వైసీపీ పోటీ తుస్సు!
ABN , Publish Date - Nov 23 , 2024 | 05:24 AM
అసెంబ్లీలో బలం లేకున్నా శాసనసభ ప్రజా పద్దుల సంఘం(పీసీఏ)లో సభ్యత్వం కోసం నామినేషన్ వేసిన వైసీపీ.. తీరా పోలింగ్ ముందే చేతులెత్తేసింది.
బలం లేక పీఏసీ ఓటింగ్ బహిష్కరణ.. పెద్దిరెడ్డికి ఒక్క ఓటూ రాని వైనం
కూటమి అభ్యర్థుల సునాయాస ఎన్నిక
అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో బలం లేకున్నా శాసనసభ ప్రజా పద్దుల సంఘం(పీసీఏ)లో సభ్యత్వం కోసం నామినేషన్ వేసిన వైసీపీ.. తీరా పోలింగ్ ముందే చేతులెత్తేసింది. ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కూటమి అభ్యర్థులు సునాయాసంగా ఎన్నికయ్యారు. పీఏసీ సభ్యత్వానికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఉన్న 9 స్థానాలకు కూటమి అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయడంతో పోలింగ్ అనివార్యమైంది. 175 స్థానాల అసెంబ్లీలో వైసీపీకి 11మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పెద్దిరెడ్డి గెలవాలంటే 20 మంది ఓటేయాలి. ఆ అవకాశం లేకపోవడంతో తమకు విజయం బహుదూరమని వైసీపీ నాయకత్వం గుర్తించింది. శుక్రవారం మేలుకొని ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పెద్దిరెడ్డి శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి తమ పార్టీ నిర్ణయాన్ని మీడియా పాయింట్‌లో ప్రకటించారు. పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని, దీనికి నిరసనగా ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నిర్ణయంతో సంబంధం లేకుండా కూటమి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని పార్టీల నాయకత్వాలు నిర్ణయించాయి. మంత్రి లోకేశ్ దీనిని పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహా 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో 163మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి అమెరికా ఎంబసీలో వీసా ఇంటర్వ్యూ ఉండడంతో రాలేదని తెలిసింది. ఆ ఇంటర్వ్యూ వాయిదా వేసుకుని వస్తే బాగుండేదని, నూటికి నూరు శాతం ఓటింగ్ జరిగినట్లు అయ్యేదని టీడీపీ ఎమ్మెల్యేల వద్ద లోకేశ్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆయన శుక్రవారం జైపూర్‌లో రెండు పెళ్లిళ్లకు హాజరు కావలసి ఉంది. కానీ పీఏసీ పోలింగ్ దృష్ట్యా వెళ్లకుండా అసెంబ్లీలో ఉండిపోయారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పోలింగ్ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికను బహిష్కరించడంతో ఆ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డికి ఒక్క ఓటు కూడా రాలేదు. కాగా.. కూటమి ఎమ్మెల్యేల్లో ఒకరి ఓటు చెల్లలేదు. బ్యాలెట్ పత్రంపై నంబర్ వేయాల్సి ఉండగా ఆ ఎమ్మెల్యే టిక్కు కొట్టారు. దీంతో చెల్లకుండా పోయింది. టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య(జగ్గయ్యపేట), జయనాగేశ్వర్‌రెడ్డి (ఎమ్మిగనూరు), అరిమిల్లి రాధాకృష్ణ (తణుకు), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), బూర్ల రామాంజనేయులు (ప్రత్తిపాడు), నక్కా ఆనందబాబు (వేమూరు), కోళ్ల లలితకుమారి (ఎస్.కోట).. జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు (భీమవరం), బీజేపీ తరఫున విష్ణుకుమార్‌రాజు (విశాఖ ఉత్తరం) విజయం సాధించారు. వారి ఎన్నికను స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభాముఖంగా ప్రకటించారు. కాగా.. శాసనమండలి నుంచీ ముగ్గురు సభ్యులు పీఏసీకి ఎంపికయ్యారు. వీరిలో వైసీపీ నుంచి పి.రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, టీడీపీ తరఫున దువ్వారపు రామారావు ఉన్నారు.
