TDP: చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం?
ABN , Publish Date - Apr 15 , 2024 | 08:26 AM
విశాఖ: గాజువాక సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి సిఎం జగన్‌పై గులక రాయి దాడికి నిరసనగా.. చంద్రబాబుపై దాడి చేస్తామని వైసీపీ అభిమాని చక్రి ధర్మపురి ముందే చేసిన హెచ్చరిక వాట్సాప్ గ్రూపులో హల్ చల్ చేసింది.
విశాఖ: గాజువాక సభలో తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు (Nara Chandrababu)పై రాళ్ల దాడి (Stone Attack) వెనుక వైసీపీ హస్తం (YCP Hand) ఉన్నట్లు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి సిఎం జగన్ (CM Jagan)పై గులక రాయి దాడికి నిరసనగా.. చంద్రబాబుపై దాడి చేస్తామని వైసీపీ అభిమాని చక్రి ధర్మపురి ముందే హెచ్చరిక చేశారని, ‘గాజువాక సభలో నిన్ను కొట్టక పోతే ఒట్టు... ఎవరు కొట్టినా కూడా నాదే బాధ్యత అంటూ’ చేసిన మేసేజ్ ఆదివారం ఉదయం నుంచి గాజువాక వాట్సాప్ గ్రూపులో హల్ చల్ చేస్తోంది. దీంతో అప్రమత్తం ఆయిన టీడీపీ నేతలు, శ్రేణులు... ఇంటిలిజెన్స్, పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళారు. ముందే పోలీసులు అప్రమత్తమై ఉంటే..ఇటువంటి ఘటన జరిగేది కాదని టీడీపీ నేతలు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నం నగర పరిధిలోని పాతగాజువాక జంక్షన్‌లో జరిగిన సభలో పాల్గొన్న ఆయనపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి చంద్రబాబు ఉన్న వాహనం ముందున్న ఇనుప బారికేడ్‌కు తగిలి కింద పడిపోయింది. అయితే గట్టిగా శబ్దం రావడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. గాజువాక సభలో రాత్రి 7.17 గంటలకు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. ఏడెనిమిది నిమిషాలు తరువాత ఆయన మాట్లాడుతున్న వేదికకు తూర్పు వైపు నుంచి ఆగంతకులు రాయి విసిరారు. ఆ రాయి బార్‌కేడ్లకు తగిలి కింద పడి శబ్దం రావడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో పోలీసులు రాయి వచ్చిన దిశ వైపు పరుగులు పెడుతూ ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కొందరు సిబ్బంది పక్కనే ఉన్న గోడలు ఎక్కి గాలించినా ఎవరూ చిక్కలేదు. పోలీసులు పరుగు పెడుతున్న దిశను చూపిస్తూ గంజాయి బ్యాచ్, బేడ్ బ్యాచ్ ఇక్కడికి వచ్చినట్టుందని చంద్రబాబు అన్నారు. ఈ దశలో సభలో ఒక్కసారిగా కలకం రేగింది. కాగా, శనివారం విజయవాడలో సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆదివారం గాజువాకలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ స్వయంగా సభ ప్రాంగణం పక్కనున్న ఓ భారీ భవనం పైనుంచి పరిస్థితిని సమీక్షించారు. చుట్టూ పోలీసులు ఉన్నప్పటికీ ఆగంతకులు రాయి విసరడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.
ఈ రాళ్లు ఒక లెక్కా..: చంద్రబాబు..
రాళ్ల దాడి అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తనపై క్లెమోర్ మైన్స్‌తో దాడి జరిగితేనే భయపడలేదని, రాళ్ల దాడి చేస్తే భయపడతానా?... అంటూ విరుచుకుపడ్డారు. శనివారం రాత్రి సీఎం జగన్‌పై చీకట్లో గులక రాయితో దాడి చేశారని, తనపై వెలుగులోనే రాయి విసిరారని పేర్కొన్నారు. జగన్ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. గులకరాయి వేస్తే తాను ఖండించానని, పవన్‌పైన, తనపైనా దాడి జరిగితే ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. జగన్‌కు మాత్రమే రక్షణ, గౌరవం కావాలా?, మాకొద్దా? అని నిలదీశారు. సీఎంగా ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే తనపై విమర్శలు చేస్తున్నారని, బుద్ధి, జ్ఞానం ఉండాలన్నారు. తానే రాయి వేయించానంటూ, నరకాసురుడు అంటూ పేటీఎం బ్యాచ్ ప్లకార్డులు ప్రదర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సభలకు జనం రావడం లేదని, అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. జగన్‌పై ఎవరో గులకరాయి వేస్తే... తనపై రాళ్లు వేయిస్తారా..? అని ప్రశ్నించారు. జగన్‌పై రాళ్లు వేసి 24 గంటలు అయినా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, దీనిపై సీఎస్, ఇంటెలిజెన్స్, డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. పాలన చేతకాకుంటే తనకు బాధ్యతలు అప్పగించాలని, తన సత్తా ఏమిటో చూపిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘బాబాయ్‌ను నువ్వు చంపి... నాపై ఆరోపణలు చేసి ప్రజల సానుభూతి పొందాలనుకున్నావు... చెల్లెళ్లపై కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడివి నువు.’ అంటూ చంద్రబాబు ఆరోపించారు. గతంలో కోడికత్తితో డ్రామాలాడారని, ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే తాను వేయించానని చెబుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ బెదిరిస్తే మనం భయపడాలా? అని ప్రశ్నించారు. తిరగబడి, వెంటపడి కొట్టి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. ప్రశాంతమైన విశాఖలో పులివెందుల గొడ్డలి పంచాయితీలు పెట్టిస్తావా అని చంద్రబాబు నిలదీశారు.
వారాహి ర్యాలీపై రాయి?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి ర్యాలీలో ఆకతాయి రాయి విసిరాడని చితకబాది పోలీసులకు అప్పగించటం కలకలం రేపింది. ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి విజయభేరి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ దిగి వారాహి వాహనంపై బయలుదేరారు. మార్కెట్ యార్డ్ సమీపంలోకి రాగానే పవన్‌పైకి రాయి విసిరారని, అది ఆయనకు తగలకుండా పక్కకు పోయిందనే వార్త గుప్పుమంది. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షణగా ప్లాస్టిక్ పలకలను పట్టుకున్నారు. ఇది తెలిసిన జనసైనికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రాయి విసిరాడని ఓ యువకుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పొన్నూరు మండలం నుంచి వచ్చిన ఆ యువకుడు కొందరు యువతులపై పడటం, ఓ యువతి తండ్రి ప్రశ్నించటంతో ఆయన్ను కొట్టేందుకు ఆ యువకుడు చెప్పు తీశాడని, దానిని పవన్‌పైకి విసురుతున్నాడేమోనని అక్కడే ఉన్న అభిమానులు అతడిపై దాడి చేసి, తర్వాత తమకు అప్పగించారని పోలీసులు వివరించారు. ఎవరూ రాయి విసరలేదని తెలిపారు.