Simha Garjana : ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:54 AM
దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ను పెంచాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
కుల గణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలి
మాలల సింహగర్జనలో నేతల డిమాండ్
గుంటూరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ను పెంచాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ జాతీయ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు శివారులో నిర్వహించిన మాలల సింహగర్జన సభకు పలువురు హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మునిమనవడు యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ వర్గీకరణతో ఎస్సీల్లోని ఉపకులాలను విచ్ఛిన్నానికి ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు. జైభీమ్‌రావు భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన రాజీవ్‌మిశ్రా కమిషన్ రాజ్యాంగ విరుద్ధమైనదన్నారు.
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్ల ఏర్పాటు పేరుతో ఎస్సీల విచ్ఛిన్నానికి కుట్ర చేశారని మండిపడ్డారు. వర్గీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్త కుల జనగణన చేపట్టి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యేలు జి.వివేక్, నాగరాజు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, గుంటూరు జడ్పీ మాజీ చైర్‌పర్సన్ కూచిపూడి విజయ, మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన హాజరై సంఘీభావం తెలిపారు.