పులపర్తి నిజాయితీపరుడు: సీఎం
పీఏసీ చైర్మన్‌గా ఎన్నిక కాబోతున్న జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబును కలిశారు. ఆయనను సీఎం అభినందించారు. పులపర్తి నిజాయితీ, అంకిత భావం కలిగిన వ్యక్తి అని.. అందుకే ఆయన్ను పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేశామని వ్యాఖ్యానించారు. తనకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
శాసనసభ నిరవధిక వాయిదా
శాసనసభను స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం స్పీకర్ సభలో సమితుల విజేతలను ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ 10 రోజులపాటు.. 59 గంటల 55 నిముషాలపాటు సమావేశాలు జరిగాయన్నారు. మంత్రులు 75ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతోపాటు 51 ప్రశ్నలకు సమాధానాలను సభ సమక్షంలో ఉంచారన్నారు. సీఎం, మంత్రులు సభలో 8 ప్రకటనలు చేశారని, 21 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, వాటిని సభ ఆమోదించిందన్నారు. 120 మంది సభ్యులు ప్రసంగించారని తెలిపారు. సభలో 2 లఘు చర్చలతోపాటు 3 తీర్మానాలను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. 344 నియమం కింద ఒక చర్చ, ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టిందన్నారు. విశాఖ డెయిరీ అవకతవకలపై ప్రత్యేక విచారణకు సభా సంఘాన్ని నియమించాలని సభ తీర్మానించిందని ప్రకటించారు. 3 ఆర్థిక సమితులకు జరిగిన ఎన్నికల్లో విజేతలను ప్రకటించారు.
ప్రజా పద్దుల కమిటీ: నక్కా ఆనందబాబు, రాధాకృష్ణ, అశోక్‌రెడ్డి, రామాంజనేయులు, జయనాగేశ్వరరెడ్డి, కోళ్ల లలితకుమారి, శ్రీరాం రాజగోపాల్, పులపర్తి రామాంజనేయులు, విష్ణుకుమార్‌రాజు
అంచనాల కమిటీ: అఖిలప్రియ, బండారు సత్యానందరావు, జయకృష్ణ, జోగేశ్వరరావు, కందుల నారాయణరెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, వాల్మీకి పార్థసారథి, సునీల్‌కుమార్, ఏలూరి సాంబశివరావు.
ప్రభుత్వరంగ సంస్థల కమిటీ: అయితాబత్తుల ఆనందరావు, ఈశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, కూన రవికుమార్, వర్ల కుమార్‌రాజు, రంగారావు, తెనాలి శ్రావణ్‌కుమార్, వసంత వెంకట కృష్ణప్రసాద్
ఆనవాయితీని తప్పుదారి పట్టించారు: పెద్దిరెడ్డి
అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు, అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ పోస్టు ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఆ ఆనవాయితీని కూటమి ప్రభుత్వం తప్పుదారి పట్టించింది’ అని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో 23 మందే ఉన్న టీడీపీకి ఆ పోస్టు ఇచ్చాం. కానీ కూటమి ప్రభుత్వం ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ‘పీఏసీ చైర్మన్ పోస్టును ప్రతిపక్షానికి ఇవ్వకుండా అధికారపక్షం అహంకారంతో వ్యవహరిస్తోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పీఏసీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది’ అని అన్నారు.
మహిళలకు మంత్రి సవిత క్షమాపణలు చెప్పాలి: వైసీపీ
జగన్ బటన్ నొక్కుడు డబ్బుతో మహిళలు గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటూ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. మహిళలకు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, సిపాయి సుబ్రహ్మణ్యం, బొమ్మి ఇజ్రాయల్ మాట్లాడుతూ... ‘బాధ్యత గల మంత్రిగా సవిత మహిళల్ని కించపర్చడం దుర్మార్గం. మంత్రి సత్యకుమార్ కూడా ముస్లిం మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. మంత్రుల వ్యాఖ్యల వెనుక కూటమి పెద్దలున్నారని భావిస్తున్నాం’ అని అన్నారు.
తొడ కొట్టడం కాదు.. పనులు చేయాలి: వెనిగండ్ల
తొడలు కొట్టడం, సవాళ్లు చేయడం కాదు.. అభివృద్ధి పనులు చేయడం ముఖ్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలకు మంచినీటి సరఫరాకు సంబంధించి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే 20ఏళ్ల దమ్ము ఏపాటిదో.. నియోజకవర్గంలో తాగునీటి సరఫరా చూస్తే అర్థమవుతుందని కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు. గత ఐదేళ్లూ మంచినీటి పథకాల ఫిల్డర్ బెడ్లు బాగు చేయకుండా మురికి నీరు సరఫరా చేశారని, విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు దృష్టికి తీసుకెళ్లగానే.. ఆయన బాగు చేయించారని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఆలయాల భూముల కబ్జాలన్నీ బయటకు తీస్తామని రాము అన్నారు.
బడి వేళలపై వింత నిర్ణయం: పీడీఎఫ్
రాష్ట్రంలో కొందరు నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని పీపీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలల పని వేళలు పెంచడం ఎందుకు? విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేలా వింత నిర్ణయం తీసుకోవడం ఏంటీ?’ అని మండిపడ్డారు.