Share News

Chandrababu : సీమలో ప్రతి ఎకరాకు సాగు నీరు

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:53 AM

జూలైలోనే శ్రీశైలం రిజర్వాయర్‌ నిండడం ఇరవై ఏళ్లలో ఇదే ప్రథమం. మల్లన్న దయ వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

Chandrababu : సీమలో ప్రతి ఎకరాకు సాగు నీరు
CM Chandrababu

సిద్దేశ్వరం వద్ద రిజర్వాయర్‌ నిర్మిస్తాం

ఒక్క రోజులోనే 97% మందికి పెన్షన్లు

నేనే స్వయంగా వచ్చి ఇస్తున్నా: చంద్రబాబు


శ్రీశైలం/నంద్యాల/అనంతపురం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ‘జూలైలోనే శ్రీశైలం రిజర్వాయర్‌ నిండడం ఇరవై ఏళ్లలో ఇదే ప్రథమం. మల్లన్న దయ వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీరు మన సంపద. ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టి రాయలసీమలోని ప్రతి ఎకరాకూ నీరు అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీమ కరువును నివారించేందుకు సిద్దేశ్వరం వద్ద ఐకానిక్‌ హైవే బ్రిడ్జితో పాటు రిజర్వాయర్‌ నిర్మించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని ప్రకటించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తమదన్నారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ను తాను స్వయంగా ఇళ్లకు వచ్చి ఇస్తున్నానని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు బాధ్యతగా, జవాబుదారీగా ఉండాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. గురువారం ఆయన నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించారు. తొలుత శ్రీశైలం వెళ్లారు. భ్రమరాంబిక, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. తర్వాత శ్రీశైలం జలాశయానికి చేరుకుని.. కృష్ణా నదికి జలహారతి ఇచ్చి, కృష్ణమ్మకు సారెను నీటిలో వదిలి వాయనం సమర్పించారు. సుండిపెంటలో వాటర్‌ యూజర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ‘మన నీరు-మన సంపద’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు. మడకశిర నియోజకవర్గం గుండుమలలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. ఆ తర్వాత కరియమ్మ ఆలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జోరుగా వర్షం కురిసింది. దాదాపు 45 నిమిషాలు వర్షంలోనే ప్రసంగం కొనసాగించారు. ప్రజలు కూడా తడుస్తూనే ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..


తెలుగుదేశం హయాంలోనే..

ఏ పని చేసినా అందరికీ తెలిసేలా.. జవాబుదారీతనంతో పాలన సాగిస్తున్నాం. ఒక్క రోజులోనే 97 శాతం పింఛన్లను పంపిణీ చేశాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటి వద్దనే పింఛన్లు ఇచ్చాం. నేనే నేరుగా వచ్చి ఇస్తున్నా. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు ఈ ప్రభుత్వంలో బాధ్యతగా, జవాబుదారీగా ఉండాలనే దీనికి శ్రీకారం చుట్టా. పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టింది టీడీపీయే. అప్పట్లో ఎన్టీఆర్‌ రూ.35 నుంచి పింఛను ప్రారంభించారు. తర్వాత దానిని రూ.200 నుంచి రూ.1000కి, తర్వాత 2 వేలకు.. ప్రస్తుతం రూ.4 వేలకు పెంచిన ఘనత మాదే. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి బకాయిలతో కలిసి గత నెలలో ఒక్కో పింఛన్‌దారుడికి రూ.7 వేలిచ్చాం. వృద్ధులు, వితంతువులు, ఇతరత్రా లబ్ధిదారులకు రూ.4 వేలు.. వికలాంగులకు రూ.6 వేలు, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నాం. గత నెలలో రూ.4,408 కోట్లు పింఛను రూపంలో ఇచ్చాం. ఈ నెలలో రూ.2,737 కోట్లు ఇచ్చాం. ఏడాదికి రూ.33,500 కోట్లు ఇస్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం.


అందరికీ ఇళ్లు..

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తాం, కొత్తగా నిర్మించే ఇళ్లకు ఒక్కోదానికి రూ.4 లక్షలు ఇస్తాం. సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పెంచుతాం. ఆ ఆదాయాన్ని పేదలకు పంచుతాం. ఆడ బిడ్డలకు న్యాయం చేస్తాం. అన్న క్యాంటీన్లను ఈ నెల 15న పునఃప్రారంభిస్తాం. పేదవాడికి రూ.5కే భోజనం పెట్టే బాధ్యత మాది. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం. నా లక్ష్యం.. పేదరికం లేని దేశం.. పేదరికం లేని రాష్ట్రం.. పేదరికం లేని గ్రామం.


ఐదేళ్లలో 69,000 కోట్లు ఖర్చు చేశాం..

శ్రీశైల భ్రమరాంబ, మల్లన్న స్వామి వారిని దర్శించుకుని, శ్రీశైలం రిజర్వాయర్‌లో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి ఇచ్చా. 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జూలైలోనే నిండుకుండలా తొణికిసలాడుతున్న శ్రీశైలం రిజర్వాయర్‌ను చూస్తే ఆనందంగా ఉంది. 2014-19 మధ్య మా హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.69 వేల కోట్లు ఖర్చు పెట్టాం. దీనికి భిన్నంగా రాయలసీమలో రైతులకు డ్రిప్‌ పరికరాలు ఇవ్వని జగన్‌.. తన రోత పత్రికకు రూ.403 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము? పేదలకు ఇళ్లు కట్టించలేడు గానీ.. రూ.500 కోట్లతో విశాఖలోని రుషికొండలో ప్యాలెస్‌ కట్టాడు. శ్రీశైలం కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, రామానాయుడు, గొట్టిపాటి రవి, ఫరూక్‌, గుండమల సభలో మంత్రులు సత్యకుమార్‌, సవిత, ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు.


కుటుంబమంతా సంతోషంగా ఉంది

ఎన్టీఆర్‌ భరోసా పింఛను రూ.4 వేలకు పెంచడంతో మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. పేదలపై చంద్రబాబుకు ఉన్న ప్రేమతో పింఛనును రూ.4 వేలకు పెంచి మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఇతర పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతున్నాం. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉంటామన్న నమ్మకం ఏర్పడింది.

- ఓబుళమ్మ, గుండుమల, శ్రీసత్యసాయి జిల్లా


మీ రాకతో పండగొచ్చింది..

ముఖ్యమంత్రి స్వయంగా మా ఇంటికి వచ్చి పింఛను ఇవ్వడం జీవితంలో మరచిపోలేని సంఘటన. మీ రాకతో మా ఇంటికి పండగొచ్చింది. పింఛన్‌తో నా జీవనం సాఫీగా సాగుతుంది.

- పులమాసి రామన్న, గుండుమల, శ్రీసత్యసాయి జిల్లా

Updated Date - Aug 02 , 2024 | 08:17 AM