Share News

AP: సుఫారీ ఇచ్చిన వైసీపీ కీలక నేత.. నలుగురు అరెస్ట్

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:53 AM

వైసీపీ కీలక నేత గౌతం రెడ్డి ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుఫారీ ఇచ్చిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అసలు గౌతమ్ రెడ్డి ఎందుకు సుఫారీ ఇచ్చారు? అసలేం జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం..

AP: సుఫారీ ఇచ్చిన వైసీపీ కీలక నేత.. నలుగురు అరెస్ట్
YCP Gautham Reddy

విజయవాడ: వైసీపీ కీలక నేత గౌతం రెడ్డి ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుఫారీ ఇచ్చిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. ఉమా మహేశ్వర శాస్త్రి అనే వ్యక్తి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నారు. తన తల్లి పేరు మీద ఉన్న స్థలాన్ని పూనూరు గౌతం రెడ్డి తప్పుడు పత్రాలతో కబ్జా చేసి రేకుల షెడ్‌ను నిర్మించాడని, ఈ విషయాన్ని 2017 సంవత్సరంలో తను అమెరికా నుండి వచ్చిన తరువాత గమనించి, సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దానిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఆ స్థలంలో అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించారని దాన్ని కూల్చివేయడానికి విజయవాడ మునిసిపల్ కమీషనర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. గౌతం రెడ్డి తయారు చేసిన ఫేక్ ఎస్సెస్మెంట్ నెంబర్లను రద్దు చేసి, తన అమ్మగారి పేరు మీద మునిసిపల్ టాక్స్ ఎస్సెస్మెంట్ కంటిన్యూ చేస్తూ టాక్స్ లను పే చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆ స్థలానికి గౌతం రెడ్డి తన భార్య పేరు మీద ఇచ్చిన బిల్డింగ్ ప్లాన్ ను కూడా మునిసిపల్ కమీషనర్ నిలుపుదల చేశారు. గౌతం రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా చట్టప్రకారం నడుచుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

చంపుతానంటూ బెదిరించి..

2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉండటం వలన గౌతం రెడ్డి ఫైబర్ నెట్ కార్పోరేషన్ చైర్మెన్ గా నియమించబడ్డారు. విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ లో వైసీపీ అధికారం లోకి రావడంతో గౌతం రెడ్డి ప్రభుత్వం అండతో 2023లో కబ్జా చేసిన స్థలంలో రెండు బిల్డింగ్ ప్లాన్లను తీసుకుని అక్రమ నిర్మాణం చేశారు. ఈ అక్రమాలను ఉమామహేశ్వర శాస్త్రి సోషల్ మీడియా తోపాటు హైకోర్టులో కూడా ఫిర్యాదు చేశారు. దీంతో 31.10.2024 రాత్రి 8 గంటల సమయంలో గౌతం రెడ్డి అనుచరులు ఇద్దరు తన ఇంటిలోనికి ప్రవేశించి ఒంటరిగా ఉన్న తనపై దౌర్జన్యం చేసి బయబ్రాంతులకు గురిచేశారని, 05.11.2024 తేదిన MBO యూట్యూబ్ ఛానెల్ ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని గౌతం రెడ్డి అరాచకాల గురించి వీడియో తయారు చేసి అప్లోడ్ చేశాడు. దీంతో 06.11.2024 తేదిన, 31.10.2024 తేదిన దౌర్జన్యం చేసిన ఇద్దరు వ్యక్తులు, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన ఇంటిలోనికి ప్రవేశించి తనపై దాడి చేసి తన పీక పిసికి చంపబోయినట్లు, ఇంకో వ్యక్తి ఇష్టం వచ్చినట్లు కాళ్ళతో తంతూ మర్మాంగాలపై కూడా తన్నినట్లు, మరో వ్యక్తి చాకుతో తనను చంపుతానంటూ బెదిరించి తన వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కొని, టేబుల్ పై ఉన్న పరుసు తీసుకున్నాడని, ఆ పర్సులో డబ్బులు ఉన్నాయని, టేబుల్ పై ఉన్న బ్యాగ్ ను తీసుకున్నాడని ఉమామహేశ్వర శాస్త్రి ఫిర్యాదు చేశారు.

నలుగురు అరెస్ట్.. పరారీలో మరి కొందరు..

ఈ కేసుపై విచారించిన అనంతరం నలుగురిని అరెస్టు చేశామన్నారు. ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని కాల్ టాక్స్ రోడ్డులో గడ్డం వినోద్, తాళ్లూరి గణేష్, దేవళ్ల వంశీ, అశోక్‌కుమార్‌ లను అదుపులోనికి తీసుకున్నామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ హత్యాయత్నానికి పధకం రచించడంలో కీలకంగా వ్యవహరించిన పూనూరు గౌతం రెడ్డి.. నిందితులకు 25 లక్షల సుఫారీ చెప్పినట్లు విచారణలో తెలిసిందన్నారు. పధకం ఆచరణలో బాగంగా పైన తెలిపిన నిందితులతో ఒప్పందం కుదిర్చిన అనిల్, పృథ్వీరాజ్, బిట్ర పురుషోత్తం, బండ శ్రీనులను ఇంకా అరెస్ట్ చేయవలసి ఉందన్నారు. ప్రస్తుతం వారు పరారిలో ఉన్నట్లు తెలిసిందని.. వీరికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

Updated Date - Nov 14 , 2024 | 12:01 PM