావాదేవీలను బట్టి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయి.. ఎవరికి వెళ్లాయి.. అనేది కూపీ తీస్తున్నారు. ముఠా సభ్యుల వివరాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. వారి కోసం వెదుకుతున్నారు. పెళ్లయిన బాధితులు తమ వివరాలు ఎక్కడ బయట పడతాయోనని భయపడుతున్నారు. ఈ కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆమె నేరుగా తన వలలో పడిన వారింటికి రాత్రి పూట వెళ్లి బెదిరించేదని సమాచారం. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు లభించాయి. ఈ వివరాలపై పోలీసులు ప్రశ్నిస్తే...తన వెనుక పెద్ద పెద్ద అధికారులు ఉన్నారని, మీరే ఇబ్బంది పడతారంటూ తిరిగి భయపెడుతుండడం గమనార్హం. తన కేసు లోతుగా తవ్వితే పెద్దలకే నష్టం అన్నట్టుగా ఆమె వ్యవహరిస్తుండడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బాధితులు కూడా పేర్లు బయట పెట్టబోమని చెబితేనే ఫిర్యాదు చేసేందుకు ముందుకువస్తామని చెప్పడం గమనార్హం. ఏమి చేసినా బయటకు చెప్పుకోలేని వారినే ఈ ముఠా తెలివిగా టార్గెట్‌ చేసిందని పోలీసులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం నేడు..

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..

రీల్‌ లైఫ్‌ ప్రేమికులు.. రియల్‌ లైఫ్‌ దంపతులు..

మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 16 , 2024 | 10:24 AM