Share News

YCP: విశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్ల సస్పెన్షన్..

ABN , Publish Date - Jan 18 , 2024 | 09:02 AM

విశాఖ: వైసీపీ కార్పొరేటర్స్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది.

YCP: విశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్ల సస్పెన్షన్..

విశాఖ: వైసీపీ కార్పొరేటర్స్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. విశాఖలోని 29వ వార్డు ఉరుకూటి నారాయణరావు, 31వ వార్డు బిపిన్ జైన్, 35వ వార్డు భాస్కర రావు, 37వ వార్డు జానకిరామ్ తదితరులను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. వారంతా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు.

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాలకవర్గంలో అలజడి మొదలైంది. అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. తాజాగా అదే నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు కూడా పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెట్టారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

మూడేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులను గెలుచుకోగా, టీడీపీ 30 వార్డులను గెలుచుకుంది. జనసేన మూడు, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్క వార్డు దక్కించుకున్నాయి. నాలుగుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో వైసీపీకి చెందిన 11వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని హరివెంకటకుమారిని మేయర్‌గా ఎంపిక చేశారు. దాదాపు మూడేళ్లపాటు జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ ఆధిపత్యానికి అడ్డేలేకుండా పోయింది. జీవీఎంసీకి, నగరవాసులకు ఎంత ఇబ్బంది కలిగించే అంశమైనప్పటికీ సంఖ్యాబలంతో ఏకగ్రీవంగా ఆమోదించుకుంటూ వచ్చారు. వైసీపీ కార్పొరేటర్లలో చాలామంది పార్టీ నేతల తీరు పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో బయటపెట్టకుండా వచ్చారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో కార్పొరేటర్లలో అసంతృప్తులు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. పార్టీలో ఇమడలేమంటూ టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఇండిపెండెంట్లుగా గెలిచి వైసీపీలో చేరిన ముగ్గురు కార్పొరేటర్లలో ఇద్దరు ఇటీవలే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. జనసేన పార్టీలో చేరిపోయారు.

తాజాగా దక్షిణ నియోజకవర్గానికే చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు కూడా పార్టీని వీడాలని దాదాపు నిర్ణయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మంది కార్పొరేటర్లు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ అనుచరులుగా కొనసాగుతున్నారు. సుధాకర్‌ ఇటీవలే పార్టీని వీడారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో 29వ వార్డు కార్పొరేటర్‌ ఉరుకూటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్‌ బిపిన్‌జైన్‌, 35వ వార్డు కార్పొరేటర్‌ విల్లూరి భాస్కరరావు, 37వ వార్డు కార్పొరేటర్‌ చెన్నా జానకిరామ్‌లు కూడా సుధాకర్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సుధాకర్‌తోపాటు నలుగురు కార్పొరేటర్లు దసపల్లా హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో వారు కూడా పార్టీని వీడిపోవడం ఖాయమని పార్టీ నేతలు నిర్ధారణకు వచ్చారు. వీరితోపాటు అదే నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు, ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ఒకరు, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఒకరు, గాజువాక నియోజకవర్గ పరిధిలోని నలుగురు కార్పొరేటర్లు కూడా పార్టీని వీడిపోవాలని భావిస్తున్నట్టు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. వీరంతా పార్టీని వీడిపోతే జీవీఎంసీ కౌన్సిల్‌లో తమ పార్టీ బలం తగ్గిపోతుందని పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే కౌన్సిల్‌లో పెట్టే అంశాలను ఆమోదించే పరిస్థితి ఉండదని భయపడుతున్నారు.

Updated Date - Jan 18 , 2024 | 09:02 AM